శరీర వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే రక్తం సరియైన పాళ్లలో ఉండాలి. రక్తం సరియైన పాళ్లలో ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. కానీ చాలా మంది ఈ రెండింటి విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఫలితంగా రక్తహీనతతో బారినపడుతున్నారు. హీమోగ్లోబిన్ శాతం పురుషుల్లో 12 కన్నా తక్కువ, స్త్రీలలో 10 కన్నా తక్కువ ఉన్నట్లయితే రక్తహీనత ఉన్నట్లుగా భావించాలి.
లక్షణాలు
రక్తహీనత ఉన్న వారిలో ప్రధానంగా కనిపించే లక్షణాలలో నీరసం, త్వరగా అలసిపోవడం, చిన్న పనిచేసినా అలసట రావడం, బలహీనంగా ఉండటం వంటివి ఉంటాయి. హీమోగ్లోబిన్ శాతం ఇంకా తక్కువయితే ఆయాసం, దడ, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెటబాలిజంపై ప్రభావం పడుతుంది. మెదడుకు రక్తసరఫరా తగ్గి ఇతర సమస్యలకు దారితీయవచ్చు. గుండెపై ప్రభావం పడవచ్చు. ఏకాగ్రత కోల్పోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటివి జరగవచ్చు.
కారణాలు
రక్తహీనతకు ప్రధాన కారణం రక్తం పోవడం. స్త్రీలలో పీరియడ్స్ సమయంలో రక్తస్రావం జరుగుతుంటుంది. ఇది సాధారణమే అయినా కొందరు స్త్రీలలో అధిక రక్తస్రావం అవుతుంటుంది. ఐదు రోజుల కన్నా ఎక్కువ రక్తస్రావం ఉంటుంది. ఇటువంటి వారిలో రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. కొందరిలో ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. వాటి నుంచి రక్తస్రావం అవుతుంటే ఎనీమియాకు దారితీయవచ్చు. పురుషుల్లో రక్తహీనతకు కారణం పైల్స్(అర్షమొలలు). ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. దీర్ఘకాలంగా మలవిసర్జనలో రక్తం పడుతున్నా నిర్లక్ష్యంగా ఉంటారు. ఫలితంగా రక్తహీనత మొదలవుతుంది. కడుపులో అల్సర్ సమస్య ఉన్నా రక్తహీనత రావచ్చు.
ఈ సమస్యలే కాకుండా పోషకాహార లోపం కూడా కారణమవుతుంది. విటమిన్ బి12, ఫోలిక్‌యాసిడ్ లోపాల వల్ల కూడా రక్తహీనత ఏర్పడుతుంది. శాకాహారుల్లో విటమిన్ బి 12 లోపం ఎక్కువగా ఉంటుంది. చిన్న పిల్లల్లో పొట్టలో నులిపురుగులు(హెల్మింథిస్) ఏర్పడుతుంటాయి. ఇది కూడా రక్తహీనతకు కారణమవుతుంది. కొన్ని కారణాల వల్ల రక్తంలో ఎర్రరక్తకణాలు చనిపోతుంటాయి. దీన్ని హీమోలైటిక్ ఎనీమియా అంటారు. ఇది ఎనీమియాకు దారితీస్తుంది. బ్లడ్ కేన్సర్ వల్ల కూడా రక్తహీనత ఏర్పడుతుంది.
నిర్ధారణ
కంప్లీట్ బ్లడ్ పిక్చర్(సీబీపీ) అనే పరీక్ష హీమోగ్లోబిన్ శాతం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది చాలా సాధారణమైన పరీక్ష. ఒకవేళ ఇంటర్నల్‌గా బ్లీడింగ్ జరుగుతున్నది తెలుసుకోవడానికి, అల్సర్‌ను కనిపెట్టడానికి ఎండోస్కోపి, కొలనోస్కోపి పరీక్షలు ఉపకరిస్తాయి. కేన్సర్‌ను గుర్తించడానికి బోన్‌మ్యారో అస్పిరిషేన్ పరీక్ష ఉపయోగపడుతుంది. సీరం ఐరన్, సీరం ఫోలేట్, సీరం బి12 వంటి పరీక్షలు విటమిన్ డెఫిషియెన్సీ తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. హీమోలైటిక్ ఎనీమియాను తెలుసుకోవడానికి కూంబ్స్ టెస్ట్ అవసరమవుతుంది.
చికిత్స
స్త్రీలు పీరియడ్స్ సమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉన్నట్లయితే గైనకాల జిస్ట్‌ను సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలి. రక్తహీనత సమస్య తగ్గాలంటే ఐరన్ ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. గుడ్లు, పాలు, మాంసాహారం ఎక్కువగా తినాలి. డాక్టర్ సలహా మేరకు ఐరన్ టాబ్లెట్స్ రెండు, మూడు నెలలు తీసుకోవచ్చు. హీమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటే రక్తం ఎక్కించుకోవాల్సి వస్తుంది. బి12 డెఫిషియెన్సీ ఉంటే ఇంజక్షన్ రూపంలో తీసుకోవచ్చు. నెలకొకసారి ఒక ఇంజక్షన్ తీసుకుంటే సరిపోతుంది.
మాంసాహారం తీసుకోని వారు, బి12 లోపం ఎక్కువగా ఉన్న వారు డాక్టర్ సలహా మేరకు ఈ ఇంజక్షన్ తీసుకోవచ్చు. హీమోలైటిక్ ఎనీమియా ఉంటే స్టెరాయిడ్ ఇంజక్షన్, మందులు వాడాల్సి ఉంటుంది. పిల్లల్లో నులి పురుగులు ఉంటే యాంటీ హెల్మింథిస్ మందులు ఇవ్వడం ద్వారా పరిష్కారం లభిస్తుంది. రక్తహీనతకు సంబంధించి లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తగిన కారణం తెలుసుకుని చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.