Search This Blog

Chodavaramnet Followers

Showing posts with label Festival Articles. Show all posts
Showing posts with label Festival Articles. Show all posts

Friday, 29 December 2017

IMPORTANCE OF VYKUNTA EKADASI FESTIVAL ARTICLE IN TELUGU


వైకుంఠ ఏకాదశి నాడు జరిపే ఉత్తర ద్వారా దర్శనం ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?:

అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించి, స్వామి అనుగ్రహం పొంది, రాక్షస పీడ వదిలించుకున్నారు. 
ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనాను గ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. దీన్నే హరివాసరమని, హరిదినమని వైకుంఠ దినమని అంటారు.

ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు "వైకుంఠ ఏకదశీ వ్రతం" ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.
అలాగే కృత యుగంలో "ముర" అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకున్నారు. భగవంతుడు మురాసురుడి మీదికి దండెత్తి, అతని వధించాడు. ముర వెళ్లి సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని బైటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకున్నాడు.
అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు ఏకాదశి అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని పురోహితులు అంటున్నారు.
వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులీ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రత మాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోను ప్రాత: కాలం నుంచీ ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోని ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నారు.
అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి.
ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరు జన్మంటూ ఉండదు

VYKUNTA EKADASI FESTIVAL ARTICLE 2017 COLLECTED FROM CHANDAMAMA KATHALU FB PAGE


అనంతమైన పుణ్యఫలం అని చెప్పుకోవాలి. భారతీయులు కాంతిని ఆరాధించేటటువంటి వారు. ప్రాజ్ఞ్ముఖంగా ప్రయాణించేటటువంటి వారు. దేహంలో ఎప్పుడూ కూడా ఎడమ భాగాన్ని కుడి భాగం నియంత్రిస్తూ ఉంటుంది. వామ భాగం స్త్రీ సంబంధితమైనటువంటి భాగం. ప్రేమ, పారమార్థిక దృష్టి, లౌకిక సుఖములు, ఆనందములు ఇవన్నీ కూడా ఉత్తర దిక్భాగంలో ఉంటాయి. వీటన్నింటినీ నియంత్రించేది ఎడమ భాగం. అలాగే మన దృష్టి కూడా నిరంతరం ఎడమ వైపుకే ప్రసరిస్తూ ఉంటుంది. ఉత్తరం దిక్కుకు ధనము, సంపద వంటి వాటికి ప్రాముఖ్యత ఉంది. అన్నింటికంటే మించి ఈ విశాల విశ్వమంతా కూడా తన చుట్టూ తానూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనుకుంటే ఈ విశ్వంలో ఉండే అంతర్భాగము axil అంటారు దానిని అది దీనికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది. ఈ విశ్వము దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపుకు anti clockwise తిరుగుతూండగా అందులోని అంతర్భాగం ఉత్తరం వైపునుంచి దక్షిణానికి clockwise తిరుగుతుంది. "ప్రాగ్ ఆరభ్య దక్షిణేణ వర్తనం" మన హిందూ ధర్మంలో అందుకోసమే ఆలయానికి వెళ్తే ప్రదక్షిణ చేయాలి - ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం. ఉత్తరంగా, ఈశాన్యంగా, తూర్పుగా, ఆగ్నేయం, దక్షిణం ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. కనుక ఈ రెండింటి మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమిమీద అంటిపెట్టుకొని ఉన్నాం దానికే భూమ్యాకర్షణ శక్తి అని పేరు.
ఈరోజున ఉత్తర దిగ్భాగ మార్గాన్ని అనుసరించి ఇంక రెండు మూడు రోజులలో సూర్యనారాయణ మూర్తి ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తూంటాడు. ఈరోజున మనం ఉత్తర దిగ్భాగంతో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుంది. ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాము. భవ బంధనాలన్నీ కూడా తొలగిపోతాయి. అనేటటువంటి రహస్యాన్ని కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చెప్తే అందరికీ అర్థం అవుతాయో లేదో అనే ఉద్దేశ్యంతో కథలను జోడించి విభీషణ శరణాగతి కథ, వైకుంఠ ఏకాదశి కథ, ముప్పది మూడు కోట్ల దేవతలతో ఆ స్వామి ఈనాడు మనకు దర్శనమిస్తాడు. మూడు కోట్లతో రంగధాముని దర్శనమిస్తాడు. ఇలా చెప్పి ఆలయాలవైపు మనల్ని మరల్చారు. స్వామి దర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞనిచ్చారు. మన ప్రయత్నం కాకుండా గురువుతో ప్రయత్నం కావాలి. స్వప్రయత్నం కూడదు అంటుంది ధర్మము. కాబట్టి నారాయణుడే అటువంటి మనలో జ్ఞానమును ప్రేరేపించు వాడు. ఆయన ప్రపన్నుడు. అడిగిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చే ప్రపన్నుడు. ఎవరిని రక్షించాలా? అని సంసిద్దుడై ఉంటాడుట. కాబట్టి ఉత్తర ద్వార దిశగా మనం ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నేరవేరుతాయి. అన్నింటికంటే కోరవలసినది ఏమున్నది? - ఈ లోకంతో భవ బంధనాలనుంచి విముక్తి. మోక్షము అంటే "ముచిల్ మోక్షణే" అని అర్థం. బంధనాలనుంచి ముక్తిని పొందడము, విముక్తిని కలిగించుకోవడము అని అర్థం. అందుకే ఉత్తర దిశ ఇంత ప్రాముఖ్యం కలది, ఇంతగా విశేషత ఈ పండుగకు ఉన్నది.

