Search This Blog

Chodavaramnet Followers

Thursday 18 April 2013

VIJAYA NAMA TELUGU UGADI - RAASI RETULS 2013-2014



‘విజయ’ నామ సంవత్సర రాశి ఫలితాలు




నవనాయకత్వాలు

విజయ నామ సంవత్సరంలో రాజు (గురుడు) మంత్రి (రవి) సేనానాయకుడు (శుక్రుడు) సస్యాధిపతి (కుజుడు) ధాన్యాధిపతి (చంద్రుడు) అర్ఘ్ధాపతి (శని) మేఘాధిపతి (శని) రసాధిపతి (గురుడు), వీరసాధిపతి (కుజుడు) అయి ఉన్నారు.
రాజు గురుడు అయినందున బ్రాహ్మణులు, జన సామాన్యము యజ్ఞ యాగాది క్రతువులందు ఆసక్తిని చూపుదురు. పాలకులు సన్మార్గులై న్యాయ మార్గమున ప్రవర్తించుదురు. ప్రజలకు సుభిక్షము, ఆరోగ్యము, సుఖము లభించును. వర్షములు బాగా కురియును.

మంత్రి రవి (సూర్యుడు) అగుటవలన పాలకుల మధ్య పరస్పర శతృత్వము, కొట్లాటలు, అనావృష్టి, ప్రజల అధర్మ ప్రవర్తన కానవచ్చును.

సేనాధిపతి శుక్రుడు అగుటవలన మంచి వర్షములు కురిసి పంటలు బాగుగా పండును. వివిధ వస్తువులకు మంచి ధరలు వచ్చును. స్ర్తి పురుషులు సుఖ జీవనమునందు ఆసక్తులు అగుదురు.
సస్యాధిపతి కుజుడు అగుటవల్ల మెట్ట భూములలో మంచి వర్షములు పడి సెనగలు, కందులు, పెసలు మొదలగు పంటలు బాగా పండును.

ధాన్యాధిపతి చంద్రుడు అగుటవలన పశువులు మంచి ఆరోగ్యం కలిగి హెచ్చుగా పాలు ఇవ్వగల్గును. మంచి వర్షములతో భూమి సుభిక్షంగా ఉండును.

అర్ఘ్ధాపతి శని అగుటవలన మధ్యమ వర్షములు కలిగి ప్రజలు అప్పుడప్పుడు రోగ, చోర, అగ్ని భయాదులకు లోనగుదురు. నల్లధాన్యములు మెండుగా పండును.

మేఘాధిపతి శని అగుటవలన పంటలు మధ్యమమూ ధరలు అధికము, అకాల వర్షములు స్వల్ప వర్షములు కలుగును. నల్లని ధాన్యములు నువ్వులు బాగుగా పండును.

రసాధిపతి గురుడగుటవలన అన్ని పంటలకు అనుకూలమైన వర్షము కలుగును. ప్రజలు ఆరోగ్యవంతులై సుఖంగా ఉండును.
వీరసాధిపతి కుజుడు అగుటవలన అన్ని వస్తువుల ధరలు పెరుగును. మంచి గంధము, కస్తూరి మున్నగు సుగంధ ద్రవ్యములు, వస్తమ్రుల ధరలు బాగా పెరుగును.

ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు

రాశి ఆదాయం-వ్యయం రాజపూజ్యం - అవమానం

1.మేషం 11-5 2-4
2.వృషభం 5-14 5-4
3.మిథునం 8-11 1-7
4.కర్కాటకం 2-11 4-7
5.సింహం 5౫ 7-7
6.కన్య 6-11 3-3
7.తుల 5-14 6-3
8.వృశ్చికం 11-5 2-6
9.ధనస్సు 14-11 5-6
10.మకరం 2-8 1-2
11.కుంభం 2-8 4-2
12.మీనం 14-11 7-2

రాశులు- ఫలితాలు

మేషం (అశ్వని, భరణి, కృత్తిక లేక ఏప్రిల్ 15- మే 14)

