Search This Blog

Chodavaramnet Followers

Showing posts with label Akbar - Birbal Stories - Telugu. Show all posts
Showing posts with label Akbar - Birbal Stories - Telugu. Show all posts

Tuesday, 25 September 2018

Monday, 4 January 2016

AKBAR BIRBAL STORIES IN TELUGU - CALCULATING STARS IN THE SKY


మొగలాయి చక్రవర్తులలో అక్బర్ గొప్పవాడు. హాస్యప్రియుడయిన అక్బర్ ఒకరోజు రాజ ప్రాసాదంపై నిలబడి ఆకాశంవైపుకి చూశాడు. ఆకాశంలో మిలమిలా మెరిసే నక్షత్రాలు లెక్కలేనన్ని కనిపించాయి. వాటిని చూడగానే ఆయనకు ఒక కోరిక కలిగింది. ఆ కోరికలోని చిలిపితనానికి ఆయనకే నవ్వు వచ్చి, కిసుక్కున నవ్వేశాడు.
తెల్లారగానే సభకు వచ్చాడు అక్బర్ చక్రవర్తి. అందరూ ఎవరి స్థానాలలో వారు కూర్చుని ఉన్నారు. అప్పుడు చక్రవర్తి మాట్లాడుతూ... మీలో ఎవరైనా సరే ఆకాశంలో కనిపించే చుక్కల్ని లెక్కపెట్టి, అవెన్ని ఉన్నాయో ఖచ్చితంగా చెప్పాలి. అలా చెప్పినవారికి వెయ్యి బంగారు నాణాలను బహుమతిగా ఇస్తానని చెప్పాడు.

నక్షత్రాలను లెక్క పెట్టేందుకు ఓ పదిహేను రోజుల గడువును కూడా తీసుకోవచ్చునని కూడా చెప్పాడు అక్బర్ చక్రవర్తి. దీంతో సభలోని వారందరూ ఆలోచనలో పడ్డారు. అయ్యో..! ఆకాశంలో లెక్కకు మించి ఉన్న నక్షత్రాలను లెక్కగట్టి, ఖచ్చితమైన లెక్కను ప్రభువుకు చెప్పాలా..? అదెలా సాధ్యమవుతుందని అందరూ తమలో తాము అనుకోసాగారు.

అప్పుడు బీర్బల్ లేచి... మహారాజా..! మీరు చెప్పినట్లు చుక్కలు లెక్కపెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. దానికి మహారాజు సరేనని అన్నాడు. ఇక ఆరోజు నుంచి బీర్బల్ ఏకధాటిగా చుక్కల్ని లెక్కపెట్టడం ప్రారంభించాడు. అలా పదిహేను రోజులు గడిచాయి. ఆ మరుసటిరోజు సభకు వచ్చాడు.

మహారాజా..! మీరు చెప్పినట్లుగానే చుక్కలన్నింటినీ లెక్కపెట్టాను. అయితే నోటితో లెక్కపెట్టలేకపోయాను. కాగితంపై కూడా రాసేందుకు వీలు కాలేదు. అందుకే ఒక ఆవాల బస్తా దగ్గర పెట్టుకుని ఒక్కో నక్షత్రాన్ని చూస్తూ, ఒక్కో ఆవగింజను ఈ సంచిలో వేశాను. మొత్తం పదిహేను రోజులూ ఇలాగే చేశాను. కాబట్టి, ఈ సంచిలో ఎన్ని ఆవగింజలున్నాయో, ఆకాశంలో అన్ని చుక్కలున్నాయి మహాపభ్రూ అంటూ... మూట విప్పి ఆవాలను కుప్పగా పోశాడు.

ఆవాలను చూసిన అక్బర్ చక్రవర్తి... నవ్వుతూ చాలా ఉన్నాయే అని అన్నాడు. మహారాజా.. మీకు నమ్మకం లేకపోతే ముందు ఈ ఆవగింజలన్నింటినీ లెక్కపెట్టించండి. తరువాత నక్షత్రాలను లెక్క పెట్టించండి. అందరి అనుమానం తీరిపోతుందని తెలివిగా బదులిచ్చాడు బీర్బల్.

