Search This Blog

Chodavaramnet Followers

Friday, 25 October 2013

TELUGU SHORT STORY - LOVE U TELUGU


 ప రంధామయ్య అంటే ఆ ఊర్లో అందరికీ ఎంతో గౌరవం. అయన రిటైర్ అయిన తెలుగు ఉపాధ్యాయుడు. తెలుగు భాష మీద మమకారం తో రిటైర్ అయినా కూడా పిల్లలకి ఉచితంగానే ఇంటి వద్దే పాఠాలు చెప్తూ ఉంటారు. మనసు వెన్న ముద్ద. ఆ ఊర్లో వాళ్ళు తమ పిల్లలకి తెలుగు భాషతో పాటు పరంధామయ్య గారి మంచి మనస్సు కూడా లభిస్తుందని తమ పిల్లలని పరంధామయ్య వద్దకి పంపించేవారు.  మారుతున్న జీవన విధానం లో ఎంతో మంది పాశ్చాత్య పోకడలకు అలవాటు పడి తెలుగు భాషని నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆవేదన ఆయనని ఎంతగానో వేధిస్తోంది.


మధ్యతరగతి జీవితాన్నే ఇష్టపడే పరంధామయ్యకి విదేశాల్లో ఉన్న తమ మనవళ్ళకి తెలుగు మీద మమకారం అలవరచాలన్నది ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఆధునిక యుగం లో భార్యా భర్తలిద్దరూ ఉద్యోగాలతో ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు కూడా క్షణం తీరిక లేకుండా ఉంటూ  చిన్నప్పటినుంచే వారి పిల్లలు ఏం చదవాలో ముందే నిర్ణయించేసుకుంటున్నారు.

ప్రపంచం ఎంత ముందుకి వెళుతున్నా మాతృ భాషని నిర్లక్ష్యం చేస్తే కన్న తల్లిని నిర్లక్ష్యం చేసినట్టే అని మనవళ్ళకి తెలియదు. ఎందుకంటే ఉద్యోగం చేస్తున్న తల్లి తమ కోసం ఎప్పుడూ సమయం కేటాయించలేదు. డే కేర్ సెంటర్లలోనే వారి బాల్యం గడిచిపోయింది. తన దగ్గర మనవళ్ళని ఉంచుకుందామనుకుంటే పిల్లలు ఎలా చదువుతున్నారో వారికి తెలియదని కొడుకులు పంపలేదు.

పుట్టి పెరిగిన ఈ కన్నతల్లి లాంటి పల్లెటూరు ని విడిచి వెళ్ళడానికి పరంధామయ్య అయన భార్య శాంతలకి మనసొప్పలేదు. ఏడాదికొకసారి వచ్చే మనవళ్ళ పైనే పరంధామయ్య ప్రాణాలు ఉండేవి. వచ్చిన ప్రతీ సారి వారు కొత్తగా ఎంతో వేగంగా ఎదిగిపోతున్నట్టు కనిపించేవారు. ఆ ఉన్న కొన్ని రోజులూ ఆంగ్లంలో పలికే లేత పసి మొగ్గలకి కమ్మటి తెలుగు పదాలని, పద్యాలని అలాగే కొన్ని నీతి కథలని చెప్పేవారు.

కానీ ఏం లాభం, వారు తిరిగి విదేశాలకు వెళ్ళగానే తెలుగు భాషను సాధన చేయించేవారెవరూ లేక, మళ్లీ తిరిగి భారత దేశం వచ్చాక వారికి మాతృభాష విదేశీ భాషలా అనిపించేది.

పోటీతత్త్వంతో ఇంట్లోను, బయట ఎల్లప్పుడూ ఆంగ్లంలో నే సంభాషించవలసి వచ్చేది. ఎలాగైనా వారికి తెలుగు భాష లో ని కమ్మదనం తెలియచేయాలని అనిపించేది. కానీ ఎలాగో అర్ధం అయ్యేది కాదు.