స్థితిగోచారం దృష్ట్యా ఈ రాశివారికి జూన్ 30 వరకు గురుడు ద్వితీయమందు లోహమూర్తి తర్వాత తృతీయమందు సువర్ణమూర్తి. శని సప్తమంలోనూ రాహుకేతులు సప్తమ, జన్మరాసులలోను సంవత్సరమంతా సువర్ణమూర్తులు. వేధగోచారం దృష్ట్యా గురుడు 16 మే వరకు తిరిగి సెప్టెంబర్ 1 నుండి 16 వరకు శుభుడు. శని ఈ సెప్టెంబర్ 1 నుండి 16 వరకు పాపి. రాహువు సంవత్సరం అంతా శుభుడు. కేతువు నవంబర్ 3 నుండి సంవత్సరాంతం శుభుడు. ఈ స్థితి వేధగోచారాలు రెండూ మిశ్రమ ఫలితాలను మాత్రమే ఇవ్వగలవిగా ఉన్నాయి. అందువల్ల ఏ విషయంలోను పెద్ద ఆశలు పెట్టుకొని ప్రయోజనం ఉండదు. అయితే తలపెట్టుకున్న పనులు అసలే ముందుకు సాగక నిరాశ, నిస్పృహలతో జీవితం కొనసాగించాల్సిన అవసరం ఉండదు. ఈ సంవత్సరం మీ వివిధ ప్రాజెక్టులకు అయే ఖర్చులకు సరిపడా ఆదాయం మీకు సకాలంలో లభించడం మీకు ఆనందాన్ని మనశ్శాంతినీ కలుగజేస్తుంది. ఒక్కొక్కప్పుడు పరిస్థితులు ఆందోళన కలిగించేవిగా ఉన్నా మీరు సమయానుకూలమైన నిర్ణయాలు తీసుకొని ప్రగతిని సాధించగల్గుతారు. హెచ్చు శుభాలు జూలై - ఆగస్టు నెలల్లో సిద్ధిస్తాయి.

వృషభం (కృత్తిక 2, 3, 4, రోహిణి మృగశిర 1, 2 లేక మే 15- జూన్ 14)

స్థితిగోచారం దృష్ట్యా గురుడు జూన్ 30 వరకు జన్మరాశిలో సువర్ణమూర్తి. తర్వాత ద్వితీయమున తామ్రమూర్తి. శని షష్ఠంలో తామ్రమూర్తి. రాహుకేతువులు షష్ఠవ్యయాలలో లోహమూర్తులు. వేధగోచారం దృష్ట్యా గురుడు సెప్టెంబర్ 1 నుండి 21 వరకు శుభుడు. కాని శని, రాహు కేతువులు మాత్రం సంవత్సరం అంతా పాపులు. శని రాహువులు షష్ఠ స్థితి, గురుడు జన్మరాశిలో సువర్ణమూర్తి స్థితి ఈ సంవత్సరం కొంత ప్రగతిని సాధించిపెట్టగల్గుతాయి. కాని స్థితి గోచారం మిశ్రమంగా ఉండి వేధగోచారం ప్రతికూలంగా ఉండటంవల్ల ఆరోగ్యం దాదాపు సంతృప్తికరంగానే ఉన్నా ఏవో స్వల్ప అసౌకర్యాలు మాత్రం తప్పక పోవచ్చు. కొన్ని వ్యవహారాలలో ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి విషయంలో గతంకంటె మేలుగానే ఉన్నది అనిపించినా మధ్య మధ్య కొన్ని విఘ్నాల కారణంగా మధ్యమ స్థాయి ఆదాయం పొందగల్గుతారు. విద్యార్థులు కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొనవలసి వచ్చినా మంచి మార్కులతో పరీక్షలలో ఉత్తీర్ణులు కాగల్గుతారు. వివాహాది శుభకార్యాలు కూడా కొద్దికాలం వాయిదా పడవలసి వచ్చినా విజయవంతంగా నిర్వహింపబడతాయి. దూరదేశ ప్రయాణాలకు అవకాశం ఉంది. వ్యవసాయ రంగం మంచి ఫలితాలను ఇస్తుంది.

మిథునం (మృగశిర 3, 4, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 లేక జూన్ 15 - జూలై 15)

