పెళ్లి జీవితంలో ఓ ముఖ్య ఘట్టం. పెళ్లికోసం ఆరాటపడని వారుండరు. మొదట్లో ఆకర్షణలు ముఖ్యభూమిక పోషించినా తర్వాత తర్వాత భార్యాభర్తలు ఒకరికొకరికి ఎంతో అవసరమౌతారు. పెళ్లి చేసుకున్నవారు కొంతమంది విడిపోతుంటారు. ఇటీవలికాలంలో అయితే ఈ పెళ్లి బంధాన్ని సులువుగా తెంపేసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు కొత్తకోడలు అత్తవారింట శారీరక మానసిక హింసలకు బలవుతూ బతకాల్సివచ్చేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. చట్టపరంగా స్త్రీలకు రక్షణ వుంది. తమ హక్కులకు భంగం వాటిల్లుతుంటే నోరు మెదపకుండా కూర్చుని ఉండాల్సినవసరంలేదు. దిక్కులేని పరిస్థితుల్లో విడాకులకు వెళ్లాలి. ఇది ఆఖరి అస్త్రంగా వుండాలి.
మన వ్యవస్థలో తల్లిదండ్రుల వద్ద గారాబంగా పెరిగిన అమ్మాయి అకస్మాత్తుగా తల్లిదండ్రుల నీడనుండి అత్తమామల గూటికి బదిలీ అవుతుంది. ఆ కొత్తకోడలు జీవితకాలం అత్తవారింటిని స్వర్గంగా భావించి బతకాలి.
కొత్త కోడలు
అత్తవారింట్లో వారి అభిరుచులకు తగినట్లు మసలుకునేందుకు కొత్త కోడలికి కొంత సమయం పడుతుంది. ఆమె అన్నీ తెలిసిన ఆరిందలా మసలాలని అత్తవారు ఆశించకూడదు. గారాబంగా పెంచుకున్న కూతురిపై మమకారం మరువలేని తల్లిదండ్రులు తరచూ తమ బిడ్డను పుట్టింటికి పంపమని వియ్యాలవారిని ఒత్తిడి చేస్తుంటారు. ఫలితంగా కొత్తకోడలికి అత్తవారి బంధువులతో పెరగాల్సిన అనుబంధం తగ్గిపోతుంది. 'నాది' అనే భావం అత్తవారింట్లో ఏర్పడే అవకాశం సన్నగిల్లుతుంది. పుట్టింటికి చేరిన అమ్మాయి అత్తగారి చర్చలను, చేష్టలను విమర్శిస్తుంటే తల్లిదండ్రులు కూడా ఆమెకు వంత పాడతారు. అత్తగారిల్లు ఒక నరకం అనే అభిప్రాయం ఆమెలో నాటుకునేటట్లు చేస్తారు. ఫలితంగా అత్తాకోడళ్ల మధ్య సమరం మొదలవుతుంది. తెలివైన తల్లిదండ్రులు అత్తగారిని విమర్శించే కూతురి ధోరణిని సమర్ధించరు. అత్తగారింటి వాతావరణానికి సర్దుకోమని సలహా ఇస్తారు.
భర్తే ఆమెకు బహుమతి
కొత్త కోడలు ఒక విషయం దృష్టిలో ఉంచుకోవాలి. అత్తవారింటి నుండి తనకు లభించిన బహుమతి తన 'భర్త' అని. ఆ భర్తను పెంచి పెద్దచేసి సమర్థుడిగా తయారు చేయడంలో అత్తమామలు చేసిన త్యాగాలు, కష్టాలు, త్యజించిన సుఖాలు కొత్త కోడలు గుర్తుంచుకోవాలి. అత్తమామలు అంత శ్రమించి ఉండకపోతే తనకు అంత మంచి భర్త లభించి ఉండేవాడు కాదనే విషయం మరువకూడదు. ఈ రకమైన అభిప్రాయాలను చిన్న చిన్న పనులతో కోడలు అత్తవారింట ప్రదర్శిస్తూ తన స్థానాన్ని అభిమాన తెరల మధ్య పదిలంగా ఉండేటట్లు చేసుకోవాలి. తనంటే ఇష్టపడ్డారు కాబట్టే తనను కోడలిగా తెచ్చుకున్నారన్న విషయం మదిలో మెదులుతుండాలి. తాను ఆ కుటుంబానికి సరిపడననే ఆలోచనను మనసులోకి రానివ్వకూడదు. ఒకసారి అత్తవారింట్లోకి అడుగుపెట్టేసరికి ఆ కుటుంబ స్టేటస్ తనకు కూడా వచ్చేసిందని తెలుసుకోవాలి. ఈ విషయాలు రాయడం వెనుక ఒక కారణం ఉంది. అనేక సందర్భాల్లో కొత్త కోడలు అత్తవారింట తనను చిన్న చూపు చూస్తున్నారనే అపోహతో ఉండడమే కాదు, ఆ దృష్టితో ఉండడం వల్ల అత్తవారింట ఏ చిన్న విషయమైనా సరే తమ భావన నిజమని నిరూపించేందుకు ఆ విషయాలను తనకు అనుగుణంగా విశ్లేషించి చెబుతుంటారు. ఈ రకమైన ప్రవర్తన అత్తవారింటికి దూరం చేస్తుందని కొత్త కోడలు గ్రహించాలి.
