Search This Blog

Chodavaramnet Followers

Monday, 7 July 2014

HOW TO PERFORM SRI LAKSHMI KUBERA PUJA FOR WEALTH AND HEALTH


ఐశ్వర్యానికి అధిపతియైన కుబేరుని భక్తితో పూజించుకునేవారికి సకల సంపదలతోపాటు ఆయురారోగ్యభాగ్యాలు కలుగుతాయి
.
శుక్రవారంనాడు శ్రీ లక్ష్మీ కుబేరపూజ చేస్తే మంచిది. అష్టమి, నవమి తిధులు లేని శుక్రవారమైతే మరీ మంచిది.

శుక్రవారంనాడు శ్రీ లక్ష్మీ కుబేరపూజ చేయాలనుకున్నవారు ముందురోజు పసుపుకుంకుమ, కొబ్బరికాయ, చందనం, అరటి ఆకు, మామిడాకులు, తమలపాకులు, ఫలపుష్పాలు, సాంబ్రాణి, కర్పూరం, నవధాన్యాలు, అరటిపండ్లను సేకరించుకోవాలి. శుక్రవారంనాడు ఉదయాన్నే తలంటిస్నానం చేసి రాహుకాలం, యమగండాలు లేని సమయంలో పూజను ప్రారంభించాలి.

ముందుగా శ్రీ లక్ష్మీ కుబేరస్వామివార్ల చిత్ర పటాన్ని పీటపై పెట్టి, దానిని పసుపుకుంకుమలతో అలంకరించాలి. ఆ పటానికి ముందు అరటిఆకును పరచి, దానిపై నవధాన్యాలను పోసి, పలచగా సర్ది, దానిమధ్యలో ఒక చెంబును పెట్టి అందులో శుభ్రమైన నీరు పోయాలి. ఆ నీటిలో కాస్తంత పసుపు కలపాలి. తర్వాత చెంబులో మామిడాకులను నిలిపి, వాటి మధ్య పసుపు పూసిన కొబ్బరికాయను పెట్టాలి.

అనంతరం పూజాద్రవ్యాలను స్వామివారి చిత్రపటం ముందు పెట్టి దక్షిణగా కొంత చిల్లర డబ్బులను పటానికి ముందు ఉంచాలి. అనంతరం పసుపుముద్దతో వినాయక ప్రతిమలా చేసుకుని, అరటి ఆకుపై కుడిప్రక్కన అమర్చాలి. పసుపుముద్దగా ఉన్న వినాయకునికి కుంకుమను పెట్టి దీపారాధన చేసి, వినాయక ప్రార్ధన చేయాలి. ఆ తర్వాత పుష్పార్చన చేస్తూ లక్ష్మీ స్తోత్రాలను చదవాలి.

సరసిజ నిలయే, సరోజహస్తే
ధవళ తమాంశుక గంధమాల్యశోభే
భగవతి, హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్
అని స్తోత్రం చేసిన తర్వాత,
ఓం దనద సౌభాగ్య లక్ష్మీకుబేర
వైశ్రవణాయ మమకార్య సిద్ధిం కురుస్వాహా
అనే మంత్రాన్నిస్తోత్రం చేయాలి.

ఇలా మంత్రం చదివిన తర్వాత సాంబ్రాణి వెలిగించి, ధూపం వేసి, ఇంట్లో నాలుగు దిక్కుల్లో ఆ ధూపాన్ని ప్రసరింపజేయాలి. పండ్లను నైవేద్యంగా సమర్పించిన పిదప, కర్పూరహారతిని ఇస్తూ గంట మ్రోగించాలి. అలా పూజ ముగిసిన తర్వాత నైవేద్యంగా సమర్పించిన పండ్లను, తమలపాకులతో చేర్చి ముత్తైదువులకు పంచాలి.

ఐశ్వర్యసిద్ధి ప్రాప్తిరస్తు