Wednesday, 20 August 2014

VINAYAKA CHAVITHI FESTIVAL ARTICLES IN TELUGU - WHY POOJA TO BE PERFORMED LORD GANESH STATUE MADE WITH CLAY ?




వినాయక చవితి సమీపిస్తున్నందున వినాయక చవితికి సంబంధించి మట్టి గణపతినే పూజించడం ఎందుకు? గణపతి నిమజ్జనం ఎందుకు? పత్రిపూజ ఎందుకు? గణపతి తత్వం ఏమిటి? వినాయకచవితి నివేదనలోని ఆయుర్వేద రహస్యాలు ఏమిటి? మొదలైన అంశాలను గణపతి అనుగ్రహంతో రోజు అందించే ప్రయత్నం చేస్తాను. - 1

ఓం గం గణపతయే నమః 

అసలు మట్టి వినాయకుడినే పూజించడం ఎందుకు?

గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతులవారిని శౌనకాదులు ఒక సందేహం అడిగారు. "ఓ మహర్షి! ఈ వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి? పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి?"

"మునీంద్రులారా! మంచి ప్రశ్నలు వేశారు. వినండి. పరమేశ్వరుడు విశ్వవ్యాపిత (అంతటా ఉన్నది పరమాత్ముడే) తత్వము కలిగినది భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి, గణపతి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని(అంతటా, అన్నింట అంతర్లీనంగా ఉన్నది గణపతే) ప్రకటించాడు. విశ్వవ్యాపకత్వము కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి. దాని నుండి లభించే పోషక పదార్ధాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి. చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి. ఇదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం. ఈ సత్యమును చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూలరూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు (లింగపురాణం గణేశ ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రుపాన్ని మట్టితో తయారుచేశాడు). మృత్తికయే పరబ్రహ్మ కనుక, #మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది. అంతేకాదు మట్టి ఎక్కడైనా, ఎవరికైనా లభిస్తుంది, దానికి బీదా, ధనిక అనే తారతమ్యం లేదు. సర్వ సమానత్వమునకు ఏకైక తార్కాణం భుమి/మట్టి/వసుధ. బంగారంతో విగ్రహం కొందరే చేయించుకోగలరు. విఘ్నేశ్వరుడు అందరివాడు. అందుకే అందరివాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించే ఆచారాన్ని పరమశివుడే ప్రారంభించాడు. నేడు సమస్తమానవాళి ఆచరిస్తోంది. సర్వజీవ సమానత్వమునకు ప్రతీక మట్టి వినాయకుడు. అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం, పూజ" అని చెప్పాడు సూతుడు.

మట్టి గణపతులనే ఆరాధించడమే మన సంప్రదాయం. మట్టి గణపతులనే పూజించండి. తద్వారా జరిగే కాలుష్యాన్ని నివారించండి.

ఓం గం గణపతయే నమః

ARTICLE ON SECRET / SCIENTIFIC REASON BEHIND SRI GANESH CHATHURDHI POOJA / LORD GANESH PUJA / VINAYAKA CHAVITHI FESTIVAL




!! OM MAHAGAPATIMBHAJHEY !!

ఓం గం గణపతయే నమః


‪‎పత్రి‬ పూజ వెనకున్నశాస్త్రీయ కారణం ఏమిటి?

వినాయక చవితి వర్షాకాలంలో వస్తుంది. ప్రకృతి అంతా పచ్చగా ఉంటుంది. చెట్లు త్వరగా పెరుగుతాయి. అదే సమయంలో రోగాలు కూడా త్వరగా వ్యాపిస్తాయి. మన గణపతికి సమర్పించే ఏకవింశతి‬ పత్రాలను (21 రకాల పత్రిని) ముట్టుకోవడం వేత, వాసన పీల్చడం చేత ఈ కాలంలో వచ్చే అనేకానేక వ్యాధులు నివారించబడుతాయి. ఎందుకంటే ఈ 21 రకాల పత్రికి ఎన్నో అధ్భుతమైన ఔషధ గుణాలున్నాయి. మన స్వామికి సమర్పించిన పత్రి యొక్క వాసన ఇల్లంతా వ్యాపించడం వలన, ఇంట్లో ఉన్న క్రిములను నశిస్తాయి.

9 రోజులపాటు వరసిద్ధి వినాయకుడికి పత్రిపూజ చేయాలని చెప్తారు. ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు ఆ గణపతి విగ్రహం వద్ద కూర్చుని భజనలు, నృత్యగీతాలతో గడుపుతాం కనుక, 9 రోజుల పాటు ఈ పత్రి నుంచి వచ్చే ఔషధ గుణాలు సమ్మిళ్ళితమైన వాయువు మన శరీరంలో రోగనిరోధక శక్తిని వృద్ధి చేసి, ఇంతకముందు చేరి ఉన్న రోగకారక క్రిములను నశింపజేసి, సంవత్సరం మొత్తం ఆరోగ్యంగా ఉంచుతుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది.