స్థితిగోచారం దృష్ట్యా గురుడు జూన్ 30 వరకు వ్యయమందు తామ్రమూర్తి. తర్వాత సంవత్సరాంతం జన్మరాశిలో రజతమూర్తి. శని పంచమంలో సంవత్సరం అంతా రజతమూర్తి. రాహు కేతులు 5-11లలో సువర్ణమూర్తులు. వేధగోచారం దృష్ట్యా గురుడు ఏప్రిల్ 29 వరకు మాత్రమే శుభుడు. శని సంచారం 4వరకు పాపి. రాహువు జూలై 1 వరకు శుభుడు. కేతువు సంవత్సరం అంతా శుభుడు. స్థితిగోచారం సాధ్యమైనంత అనుకూలంగానే ఉన్నా వేధగోచారం దృష్ట్యా మిశ్రమ ఫలితాలే సూచించబడుతున్నాయి. అందువల్ల ప్రతి విషయంలోనూ తుది ఫలితాలు అనుకూలంగానే ఉన్నప్పటికీ ఆ ఫలితాలు లభించే వరకు చాలా ఆందోళన స్థితిని ఎదుర్కొనవలసి రావచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు అంతగా అనుకూలం కాజాలవు. ఉద్యోగాలలో ఉన్నవారు తమ విధులపట్ల చాలా శ్రద్ధ వహించి పనిచేయడం అవసరం. విద్యార్థులు పట్టుదలతో కృషిచేస్తే తప్ప ఆశించిన సత్ఫలితాలను సాధించుకొనజాలరు. వ్యవసాయదారులకు మొదటి ఆరునెలలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఏ విషయంలోనూ సాహసం పనికిరాదు. తొందరపడి అప్పులభారం పెంచుకొనకూడదు.

కర్కాటకం (పునర్వసు 4 పుష్యమి, ఆశే్లష లేక జూలై 16- ఆగస్టు 15)

స్థితిగోచారం దృష్ట్యా గురుడు జూన్ 30 వరకు లాభస్థానంలో రజతమూర్తి. తర్వాత వ్యయమంతా లోహమూర్తి. శని సంవత్సరం అంతా చతుర్థంలో లోహమూర్తి. రాహుకేతువులు 4-10 రాసులలో తామ్రూర్తులు. వేధగోచారం దృష్ట్యా గురుడు ఏప్రిల్ 30 నుండి జూన్ 29 వరకు మాత్రమే శుభుడు. శని రాహుకేతువులు సంవత్సరం అంతా శుభులు. స్థితి వేధగోచారాలలో గురుబలం తగ్గుతున్న దృష్ట్యా కొత్త వ్యవహారాలు ఏవీ తలపెట్టకుండా ఉన్నవాటినుండి సాధ్యమైనంతగా శుభ ప్రయోజనాలను పొందే ప్రయత్నాలు చేయడం మంచిదికాగలదు. విద్యార్థులు ఉద్యోగార్థులు ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప తాము ఆశించిన సత్ఫలితాలను సాధించుకొనజాలరు. వ్యవసాయదారులు ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనవలసి యుండవచ్చు. దూర దేశ ప్రయాణాలు ఈ సంవత్సరంలో అంతగా ప్రయోజనకరం కాజాలవు. అజాగ్రత్తవల్ల మీ వస్తు సామగ్రి దొంగలపాలు కాకుండా జాగ్రత్త వహించడం అవసరం. మీ ఆరోగ్యంపట్ల మీ కుటుంబ వ్యక్తుల ఆరోగ్యంపట్ల కూడా తగు ముందు జాగ్రత్తలు అవసరం అవుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 లేక ఆగస్టు 16 - సెప్టెంబర్ 14)

స్థితిగోచార రీత్యా గురుడు జూన్ 30 వరకు రాజ్యమున తామ్రమూర్తి. తర్వాత లాభమున తామ్రమూర్తి. శని సంవత్సరమంతా తృతీయమున తామ్రమూర్తి. రాహుకేతువులు 3-9 రాసులలో సువర్ణమూర్తులు. వేధగోచార రీత్యా గురుడు ఏప్రిల్ 30 నుండి జూన్ 29 వరకు శుభుడు. శని రాహు కేతువులు సంవత్సరాంతమంతా శుభులు. స్థితి వేధగోచారములు చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యతిరేక పరిస్థితిలు చాలా స్వల్పంగా మాత్రమే ఎదురౌతాయి. జూన్ ఆఖరువరకు ఆదాయం అంతంతమాత్రంగానే ఉండి ఖర్చులు హెచ్చుగా ఉండడంవల్ల కొంత అసౌకర్యం తప్పకపోవచ్చు. కాని జూలై నుండి మీ ఆదాయం పెరిగి విలువైన వస్తువులు కొనుగోలు చేయగల్గుతారు. విద్యార్థులు తాము ఆశించిన ఉత్తమ శ్రేణి ఫలితాలు పొందగల్గడమేకాక తమ ప్రతిభకు సమాజంలో మంచి గుర్తింపు కూడా పొందే వీలున్నది. వ్యవసాయ వ్యాపార రంగాలలో మంచి అభివృద్ధిని సాధించి స్థిరాస్తులను బాగా పెంచుకోగల్గుతారు. నిరుద్యోగులు తాము ఊహించిన దానికన్నా ఉత్తమ స్థానాలలో నియోగింపబడే వీలుంది. వివాహాది శుభకార్యాలు సకాలంలో నెరవేరి అందరికి విశేషమైన ఆనందాన్ని కలుగజేస్తాయి.