బీర్బల్ యుక్తిని మెచ్చుకున్న అక్బర్ చక్రవర్తి.. సంతోషంగా తాను ఇస్తానను వెయ్యి బంగారు నాణాలను బహుమానంగా ఇచ్చాడు. సభలోనివారంతా కూడా బీర్బల్ తెలివితేటలను మెచ్చుకుని హాయిగా నవ్వుకోసాగారు

Monday, 28 January 2013

OX MILK - AKBAR BIRBAL STORIES - KIDS SPECIAL



ఎద్దు పాలు ( అక్బర్- బీర్బల్ కథలు)


ఓ సారి అక్బర్ చక్రవర్తి- బీర్బల్‌ను ‘‘నాకొక గ్లాసుడు ఎద్దు పాలు కావాలి’’అని అడిగాడు.
చక్రవర్తి అభ్యర్థన అసాధారణంగా వున్నా బీర్బల్ పైకి ఏమీ అనకుండా, ‘‘అలాగే సంపాదిస్తా ప్రభూ. కానీ నాకొక వారం రోజులు సమయమివ్వండి’’అని అడిగాడు.
‘‘అలాగే’’ అన్నాడు అక్బర్.
సాయంత్రం అయ్యాక ఇంటికెళ్ళాడు బీర్బల్. చక్రవర్తిగారు ఎద్దు పాలు తెమ్మని వారం రోజుల గడువుయిచ్చారు. కానీ అది అసాధ్యమైన పని. ఏం చెయ్యాలా?’ అని నిర్వేదంలో పడిపోయాడు.
అతని భార్య అది గమనించి, ‘‘ఏం జరిగింది?’’అని అడిగింది. జరిగిన సంగతి చెప్పాడు బీర్బల్.్ప
అది విని అతని భార్య పెద్దగా నవ్వింది. దాంతో ఆశ్చర్యపోవటం బీర్బల్ వంతయింది.
‘‘అదేమంత అసాధ్యం కాదు. ఏం చెయ్యాలో నేను చెబుతా, కానీ మీరు ఆరురోజుల దాకా ఇల్లు కదిలి వెళ్ళొద్దు’’ అందామె.
ఆమె తెలివితేటల మీద అపారమైన నమ్మకం వున్న బీర్బల్ ‘‘అలాగే’’అని ఇంటి పట్టునే వుండిపోయాడు.
అయిదురోజులు గడిచాయి. ఆరవ రోజు రాత్రి ఆమె ఒక పెద్ద గుడ్డలమోపు తీసుకుని రాజమందిరానికి వెళ్ళింది. ఆ పక్కనే వున్న సెలయేటిలో ఒక్కొక్క గుడ్డనీ ఉతకటం మొదలుపెట్టింది.
ఆ శబ్దానికి మేల్కొన్న అక్బర్ మేడ మీది వరండాలోకి వెళ్ళి ‘ఇంత రాత్రిపూట బట్టలు ఉతుకుతున్నది ఎవరా?’అని చూసాడు. అంతేగాక ఆమెను తీసుకురమ్మని ఇద్దరు భటులను పంపించాడు.
‘‘ఏమ్మా.. యింత రాత్రి పూట బట్టలు ఉతుకుతున్నావెందుకు?-’’అని బీర్బల్ భార్యను ప్రశ్నించాడు అక్బర్.
‘‘ప్రభూ, ఆరురోజుల క్రితం నా భర్త ప్రసవించాడు. మా పనిమనిషి రాలేదు. అందుకే పనంతా నేనే చేసుకోవాల్సి వచ్చింది. ఇంట్లో పనులన్నీ పూర్తిచేసుకునేసరికి చీకటి పడింది. అందుకే యింత రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నా’’అని జవాబిచ్చిందామె వినయంగా.
‘‘ఏంటి నువ్వనేది? మగవాడు ప్రసవించటం ఎలా సాధ్యం?’’అన్నాడు అక్బర్ ఆశ్చర్యంగా.
ఆమె చిరునవ్వు నవ్వి, ‘‘ఇందులో ఆశ్చర్యపడేదేముంది? మీరు ఎద్దు పాలు కావాలని అడగగా లేనిది మగవాడు ఎందుకు ప్రసవించలేడు?’’ అంది.
ఆమె మాటలలోని నిజాన్ని అర్థం చేసుకున్న అక్బర్ తల వూపాడు. మగవాడు ఎలా ప్రసవించలేడో, అలాగే ఎద్దుకూడా పాలను యివ్వలేదు. వెంటనే ఆయనకు బీర్బల్‌ను తాను అసాధ్యమైన కార్యం చెయ్యమని అడిగిన విషయం గుర్తుకొచ్చింది. ఆమె సమయస్ఫూర్తికి, తెలివి తేటలకు మెచ్చుకున్న అక్బర్- ఆమెకు అనేక విలువయిన కానుకలిచ్చి పంపించాడు.