వర్షాకాలంలో ఎక్కడెక్కడి నుండో వచ్చి బురద నీరు చెరువుల్లో చేరుతుంది. ఆ నీటిలో క్రిములుంటాయి. ఆ నీరు తాగడం చేత అనారోగ్యం కలిగే అవకాశం ఎక్కువ. అందుకే వినాయక ప్రతిమతో పాటు ఆ పత్రిని కూడా నీటిలొ వదిలితే, పత్రిలో ఉన్న ఔషధ గుణాల కారణంగా నీటి శుద్ధి జరుగుతుంది. నీటిలో అసహజమైన రసాయనాలు కలిపి శుద్ధి చేసేకంటే, సహజమైన పద్దతిలో, ప్రకృతి ప్రసాదించిన ఓషధుల చేత నీటిని శుద్ధి చేయడం శ్రేయస్కరమని భావించారు మన పూర్వీకులు. అట్లాగే మనకు అవసరమైన నీటిని, భూమిని, గాలిని శుద్ధి చేసుకోవడమే ఈ పండుగలో ఉన్న రహస్యం. ఈ విధంగా ఒక ప్రాంతం, రాష్ట్రం, దేశమంతా చేయడం వలన అందరూ ఆరోగ్యంతో సంతొషంగా ఉంటారు. ఆరోగ్యవంతమైన ప్రజలున్న దేశం మాత్రమే అభివృద్ధి చెందగలుగుతుంది. దానికి దోహదం చేస్తున్నది వినాయకచవితి. అందుకే వినాయకచవితి ఆయుర్వేదఆరోగ్య‬ పండుగ అంటారు ఆయుర్వేద వైద్యులు ఏల్చూరి రాజారంజిత్ గారు.

ఏదైనా ఒక పండుగ, లేదా పూజ చేస్తున్నామంటే, అది మనకు మాత్రమే కాదు, మన సమాజానికి, దేశానికి, ప్రపంచానికి మేలు చేయాలన్న తపన కలిగిన పరమ నిస్వార్ధపరులు మన ఋషులు. ప్రతి పనిలోనూ విశ్వమానవ కల్యాణం గురించి కాంక్షించిన మహాపురుషులైన ఋషుల వారసత్వం మనదని సగర్వంగా చెప్పుకుందాం. ధర్మాన్ని, దేశాన్ని, ప్రకృతిని కాపాడుకుందాం. భావితరాలకు అందిద్దాం.

ఓం గం గణపతయే నమః

Saturday, 7 December 2013

SPECIAL ARTICLE ON THE OCCASION OF SUBRAHMANYA SHASTI IN TELUGU - TODAY 08-12-2013 SUNDAY - SUBRAHMANYA SHASTI FESTIVAL SPECIAL BHAKTHI ARTICLE IN TELUGU


అద్భుత ఫలప్రదాయకం శ్రీ సుబ్రహ్మణ్య షష్టి

శ్రీ గాంగేయం వహ్నిగర్భం శరవణ జనితం జ్ఞానశక్తిం కుమారం 
బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమల గుణం రుద్ర తేజస్వరూపం
సేనాన్యం తారకఘ్నం గురుమచలమతిం కార్తికేయం షడాన్యం
సుబ్రహ్మణ్యం మయూరధ్వజ రథ సహితం దేవదేవం నమామి


కుమార, కార్తికేయ, సుబ్రహ్మణ్య, షణ్ముఖ మొదలైన నామములతో పిలవబడే స్కందుడు
శివుని తేజస్సు, ఆయన ఆజ్ఞా చక్రమునుండి పెల్లుబుకి స్కందుని రూపము పొందినదట.
అందుకనే స్కందుడు జ్ఞాన జ్యోతిగా ప్రతీక.
జ్ఞాన రూపమైన శివుని మూడో నేత్రమునుండి జన్మించిన వాడు కాబట్టి కార్తికేయుడు
శరవణమను సరస్సులో రెల్లు గడ్డి పెరిగే చోటనున్న ఆరు కమలముల నుండి పార్వతీ దేవి ఈ స్కందుని తీసుకున్నదట.
సర్వోన్నత ఆధ్యాత్మిక అనుభూతి అనేది యోగములో షడ్చక్రముల భేదన ద్వారా కలుగుతుంది.
ఈ ఆరు చక్రముల భేదన ద్వారా జీవ శక్తి సహస్రార చక్రమున పూర్ణ యొక స్థితిని అనుభూతి పొందుతుంది. దీనికి సంకేతమైన ఆరు కమలములనుండి ఆవిర్భవించిన స్కందుడు సర్వోన్నత జ్ఞానమునకు, బుద్ధికి ప్రతీకగా నిలిచాడు.
అందుకనే స్కందుడు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించే( ఈ ప్రపంచములో అజ్ఞాన రూపమైన అసురులను సంహరించే దైవిక శక్తి) పరిపూర్ణ జ్ఞాన స్వరూపముగా కొలవబడుతున్నాడు.
ఈ అసురులను జయించే రోజునే స్కంద షష్టిగా పూజించబడుతున్నది.

Friday, 1 November 2013

DEEPAVALI FESTIVAL SAFETY TIPS IN TELUGU TO ALL CHILDRENS/KIDS; OFCOURSE BIGH PEOPLE - SAFE DIWALI FESTIVAL 02-11-2013





SAFETY / PRECAUTIONARY MEASURES TO BE TAKEN
TO PERFORM DEEPAVALI FESTIVAL 2013.
DEAR MOM'S AND DAD'S, PLZ TAKE SPECIAL CARE TO CHILDREN
WHILE USING CRACKERS.