కన్య (ఉత్తర 2, 3, 4, హస్త, చిత్త 1, 2 లేక సెప్టెంబర్ 15 - అక్టోబర్ 14)

స్థితిగోచారం దృష్ట్యా గురుడు జూన్ 30 వరకు భాగ్యమందు తామ్రమూర్తి. తర్వాత రాజ్యమందు సువర్ణమూర్తి. శని సంవత్సరమంతా ద్వితీయమున సువర్ణమూర్తి. రాహుకేతువులు 2-8 రాసులలో సంవత్సరమంతా లోహమూర్తులు. వేధగోచారం దృష్ట్యా గురుడు ఏప్రిల్ 29 నుండి సంవత్సరాంతం వరకు పాపి. శని నవంబర్ 4 వరకు పాపి. రాహువు జూన్ 30 నుండి సంవత్సరాంతం వరకు పాపి. కేతువు మాత్రమే సంవత్సరం అంతా శుభుడు. స్థితిగోచారంలో రాహుకేతువులు 2-8 రాసులలో లోహమూర్తులుగాను, విశేష పాపులై ఉండడంవల్ల వేధ గోచారం రీత్యా గురు, శని, రాహువులు ముగ్గురూ పాపులై ఉండడంవల్ల సంవత్సరం మీకు ఏ విధంగానూ సుఖ శాంతులను చేకూర్చలేకపోవచ్చు. ఎప్పటికప్పుడు ఊహించని రీతిలో అనవసరమైన ఖర్చులు మీదపడుతూ ఉండటం, రోజువారీ పనులలో సైతం తీవ్రమైన జాప్యం ఏర్పడుతూ ఉండటం, వృత్తి వ్యాపారాలలో ఏ ఒక్క ప్రయత్నము ఆశాజనకంగా సాగకపోవడం మీకు ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. బంధు, మిత్రులలో ఊహించని రీతిలో శతృత్వము ఏర్పడటం, ఉద్యోగులకు దూర ప్రాంతాలకు బదిలీలు కావడం, చేసిన అప్పులు తీర్చడానికై ఒత్తిడులు, అనారోగ్య పరిస్థితులు సంవత్సరం అంతా ఎదురౌతూనే ఉంటాయి. వీటినుండి కొంతైనా ఉపశమనం పొందడానికి మీ ఇష్టదైవ ప్రార్థన తోడ్పడుతుంది.

తుల (చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3 లేక అక్టోబర్ 15- నవంబర్ 14)

స్ధితి గోచారం రీత్యా గురుడు జూన్ 30 వరకు అష్టమంలో సువర్ణమూర్తి. తర్వాత నవములో రజతమూర్తి. శని సంవత్సరమంతా జన్మరాశిలో రజతమూర్తి. రాహుకేతువులు సంవత్సరమంతా 1-7లలో తామ్రమూర్తులు. వేధగోచారం రీత్యా జూన్ 30 వరకు గురుడు శుభుడు. సంవత్సరమంతా శని రాహు కేతువులు శుభులు. జన్మరాశిలో సంవత్సరమంతా శనిరాహులు, జూన్ 30 వరకు అష్టమంలో గురుడు ఉండడంవల్ల పరిస్థితులు ఏమీ ప్రోత్సాహకరంగా లేకపోయినా తలపెట్టుకునే వివిధ కార్యక్రమాలు కొలది ఆలస్యంగానైనా పూర్తిచేసుకొనగల్గుతారు. ఖర్చులు హెచ్చుగానే ఉన్నప్పటికీ కొన్ని విలువైన వస్తువులను, భూములు, వాహనాలు ఇత్యాదులను కొనుగోలు చేసే వీలుంటుంది. వాహనాలు నడిపే సమయంలో తొందరపాటు పనికిరాదు. ఆరోగ్య పరిస్థితి మామూలుగా సంతృప్తిక రంగానే ఉంటుంది కాని అప్పుడప్పుడు కొద్ది శారీరక బాధలు తప్పకపోవచ్చు. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి కళాశాలల్లో ప్రవేశాన్ని పొందగల్గుతారు. వ్యవసాయదారులకు రెండు పంటలోనూ మంచి లబ్ధి ఉంటుంది. ఉద్యోగాలలో పైవారి ఒత్తిడులు ఉంటాయి. సామరస్య ధోరణి మనశ్శాంతి ఇస్తుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ లేక నవంబరు 15 - డిసెంబరు 14)