పోలికలు వద్దు
సాధారణంగా కొత్త కోడలు తమ వదినలతో సరిపోల్చుకుంటారు. ముఖ్యంగా వదినా ఆడపడుచులు ఒకే వయసువారైతే ఈ పోల్చుకోవడం మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ పోలిక క్రమక్రమంగా అసూయగా మారుతుంది. మొదట్లో వారి మధ్య నిశ్శబ్ద యుద్ధం మొదలై అది క్రమంగా సమరంగా తయారవుతుంది. కొత్త కోడలు ఇంట్లో అడుగుపెట్టగానే కొన్ని చిన్న చిన్న సమస్యలు మొదలవుతాయి. ఇది సహజం. కోడలు గర్భవతి అయిందంటే పరిస్థితుల్లో మార్పులు వచ్చేస్తాయి. మొత్తం మార్పిడికి ఇది దోహదపడుతుంది. తెలివైన కోడలు ఓర్పుగా ఉంటుంది. ఎగిసిన కెరటాలు అవే సర్దుకుంటాయి. ఆ విధంగా గాక ప్రతి చిన్న విషయానికి ఎదిరించి తన ఉనికి నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తే చినికి చినికి గాలివానగా మారి చివరకు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొనాల్సి వస్తుంది. చిన్న చిన్న తగాదాలకు కన్నీళ్లు పెట్టుకుంటే అవతలివారిలో శాడిజం పెంచిన వారవుతారు. మీ తప్పు లేదని మీ భావం ఏమిటో నిర్భయంగా, వినయంగా చెప్పాలి.
ఇతరుల మాటలు
కొత్త కోడలు తన ఠీవీని నిలబెట్టుకుంటూ ఇతరులు చెప్పే లేనిపోని మాటలకు ప్రాముఖ్యత ఇవ్వకూడదు.
తనకు, అత్తగారికి, భర్తకు నడుమ మరొకరి ప్రమేయాన్ని అంగీకరించకూడదు.
తను, అత్తగారు, భర్త అంతా ఒకే యూనిట్ అని భావించాలి. వారి మధ్య అనుబంధం, ఆత్మీయత, అనురాగ బంధాలు ఏర్పడే విధంగా ప్రవర్తించాలి.
నలుగురు కలిసినప్పుడు ఒకరి పొరపాట్లను మరొకరు ఎత్తి చూపకూడదు. ఒకసారి అటువంటి ప్రవర్తన మొదలైతే చివరకు అది కుటుంబ విచ్ఛిత్తికి దారి తీస్తుంది.
ఒకసారి భార్యాభర్తల మధ్య అనుబంధం తెగిందంటే ఎవరూ ముందుకు వచ్చి దాన్ని మళ్లీ ఏర్పాటు చేయలేరు సరికదా ప్రతి ఒక్కరూ దూరం పెంచేందుకు తమకు తెలియకుండా కృషి చేస్తారు.
జరిగిన నిజం ఏదయినా వ్యక్తిగత విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో చర్చించకూడదు. ఇతరులు సమస్యలను జటిలం చేయడానికి ప్రయత్నిస్తారు. తప్ప సయోధ్యకు కృషి చేయరు. ఇది కూడా అప్రయత్నంగానే జరుగుతుంది.
కొంతమంది కోడళ్లు పనికిమాలిన విషయాలపై దృష్టిని కేంద్రీకరించి కోల్డువార్‌లో భాగస్వాములవుతారు.
ఉమ్మడి కుటుంబాల్లో (ఇప్పటికీ అక్కడక్కడ ఉన్నాయి) కొత్త కోడలితో ఏ రకమైన సంబంధంలేని బంధువులు వచ్చి పోతుంటారు. ఆ బంధువులు అప్రయత్నంగా కొత్త కోడల్ని అత్తవారి వద్ద లేదా కొత్త కోడలికి అత్తవారి గురించి లేనిపోని మాటలు చెబుతుంటారు. జాగ్రత్తగా వుండాలి.