ఏడాది గడిచింది. మనవళ్ళు 'గ్రాండ్ పా' అని పరిగెత్తుకు వచ్చారు'.

మనసు చివుక్కుమంది. మనవళ్ళు వచ్చారని సంతోషించాలో లేక అమితం గా అభిమానించే తెలుగుతనానికి దూరం అవుతున్నారని బాధపడాలో అర్ధం అవలేదు.

'వేర్ ఈజ్ గ్రానీ' అని చిన్న మనవడి ప్రశ్న.

వీళ్ళకు తెలుగు నేర్పించాలంటే నేను ఏదైనా గట్టి నిర్ణయం తీసుకోవాల్సిందే అని అనుకున్నారు, పరంధామయ్య.

కొడుకూ,కోడలు పరంధామయ్య ని పలకరించి ఆయన భార్య శాంతతో లోపలికి వెళ్లారు.

ఇంతలో పెద్ద మనవడు చింటూ పరంధామయ్య దగ్గరికి వచ్చి 'గ్రాండ్ పా, ఐ విల్ టీచ్ యు హౌ టు ఆపరేట్ ఎ కంప్యూటర్' అని అన్నాడు.

తరచూ అందుబాటులో ఉండటం కోసమని పరంధామయ్య కొడుకు ఇంట్లో ఒక కంప్యూటర్ ని ఏర్పాటు చేసాడు. వాళ్ళు విదేశాల నుండి వచ్చినప్పుడు మాత్రమే కంప్యూటర్ కి పని. పరంధామయ్య కి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మీద ఆసక్తి లేకపోవడం తో ఆ తరువాత ఎప్పుడూ మూగబోయే ఉంటుంది.

ఇది వరకు ఎన్నిసార్లు పెద్ద మనవడు కంప్యూటర్ నేర్పుతానన్నా ఈ ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి పరంధామయ్య దూరంగానే ఉండేవాడు.

కానీ మనవడిలో ఉత్సాహం చూసి 'చింటూ,సరేరా నేర్పు' అని అన్నాడు.

వాడు ఈ ప్రపంచాన్నే జయించినంత ఉత్సాహం తో తాతగారికి కంప్యూటర్ పాఠాలు చెప్పడం ప్రారంభించాడు.

"ఇది సి పి యు, ఇది మానిటర్" అని ఒక్కొకటి వివరించడం ప్రారంభించాడు.

ఇలా ఉన్న వారం రోజులలో తాత గారికి ఫేస్బుక్, స్కైప్, జిమెయిల్ వంటివి వాడటం ఎలాగో తెలియచేసాడు.

వాళ్ళ సెలవులు అయిపోయాయి అందరూ విదేశాలకి వెళ్ళిపోయారు. పరంధామయ్య మనసులో మళ్ళీ వేదన.

ఆ తరువాత పరంధామయ్య తిరిగి తన దైనందిన జీవితం లో కి వెళ్ళిపోయాడు.

రోజూ ఉదయాన్నే ప్రారంభమయ్యే తెలుగు పాఠాలు అలా నిర్విరామంగా కొనసాగుతూనే ఉండేవి. నేర్చుకునే వారికి  బోర్ కొట్టేదేమో కానీ పరంధామయ్య మాత్రం తెలుగు అంటేనే ఎక్కడ లేని ఉత్సాహం తో పాఠాలు చెప్తూ ఉంటారు. ఇంతలో ఒక సారి తన పెద్ద మనవడి నుంచి ఫోన్ వచ్చింది. 'ఏంటి తాతయ్యా, నువ్వు ఆన్ లైన్ కి ఎందుకు రాలేదు. ఐ యాం వెయిటింగ్ ఫర్ యు' అని. కనీసం తెలుగులో కొంతైనా తన మనవడు మాట్లాడినందుకు ఎంతో సంతోషించాడు పరంధామయ్య.

ఇంతలో మెరుపు లాంటి ఆలోచన. తన ఆలోచనలని అమలులో కి పెట్టడం ప్రారంభించాడు.