స్థితిగోచారం రీత్యా గురుడు జూన్ 30 వరకు సప్తమంలో రజతమూర్తి. ఆ తర్వాత అష్టమంలో లోహమూర్తి. శని సంవత్సరమంతా వ్యయంలో లోహమూర్తి. రాహుకేతువులు 12-6 రాసులలో సువర్ణమూర్తి. వేధగోచారంరీత్యా గురు, శని, రాహు కేతువులు సంవత్సరమంతా పాపులు. వేధగోచారం రీత్యా ఏమీ శుభఫలితాలకు అవకాశంలేదు. స్థితిగోచారం రీత్యా కూడా జూన్ 30 వరకుమాత్రమే గురుడు శుభుడు. ఆ తర్వాత అశుభుడు. శని సంవత్సరమంతా వ్యయంలో లోహమూర్తిగా ఉండడంవల్ల ఈ సంవత్సరం మీరు తలపెట్టుకున్న పనులన్నింటికీ ఏదోరీతిగా ప్రతిబంధకాలే ఏర్పడి కొన్నింటిని నిలిపివేయడం కానీ, కొంతకాలంపాటు వాయిదా వేయడంగాని తప్పకపోవచ్చు. మీ ఆరోగ్యవిషయంలోనూ, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలోనూ ఎంతో ముందుజాగ్రత్త చర్యలు, వైద్య సహాయం అవసరం అవుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు మీ వస్తువులు అపహరణకు గురికాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిచడం అవసరం. ఏ విషయంలోనూ పైవారితో తగాదాలకు దిగకుండా సామరస్యంతో, వినయంతో కాలం వెళ్ళబుచ్చాల్సి ఉంటుంది. మిత్రులతో, బంధువర్గంతో తగాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, లేక డిసెంబర్ 15 - జనవరి 13)

స్థితిగోచారం రీత్యా జూన్ 30 వరకు గురుడు షష్టమంలో లోహమూర్తి తర్వాత సప్తమంలో తామ్రమూర్తి. శని సంవత్సరమంతా లాభంలో తామ్రమూర్తి, రాహుకేతువులు 11-5 రాసులలో రజతమూర్తులు. వేధగోచారం రీత్యా గురుడు సంవత్సరమంతా పాపి. కానీ శని రాహుకేతువులు సంవత్సరమంతా శుభులు. జూలై ప్రారంభంవరకు గ్రహాల శుభస్థితులు లేకపోవడంవల్ల ఆర్థికపరిస్థితిసరిగా లేక అనేక చిక్కులను కల్పిస్తూ అందోళనకరంగా ఉంటుంది. ఆ తర్వాత క్రమక్రమంగా మీ ఇబ్బందులు తొలగిపోతాయి. మీ కుటుంబ వ్యక్తులు, బంధుమిత్రులు మీకు సకాలంలో సహకరిస్తూ మీకు మనశ్శాంతిని లభింపజేస్తారు. విద్యార్థులు ఆశించిన సత్ఫలితాలు సాధించడం చాలా కష్టం. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో సత్ఫలితాలు సాధించుకొనడానికై చాలా శ్రమించి పనిచేయాల్సి ఉంటుంది. విదేశీ ప్రయాణాలు ప్రస్తుతంలో ప్రయోజనకరం కాజాలవు. మీ ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1, 2 లేక జనవరి 14 - ఫిబ్రవరి 13)