HAPPY DEEPAVALI FESTIVAL MY FRIENDS

DEEPAVALI FESTIVAL ARTICLE IN TELUGU - THE IMPORTANCE OF LIGHTINING OF LIGHT / DEEPAM ON DIWALI AND ALL FESTIVAL OCCASIONS



Thursday, 18 April 2013

VIJAYA NAMA TELUGU UGADI - RAASI RETULS 2013-2014



‘విజయ’ నామ సంవత్సర రాశి ఫలితాలు




నవనాయకత్వాలు

విజయ నామ సంవత్సరంలో రాజు (గురుడు) మంత్రి (రవి) సేనానాయకుడు (శుక్రుడు) సస్యాధిపతి (కుజుడు) ధాన్యాధిపతి (చంద్రుడు) అర్ఘ్ధాపతి (శని) మేఘాధిపతి (శని) రసాధిపతి (గురుడు), వీరసాధిపతి (కుజుడు) అయి ఉన్నారు.
రాజు గురుడు అయినందున బ్రాహ్మణులు, జన సామాన్యము యజ్ఞ యాగాది క్రతువులందు ఆసక్తిని చూపుదురు. పాలకులు సన్మార్గులై న్యాయ మార్గమున ప్రవర్తించుదురు. ప్రజలకు సుభిక్షము, ఆరోగ్యము, సుఖము లభించును. వర్షములు బాగా కురియును.

మంత్రి రవి (సూర్యుడు) అగుటవలన పాలకుల మధ్య పరస్పర శతృత్వము, కొట్లాటలు, అనావృష్టి, ప్రజల అధర్మ ప్రవర్తన కానవచ్చును.

సేనాధిపతి శుక్రుడు అగుటవలన మంచి వర్షములు కురిసి పంటలు బాగుగా పండును. వివిధ వస్తువులకు మంచి ధరలు వచ్చును. స్ర్తి పురుషులు సుఖ జీవనమునందు ఆసక్తులు అగుదురు.
సస్యాధిపతి కుజుడు అగుటవల్ల మెట్ట భూములలో మంచి వర్షములు పడి సెనగలు, కందులు, పెసలు మొదలగు పంటలు బాగా పండును.

ధాన్యాధిపతి చంద్రుడు అగుటవలన పశువులు మంచి ఆరోగ్యం కలిగి హెచ్చుగా పాలు ఇవ్వగల్గును. మంచి వర్షములతో భూమి సుభిక్షంగా ఉండును.

అర్ఘ్ధాపతి శని అగుటవలన మధ్యమ వర్షములు కలిగి ప్రజలు అప్పుడప్పుడు రోగ, చోర, అగ్ని భయాదులకు లోనగుదురు. నల్లధాన్యములు మెండుగా పండును.

మేఘాధిపతి శని అగుటవలన పంటలు మధ్యమమూ ధరలు అధికము, అకాల వర్షములు స్వల్ప వర్షములు కలుగును. నల్లని ధాన్యములు నువ్వులు బాగుగా పండును.

రసాధిపతి గురుడగుటవలన అన్ని పంటలకు అనుకూలమైన వర్షము కలుగును. ప్రజలు ఆరోగ్యవంతులై సుఖంగా ఉండును.
వీరసాధిపతి కుజుడు అగుటవలన అన్ని వస్తువుల ధరలు పెరుగును. మంచి గంధము, కస్తూరి మున్నగు సుగంధ ద్రవ్యములు, వస్తమ్రుల ధరలు బాగా పెరుగును.

ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు

రాశి ఆదాయం-వ్యయం రాజపూజ్యం - అవమానం

1.మేషం 11-5 2-4
2.వృషభం 5-14 5-4
3.మిథునం 8-11 1-7
4.కర్కాటకం 2-11 4-7
5.సింహం 5౫ 7-7
6.కన్య 6-11 3-3
7.తుల 5-14 6-3
8.వృశ్చికం 11-5 2-6
9.ధనస్సు 14-11 5-6
10.మకరం 2-8 1-2
11.కుంభం 2-8 4-2
12.మీనం 14-11 7-2

రాశులు- ఫలితాలు

మేషం (అశ్వని, భరణి, కృత్తిక లేక ఏప్రిల్ 15- మే 14)

స్థితిగోచారం దృష్ట్యా ఈ రాశివారికి జూన్ 30 వరకు గురుడు ద్వితీయమందు లోహమూర్తి తర్వాత తృతీయమందు సువర్ణమూర్తి. శని సప్తమంలోనూ రాహుకేతులు సప్తమ, జన్మరాసులలోను సంవత్సరమంతా సువర్ణమూర్తులు. వేధగోచారం దృష్ట్యా గురుడు 16 మే వరకు తిరిగి సెప్టెంబర్ 1 నుండి 16 వరకు శుభుడు. శని ఈ సెప్టెంబర్ 1 నుండి 16 వరకు పాపి. రాహువు సంవత్సరం అంతా శుభుడు. కేతువు నవంబర్ 3 నుండి సంవత్సరాంతం శుభుడు. ఈ స్థితి వేధగోచారాలు రెండూ మిశ్రమ ఫలితాలను మాత్రమే ఇవ్వగలవిగా ఉన్నాయి. అందువల్ల ఏ విషయంలోను పెద్ద ఆశలు పెట్టుకొని ప్రయోజనం ఉండదు. అయితే తలపెట్టుకున్న పనులు అసలే ముందుకు సాగక నిరాశ, నిస్పృహలతో జీవితం కొనసాగించాల్సిన అవసరం ఉండదు. ఈ సంవత్సరం మీ వివిధ ప్రాజెక్టులకు అయే ఖర్చులకు సరిపడా ఆదాయం మీకు సకాలంలో లభించడం మీకు ఆనందాన్ని మనశ్శాంతినీ కలుగజేస్తుంది. ఒక్కొక్కప్పుడు పరిస్థితులు ఆందోళన కలిగించేవిగా ఉన్నా మీరు సమయానుకూలమైన నిర్ణయాలు తీసుకొని ప్రగతిని సాధించగల్గుతారు. హెచ్చు శుభాలు జూలై - ఆగస్టు నెలల్లో సిద్ధిస్తాయి.

