శ్రీ వైకుంఠ రామాలయం ( భద్రాచలం ) :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, ఖమ్మం జిల్లా లో, గోదావరి నది దక్షిణ తీరమున భద్రాచలం పట్టణం ఉంది. జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్నది ఈ పట్టణం. భద్రాచలం పట్టణం పేరును ప్రభుత్వం 2002 లో 'శ్రీరామ దివ్యక్షేత్రం' పట్టణం గా మార్చింది.
క్షేత్ర ప్రాశస్త్యం :
మేరువుకు భద్రుడనే కొడుకున్నాడు. ఈయన ఒక పర్వతరాజు. ఇతడు గౌతమీ తీరంలోగల దండకారణ్యంలో ఘోరమైన తపస్సు చేసి శ్రీరామచంద్రుని సాక్షాత్కారాన్ని పొందాడు. శ్రీ రాములవారు వరం కోరుకొమ్మని అడిగితే కైలాసగిరి మీద శివుడలంకరించునట్లు తన శిఖరముమీద శ్రీ సీతారామలక్ష్మణ సమేతులైన తన శిఖరము నలంకరించి జీవులకు మోక్షసామ్రాజ్య మందించవలసినదని కోరుకొన్నాడు భద్రుడు. అతని కోరిక ప్రకారం అక్కడకు సీతాలక్ష్మణ సహితులైన రామప్రభువు వేంచేసి కొలువుదీరి యున్నాడు. ఇది పురాణ కధ.
రామాలయ ప్రాశస్తి :
గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానీషా పాలనా కాలంలో భద్రాచల ప్రాంతానికి తహసీల్దారుగా కంచెర్ల గోపన్న ఉండేవాడు. ఇక్కడికి సమీపంలోని నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను సొమ్మును ప్రభుత్వానికి జమ చెయ్యకుండా, ఈ రామాలయాన్ని నిర్మించాడు. దేవునికి రకరకాల నగలు - చింతాకుపతకం, పచ్చలపతకం మొదలైనవి - చేయించాడు.
ఆ సొమ్ము విషయమై తానీషా గోపన్నను గోల్కొండ కోటలో బంధించగా, ఆ చెరసాల నుండి తనను విముక్తి చెయ్యమని రాముణ్ణి ప్రార్ధించాడు, గోపన్న. ఆ సందర్భంలో రామునిపై పాటలు రచించి తానే పాడాడు. ఇవే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. గోపన్న కీర్తనలకు కరిగిపోయిన రాముడు, దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానీషాకు చెల్లించి, గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని చరిత్ర. ఆ విధంగా కంచెర్ల గోపన్నకు రామదాసు అనేపేరు వచ్చింది.
దేవాలయం భద్రగిరి అనే కొండపై ఉంటుంది. సీతా, లక్ష్మణ, హనుమంత సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ కొలువుతీరి ఉన్నాడు. సీతమ్మ రాముని తొడపై కూర్చొని ఉన్నట్లు ఇక్కడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది.
భధ్రాచలంలోని శ్రీరాముడిని వైకుంఠ రాముడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడి రాముడు వైకుంఠమునకు వెళ్ళిన తరువాత మరల భూమి మీదకి వచ్చి, తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్ర పర్వతంపై నిలిచినాడు.
శ్రీ రామ నవమి కళ్యాణోత్సవము :
ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేషప్రజానీకం వస్తారు. రాష్ట్రప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టువస్త్రాలు పంపించడం సాంప్రదాయం. జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకున్నది. కళ్యాణోత్సవమును తిలకించటానికి లక్షల మంది యాత్రికులు వస్తారు. ఉత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మెదలయిన ప్రముఖులు, ప్రభుత్వ అధినేతలు, అధికారులు గూడ పాల్గొంటారు. ఇక్కడ జరిగే కళ్యాణోత్సవ కార్యక్రమాలు ఆలిండియా రేడియో, టి.వి.ల్లో ప్రసారం చేయబడతాయి.
ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. రామదాసు చేయించిన వివిధరకాల నగలు దేవస్థానపు ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు.
స్వామి వారి నిత్యోత్సవాలు :
ప్రభాతసేవ, దంత ధావనోత్సవం, బాల భోగాది ఆరాధనలు, పవళింపు సేవ వరకు చూడవచ్చును. పునర్వసు నక్షత్రము గల రోజులు, ఏకాదశి, పూర్ణిమ తిధుల యందు, సంక్రమణముల యందు స్వామి వారికి అభిషేక, సహస్ర నామార్చన, గ్రామోత్సవాదులు చేయబడును.