స్థితిగోచారం రీత్యా గురుడు జూన్ 30 వరకు పంచమంలో తామ్రమూర్తి. తర్వాత షష్టమంలో రజతమూర్తి. సంవత్సరం అంతా శని దశమంలోనూ, రాహుకేతువులు 10-4 రాసులలో లోహమూర్తులు.వేధగోచారం రీత్యా గురుడు పాపి. కానీ శని రాహు కేతువులు శుభులు.ఈ సంవత్సరం స్థితిగోచారం రీత్యా గురు శనులు ఇద్దరూ పాపులుగా ఉండడంవల్ల మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు ఏ మాత్రం ప్రోత్సాహం లభించకపోవచ్చు. మీరు కష్టపడి పనిచేస్తూంటే మీకేమీ ప్రయోజనాలు కలుగకపోగా ఏమీ కష్టపడనివారికి అన్ని ప్రయోజనాలు చేకూరుతూ ఉండడం మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. మీకు రావలసిన డబ్బు సకాలంలో అందకపోయినా మొత్తంమీద ఎలాగో మీకు చేతికి అందడంవల్ల మీకు ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ ఉండవని చెప్పవచ్చు. వివాహం, శుభకార్య ప్రయత్నాలకు జూలై తరువాత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. విదేశీ ప్రయత్నాలు కొలది ఆలస్యంగానైనా విజయవంతం అవుతాయి. వ్యవసాయదారులకు రెండు పంట కాలాల్లోనూ సంతృప్తికరమైన లాభాలు చేకూరుతాయి.

కుంభం (ధనిష్ఠ 3, 4శతభిషం,పూర్వాభాద్ర 1,2,3 లేక ఫిబ్రవరి14- మార్చి 14)

స్థితిగోచార రీత్యా జూన్ 30 వరకు గురుడు చతుర్థంలో రజతమూర్తి. తర్వాత పంచమంలో సువర్ణమూర్తి. శని సంవత్సరమంతా నవమంలో సువర్ణమూర్తి. రాహుకేతువులు 9-3 రాసులలో సంవత్సరమంతా తామ్రమూర్తులు. వేధగోచారం రీత్యా గురుడు సంవత్సరమంతా పాపి. శని రాహుకేతువులు సంవత్సరమంతా శుభులు. కొద్దికాలంగా ఆగిపోయి వున్న మీ ముఖ్య కార్యక్రమాలు ఇప్పుడు ఊపు అందుకుంటాయి. ఉద్యోగ, వృత్తి వ్యాపారాలలో క్రమంగా చాలా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు జూలై తర్వాత లభిస్తాయి. కొంతకాలంగా మీ పట్ల శతృత్వం వహించిన వారందరూ ఇప్పుడు మీకు మిత్రులుగా మారిపోతారు. విద్యార్థులు తాము ఆశించిన విశేష ఫలితాలను సాధించుకొనగలుగుతారు. మీ బంధు మిత్రుల గృహాలలో వివాహాది శుభకార్యాలు జరిగి అందరితోకలిసి ఆనందించడం జరుగుతుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కొలది ఆలస్యంగానైనా సఫలం అవుతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి లేక మార్చి 15- ఏప్రిల్ 14)

స్థితిగోచారం దృష్ట్యా గురుడు జూన్ 30 వరకు తృతీయమున సువర్ణమూర్తి తర్వాత చతుర్థమున లోహమూర్తి. శని సంవత్సరమంతా అష్టమంలో లోహమూర్తి, రాహుకేతువులుకూడా 8-2 స్థానాలలో లోహమూర్తులు. వేధగోచారం దృష్ట్యా గురుడు సంవత్సరమంతా పాపి. శని రాహువులు శుభులు. కేతువు నవంబర్ 3 వరకు శుభుడు. స్థితి వేధగోచారాల దృష్ట్యా గురు శనులు ఇద్దరూ అశుభులుగానే ఉండడంవల్ల మీరు అన్ని ముఖ్య విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకొనవలసి ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు బాగా పెరిగి ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగ సాధన ప్రయత్నాలు ఆశించిన సత్ఫలితాలను సాధించజాలవు. ఈ దృష్ట్యా కొంత తక్కువస్థాయి ఉద్యోగం దొరికినా వెనుకాడకుండా దానిలో చేరిపోవడంవల్ల మీకు ముందు ముందు మేలు చేకూరుతుంది. ఇప్పుడు మీరు ఎవ్వరిమీదా ఆధారపడకుండా స్వయంకృషితోనే పరిస్థితులను మెరుగుపర్చుకొనే ప్రయత్నాలు చేయాలి. ఆరోగ్యం విషయంలో ముందుజాగ్రత్తలు చాలా అవసరం. విద్యార్థులు ఎంతో శ్రమపడితేకానీ ఆశించిన సత్ఫలితాలు చేకూరే వీలుండదు.