వృషభం (కృత్తిక 2, 3, 4, రోహిణి మృగశిర 1, 2 లేక మే 15- జూన్ 14)

స్థితిగోచారం దృష్ట్యా గురుడు జూన్ 30 వరకు జన్మరాశిలో సువర్ణమూర్తి. తర్వాత ద్వితీయమున తామ్రమూర్తి. శని షష్ఠంలో తామ్రమూర్తి. రాహుకేతువులు షష్ఠవ్యయాలలో లోహమూర్తులు. వేధగోచారం దృష్ట్యా గురుడు సెప్టెంబర్ 1 నుండి 21 వరకు శుభుడు. కాని శని, రాహు కేతువులు మాత్రం సంవత్సరం అంతా పాపులు. శని రాహువులు షష్ఠ స్థితి, గురుడు జన్మరాశిలో సువర్ణమూర్తి స్థితి ఈ సంవత్సరం కొంత ప్రగతిని సాధించిపెట్టగల్గుతాయి. కాని స్థితి గోచారం మిశ్రమంగా ఉండి వేధగోచారం ప్రతికూలంగా ఉండటంవల్ల ఆరోగ్యం దాదాపు సంతృప్తికరంగానే ఉన్నా ఏవో స్వల్ప అసౌకర్యాలు మాత్రం తప్పక పోవచ్చు. కొన్ని వ్యవహారాలలో ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి విషయంలో గతంకంటె మేలుగానే ఉన్నది అనిపించినా మధ్య మధ్య కొన్ని విఘ్నాల కారణంగా మధ్యమ స్థాయి ఆదాయం పొందగల్గుతారు. విద్యార్థులు కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొనవలసి వచ్చినా మంచి మార్కులతో పరీక్షలలో ఉత్తీర్ణులు కాగల్గుతారు. వివాహాది శుభకార్యాలు కూడా కొద్దికాలం వాయిదా పడవలసి వచ్చినా విజయవంతంగా నిర్వహింపబడతాయి. దూరదేశ ప్రయాణాలకు అవకాశం ఉంది. వ్యవసాయ రంగం మంచి ఫలితాలను ఇస్తుంది.

మిథునం (మృగశిర 3, 4, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 లేక జూన్ 15 - జూలై 15)

స్థితిగోచారం దృష్ట్యా గురుడు జూన్ 30 వరకు వ్యయమందు తామ్రమూర్తి. తర్వాత సంవత్సరాంతం జన్మరాశిలో రజతమూర్తి. శని పంచమంలో సంవత్సరం అంతా రజతమూర్తి. రాహు కేతులు 5-11లలో సువర్ణమూర్తులు. వేధగోచారం దృష్ట్యా గురుడు ఏప్రిల్ 29 వరకు మాత్రమే శుభుడు. శని సంచారం 4వరకు పాపి. రాహువు జూలై 1 వరకు శుభుడు. కేతువు సంవత్సరం అంతా శుభుడు. స్థితిగోచారం సాధ్యమైనంత అనుకూలంగానే ఉన్నా వేధగోచారం దృష్ట్యా మిశ్రమ ఫలితాలే సూచించబడుతున్నాయి. అందువల్ల ప్రతి విషయంలోనూ తుది ఫలితాలు అనుకూలంగానే ఉన్నప్పటికీ ఆ ఫలితాలు లభించే వరకు చాలా ఆందోళన స్థితిని ఎదుర్కొనవలసి రావచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు అంతగా అనుకూలం కాజాలవు. ఉద్యోగాలలో ఉన్నవారు తమ విధులపట్ల చాలా శ్రద్ధ వహించి పనిచేయడం అవసరం. విద్యార్థులు పట్టుదలతో కృషిచేస్తే తప్ప ఆశించిన సత్ఫలితాలను సాధించుకొనజాలరు. వ్యవసాయదారులకు మొదటి ఆరునెలలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఏ విషయంలోనూ సాహసం పనికిరాదు. తొందరపడి అప్పులభారం పెంచుకొనకూడదు.

కర్కాటకం (పునర్వసు 4 పుష్యమి, ఆశే్లష లేక జూలై 16- ఆగస్టు 15)

స్థితిగోచారం దృష్ట్యా గురుడు జూన్ 30 వరకు లాభస్థానంలో రజతమూర్తి. తర్వాత వ్యయమంతా లోహమూర్తి. శని సంవత్సరం అంతా చతుర్థంలో లోహమూర్తి. రాహుకేతువులు 4-10 రాసులలో తామ్రూర్తులు. వేధగోచారం దృష్ట్యా గురుడు ఏప్రిల్ 30 నుండి జూన్ 29 వరకు మాత్రమే శుభుడు. శని రాహుకేతువులు సంవత్సరం అంతా శుభులు. స్థితి వేధగోచారాలలో గురుబలం తగ్గుతున్న దృష్ట్యా కొత్త వ్యవహారాలు ఏవీ తలపెట్టకుండా ఉన్నవాటినుండి సాధ్యమైనంతగా శుభ ప్రయోజనాలను పొందే ప్రయత్నాలు చేయడం మంచిదికాగలదు. విద్యార్థులు ఉద్యోగార్థులు ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప తాము ఆశించిన సత్ఫలితాలను సాధించుకొనజాలరు. వ్యవసాయదారులు ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనవలసి యుండవచ్చు. దూర దేశ ప్రయాణాలు ఈ సంవత్సరంలో అంతగా ప్రయోజనకరం కాజాలవు. అజాగ్రత్తవల్ల మీ వస్తు సామగ్రి దొంగలపాలు కాకుండా జాగ్రత్త వహించడం అవసరం. మీ ఆరోగ్యంపట్ల మీ కుటుంబ వ్యక్తుల ఆరోగ్యంపట్ల కూడా తగు ముందు జాగ్రత్తలు అవసరం అవుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 లేక ఆగస్టు 16 - సెప్టెంబర్ 14)