స్కైప్ లో కి లాగిన్ అయ్యి వెంటనే మనవడితో వీడియో కాల్ ని ఆక్టివేట్ చేసాడు. ఇలా రెండు మూడు రోజులు గడిచాక మెల్లగా తెలుగు లో నే మాట్లాడుతూ మనవడిని కూడా తనతో తెలుగు లో నే మాట్లాడాలనే షరతు విధించాడు.

అలా వారం రోజులు గడిచాక, మనవడికి తెలుగు అక్షరాలూ డెస్క్ టాప్ షేరింగ్ సహాయం తో నేర్పాడు. ఏక సంధాగ్రాహి అయిన మనవడు చాలా తక్కువ రోజుల్లోనే తెలుగు అక్షరాల్ని నేర్చుకున్నాడు.

మెల్ల మెల్లగా రామాయణ, మహాభారత ఇతిహాసాల గురించి మనవడికి కబుర్లు చెప్పేవాడు పరంధామయ్య. అలా తెలుగు భాష కి మాత్రమే ప్రత్యేకమైన పద్యాలు కూడా నేర్పించాడు. మహా కావ్యాలు, రచయితలు, కవుల గురించి ఎంతో ఆసక్తికరంగా మనవడికి వివరించేవాడు పరంధామయ్య.

తెలుగు భాష లో ని కమ్మదనాన్ని తెలుసుకున్న మనవడు ఒక్క రోజు తాతయ్య ఆన్ లైన్ కి రాకపోయినా తనతో తెలుగులో సంభాషించే వారు లేక బెంగపెట్టుకునే వాడు.

క్రమ క్రమం గా తెలుగు భాష లో ఉన్న కథలు, నవలలు , గ్రంధాల ఈ బుక్ లు మనవడికి పంపించేవాడు.

ఏడాది గడించింది. తిరిగి మనవళ్ళు అందరూ ఇంటికి వచ్చారు.

అటు ఆంగ్లం, ఫ్రెంచ్ వంటి విదేశీ భాషలతో పాటు అచ్చ తెలుగులో అనర్గళం గా మాట్లాడగల పెద్దమనవడిని చూసి అందరూ ఆశ్చర్య పోయారు. ఒక్క పరంధామయ్య గారి ఆవిడ తప్ప.

వాడు తెలుగు ఎలా నేర్చుకున్నదీ చక్కగా అందరికీ వివరంగా తెలియచేసాడు. వాళ్ళ అమ్మా నాన్నలకు ఒక చిన్నపాటి షాక్ కూడా ఇచ్చాడు.

ఇకపై తను ఈ పల్లెటూరి లో నే పరంధామయ్య తో పాటే ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలియచేసాడు. చిన్నప్పటినుంచి అమ్మా నాన్నల ప్రేమకి నోచుకోని తనకి తాతయ్య, నాన్నమ్మల ప్రేమతో పాటు తెలుగు భాష లో ని తీపి కూడా ఇక్కడ ఉండి రుచి చూడాలనేది వాడి కోరిక.

వాడిలో వచ్చిన మార్పుకి పరంధామయ్య గారి కళ్ళు చెమర్చాయి.

తన కోరిక ని తీర్చిన ఆధునిక టెక్నాలజీ కి మనసులో కృతజ్ఞత చెప్పుకున్నారు పరంధామయ్య.

Title:

Gotelugu Weekly Telugu Magazine


Description:

Gotelugu is a highly browsed free Telugu weekly eMagazine. Gotelugu provides Telugu stories, Telugu articles, serials, movie reviews, movie gossips, movie interviews, cinema updates, recipes, cartoons, Telugu jokes and many more.



Gotelugu Magazine Details

Language     :       Telugu
Frequency    :       Weekly
Country        :       India
Magazine     :       http://www.gotelugu.com
Registration :      Not Required
Price             :      Free ( Rs. 0/-)