స్థితిగోచార రీత్యా గురుడు జూన్ 30 వరకు రాజ్యమున తామ్రమూర్తి. తర్వాత లాభమున తామ్రమూర్తి. శని సంవత్సరమంతా తృతీయమున తామ్రమూర్తి. రాహుకేతువులు 3-9 రాసులలో సువర్ణమూర్తులు. వేధగోచార రీత్యా గురుడు ఏప్రిల్ 30 నుండి జూన్ 29 వరకు శుభుడు. శని రాహు కేతువులు సంవత్సరాంతమంతా శుభులు. స్థితి వేధగోచారములు చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యతిరేక పరిస్థితిలు చాలా స్వల్పంగా మాత్రమే ఎదురౌతాయి. జూన్ ఆఖరువరకు ఆదాయం అంతంతమాత్రంగానే ఉండి ఖర్చులు హెచ్చుగా ఉండడంవల్ల కొంత అసౌకర్యం తప్పకపోవచ్చు. కాని జూలై నుండి మీ ఆదాయం పెరిగి విలువైన వస్తువులు కొనుగోలు చేయగల్గుతారు. విద్యార్థులు తాము ఆశించిన ఉత్తమ శ్రేణి ఫలితాలు పొందగల్గడమేకాక తమ ప్రతిభకు సమాజంలో మంచి గుర్తింపు కూడా పొందే వీలున్నది. వ్యవసాయ వ్యాపార రంగాలలో మంచి అభివృద్ధిని సాధించి స్థిరాస్తులను బాగా పెంచుకోగల్గుతారు. నిరుద్యోగులు తాము ఊహించిన దానికన్నా ఉత్తమ స్థానాలలో నియోగింపబడే వీలుంది. వివాహాది శుభకార్యాలు సకాలంలో నెరవేరి అందరికి విశేషమైన ఆనందాన్ని కలుగజేస్తాయి.

కన్య (ఉత్తర 2, 3, 4, హస్త, చిత్త 1, 2 లేక సెప్టెంబర్ 15 - అక్టోబర్ 14)

స్థితిగోచారం దృష్ట్యా గురుడు జూన్ 30 వరకు భాగ్యమందు తామ్రమూర్తి. తర్వాత రాజ్యమందు సువర్ణమూర్తి. శని సంవత్సరమంతా ద్వితీయమున సువర్ణమూర్తి. రాహుకేతువులు 2-8 రాసులలో సంవత్సరమంతా లోహమూర్తులు. వేధగోచారం దృష్ట్యా గురుడు ఏప్రిల్ 29 నుండి సంవత్సరాంతం వరకు పాపి. శని నవంబర్ 4 వరకు పాపి. రాహువు జూన్ 30 నుండి సంవత్సరాంతం వరకు పాపి. కేతువు మాత్రమే సంవత్సరం అంతా శుభుడు. స్థితిగోచారంలో రాహుకేతువులు 2-8 రాసులలో లోహమూర్తులుగాను, విశేష పాపులై ఉండడంవల్ల వేధ గోచారం రీత్యా గురు, శని, రాహువులు ముగ్గురూ పాపులై ఉండడంవల్ల సంవత్సరం మీకు ఏ విధంగానూ సుఖ శాంతులను చేకూర్చలేకపోవచ్చు. ఎప్పటికప్పుడు ఊహించని రీతిలో అనవసరమైన ఖర్చులు మీదపడుతూ ఉండటం, రోజువారీ పనులలో సైతం తీవ్రమైన జాప్యం ఏర్పడుతూ ఉండటం, వృత్తి వ్యాపారాలలో ఏ ఒక్క ప్రయత్నము ఆశాజనకంగా సాగకపోవడం మీకు ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. బంధు, మిత్రులలో ఊహించని రీతిలో శతృత్వము ఏర్పడటం, ఉద్యోగులకు దూర ప్రాంతాలకు బదిలీలు కావడం, చేసిన అప్పులు తీర్చడానికై ఒత్తిడులు, అనారోగ్య పరిస్థితులు సంవత్సరం అంతా ఎదురౌతూనే ఉంటాయి. వీటినుండి కొంతైనా ఉపశమనం పొందడానికి మీ ఇష్టదైవ ప్రార్థన తోడ్పడుతుంది.

తుల (చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3 లేక అక్టోబర్ 15- నవంబర్ 14)

స్ధితి గోచారం రీత్యా గురుడు జూన్ 30 వరకు అష్టమంలో సువర్ణమూర్తి. తర్వాత నవములో రజతమూర్తి. శని సంవత్సరమంతా జన్మరాశిలో రజతమూర్తి. రాహుకేతువులు సంవత్సరమంతా 1-7లలో తామ్రమూర్తులు. వేధగోచారం రీత్యా జూన్ 30 వరకు గురుడు శుభుడు. సంవత్సరమంతా శని రాహు కేతువులు శుభులు. జన్మరాశిలో సంవత్సరమంతా శనిరాహులు, జూన్ 30 వరకు అష్టమంలో గురుడు ఉండడంవల్ల పరిస్థితులు ఏమీ ప్రోత్సాహకరంగా లేకపోయినా తలపెట్టుకునే వివిధ కార్యక్రమాలు కొలది ఆలస్యంగానైనా పూర్తిచేసుకొనగల్గుతారు. ఖర్చులు హెచ్చుగానే ఉన్నప్పటికీ కొన్ని విలువైన వస్తువులను, భూములు, వాహనాలు ఇత్యాదులను కొనుగోలు చేసే వీలుంటుంది. వాహనాలు నడిపే సమయంలో తొందరపాటు పనికిరాదు. ఆరోగ్య పరిస్థితి మామూలుగా సంతృప్తిక రంగానే ఉంటుంది కాని అప్పుడప్పుడు కొద్ది శారీరక బాధలు తప్పకపోవచ్చు. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి కళాశాలల్లో ప్రవేశాన్ని పొందగల్గుతారు. వ్యవసాయదారులకు రెండు పంటలోనూ మంచి లబ్ధి ఉంటుంది. ఉద్యోగాలలో పైవారి ఒత్తిడులు ఉంటాయి. సామరస్య ధోరణి మనశ్శాంతి ఇస్తుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ లేక నవంబరు 15 - డిసెంబరు 14)

స్థితిగోచారం రీత్యా గురుడు జూన్ 30 వరకు సప్తమంలో రజతమూర్తి. ఆ తర్వాత అష్టమంలో లోహమూర్తి. శని సంవత్సరమంతా వ్యయంలో లోహమూర్తి. రాహుకేతువులు 12-6 రాసులలో సువర్ణమూర్తి. వేధగోచారంరీత్యా గురు, శని, రాహు కేతువులు సంవత్సరమంతా పాపులు. వేధగోచారం రీత్యా ఏమీ శుభఫలితాలకు అవకాశంలేదు. స్థితిగోచారం రీత్యా కూడా జూన్ 30 వరకుమాత్రమే గురుడు శుభుడు. ఆ తర్వాత అశుభుడు. శని సంవత్సరమంతా వ్యయంలో లోహమూర్తిగా ఉండడంవల్ల ఈ సంవత్సరం మీరు తలపెట్టుకున్న పనులన్నింటికీ ఏదోరీతిగా ప్రతిబంధకాలే ఏర్పడి కొన్నింటిని నిలిపివేయడం కానీ, కొంతకాలంపాటు వాయిదా వేయడంగాని తప్పకపోవచ్చు. మీ ఆరోగ్యవిషయంలోనూ, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలోనూ ఎంతో ముందుజాగ్రత్త చర్యలు, వైద్య సహాయం అవసరం అవుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు మీ వస్తువులు అపహరణకు గురికాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిచడం అవసరం. ఏ విషయంలోనూ పైవారితో తగాదాలకు దిగకుండా సామరస్యంతో, వినయంతో కాలం వెళ్ళబుచ్చాల్సి ఉంటుంది. మిత్రులతో, బంధువర్గంతో తగాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, లేక డిసెంబర్ 15 - జనవరి 13)

స్థితిగోచారం రీత్యా జూన్ 30 వరకు గురుడు షష్టమంలో లోహమూర్తి తర్వాత సప్తమంలో తామ్రమూర్తి. శని సంవత్సరమంతా లాభంలో తామ్రమూర్తి, రాహుకేతువులు 11-5 రాసులలో రజతమూర్తులు. వేధగోచారం రీత్యా గురుడు సంవత్సరమంతా పాపి. కానీ శని రాహుకేతువులు సంవత్సరమంతా శుభులు. జూలై ప్రారంభంవరకు గ్రహాల శుభస్థితులు లేకపోవడంవల్ల ఆర్థికపరిస్థితిసరిగా లేక అనేక చిక్కులను కల్పిస్తూ అందోళనకరంగా ఉంటుంది. ఆ తర్వాత క్రమక్రమంగా మీ ఇబ్బందులు తొలగిపోతాయి. మీ కుటుంబ వ్యక్తులు, బంధుమిత్రులు మీకు సకాలంలో సహకరిస్తూ మీకు మనశ్శాంతిని లభింపజేస్తారు. విద్యార్థులు ఆశించిన సత్ఫలితాలు సాధించడం చాలా కష్టం. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో సత్ఫలితాలు సాధించుకొనడానికై చాలా శ్రమించి పనిచేయాల్సి ఉంటుంది. విదేశీ ప్రయాణాలు ప్రస్తుతంలో ప్రయోజనకరం కాజాలవు. మీ ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1, 2 లేక జనవరి 14 - ఫిబ్రవరి 13)

స్థితిగోచారం రీత్యా గురుడు జూన్ 30 వరకు పంచమంలో తామ్రమూర్తి. తర్వాత షష్టమంలో రజతమూర్తి. సంవత్సరం అంతా శని దశమంలోనూ, రాహుకేతువులు 10-4 రాసులలో లోహమూర్తులు.వేధగోచారం రీత్యా గురుడు పాపి. కానీ శని రాహు కేతువులు శుభులు.ఈ సంవత్సరం స్థితిగోచారం రీత్యా గురు శనులు ఇద్దరూ పాపులుగా ఉండడంవల్ల మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు ఏ మాత్రం ప్రోత్సాహం లభించకపోవచ్చు. మీరు కష్టపడి పనిచేస్తూంటే మీకేమీ ప్రయోజనాలు కలుగకపోగా ఏమీ కష్టపడనివారికి అన్ని ప్రయోజనాలు చేకూరుతూ ఉండడం మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. మీకు రావలసిన డబ్బు సకాలంలో అందకపోయినా మొత్తంమీద ఎలాగో మీకు చేతికి అందడంవల్ల మీకు ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ ఉండవని చెప్పవచ్చు. వివాహం, శుభకార్య ప్రయత్నాలకు జూలై తరువాత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. విదేశీ ప్రయత్నాలు కొలది ఆలస్యంగానైనా విజయవంతం అవుతాయి. వ్యవసాయదారులకు రెండు పంట కాలాల్లోనూ సంతృప్తికరమైన లాభాలు చేకూరుతాయి.

కుంభం (ధనిష్ఠ 3, 4శతభిషం,పూర్వాభాద్ర 1,2,3 లేక ఫిబ్రవరి14- మార్చి 14)

స్థితిగోచార రీత్యా జూన్ 30 వరకు గురుడు చతుర్థంలో రజతమూర్తి. తర్వాత పంచమంలో సువర్ణమూర్తి. శని సంవత్సరమంతా నవమంలో సువర్ణమూర్తి. రాహుకేతువులు 9-3 రాసులలో సంవత్సరమంతా తామ్రమూర్తులు. వేధగోచారం రీత్యా గురుడు సంవత్సరమంతా పాపి. శని రాహుకేతువులు సంవత్సరమంతా శుభులు. కొద్దికాలంగా ఆగిపోయి వున్న మీ ముఖ్య కార్యక్రమాలు ఇప్పుడు ఊపు అందుకుంటాయి. ఉద్యోగ, వృత్తి వ్యాపారాలలో క్రమంగా చాలా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు జూలై తర్వాత లభిస్తాయి. కొంతకాలంగా మీ పట్ల శతృత్వం వహించిన వారందరూ ఇప్పుడు మీకు మిత్రులుగా మారిపోతారు. విద్యార్థులు తాము ఆశించిన విశేష ఫలితాలను సాధించుకొనగలుగుతారు. మీ బంధు మిత్రుల గృహాలలో వివాహాది శుభకార్యాలు జరిగి అందరితోకలిసి ఆనందించడం జరుగుతుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కొలది ఆలస్యంగానైనా సఫలం అవుతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి లేక మార్చి 15- ఏప్రిల్ 14)

స్థితిగోచారం దృష్ట్యా గురుడు జూన్ 30 వరకు తృతీయమున సువర్ణమూర్తి తర్వాత చతుర్థమున లోహమూర్తి. శని సంవత్సరమంతా అష్టమంలో లోహమూర్తి, రాహుకేతువులుకూడా 8-2 స్థానాలలో లోహమూర్తులు. వేధగోచారం దృష్ట్యా గురుడు సంవత్సరమంతా పాపి. శని రాహువులు శుభులు. కేతువు నవంబర్ 3 వరకు శుభుడు. స్థితి వేధగోచారాల దృష్ట్యా గురు శనులు ఇద్దరూ అశుభులుగానే ఉండడంవల్ల మీరు అన్ని ముఖ్య విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకొనవలసి ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు బాగా పెరిగి ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగ సాధన ప్రయత్నాలు ఆశించిన సత్ఫలితాలను సాధించజాలవు. ఈ దృష్ట్యా కొంత తక్కువస్థాయి ఉద్యోగం దొరికినా వెనుకాడకుండా దానిలో చేరిపోవడంవల్ల మీకు ముందు ముందు మేలు చేకూరుతుంది. ఇప్పుడు మీరు ఎవ్వరిమీదా ఆధారపడకుండా స్వయంకృషితోనే పరిస్థితులను మెరుగుపర్చుకొనే ప్రయత్నాలు చేయాలి. ఆరోగ్యం విషయంలో ముందుజాగ్రత్తలు చాలా అవసరం. విద్యార్థులు ఎంతో శ్రమపడితేకానీ ఆశించిన సత్ఫలితాలు చేకూరే వీలుండదు.

Thursday, 11 April 2013

SPECIAL ARTICLE ON TELUGU FESTIVAL UGADI 2013 - ITS IMPORTANCE - HOW TO CELEBRATE - WHY TO CELEBRATE UGADI FESTIVAL - WHAT ARE THE REQUIREMENTS OF UGADI FESTIVAL ETC - INFORMATION AVAILABLE IN TELUGU






 








SPECIAL ARTICLE ON TELUGU FESTIVAL UGADI 2013 - ITS IMPORTANCE - HOW TO CELEBRATE - WHY TO CELEBRATE UGADI FESTIVAL - WHAT ARE THE REQUIREMENTS OF UGADI FESTIVAL ETC - INFORMATION AVAILABLE IN TELUGU

Sunday, 13 January 2013

2013 SANKRANTHI FESTIVAL SPECIAL ITEM - SWEET PONGALI


2013 SANKRANTHI FESTIVAL SPECIAL ITEM - SWEET PONGALI

SANKRANTHI FESTIVAL 2013 - SPECIAL MUGGULU WITH GOBBEMMALU PHOTOS

SANKRANTHI FESTIVAL 2013 - SPECIAL MUGGULU WITH GOBBEMMALU PHOTOS 








SANKRANTHI FESTIVAL SPECIAL ARTICLE 2013 IN TELUGU - PONGAL FESTIVAL IMPORTANCE


SANKRANTHI FESTIVAL SPECIAL ARTICLE 2013 IN TELUGU - PONGAL FESTIVAL IMPORTANCE