Search This Blog

Chodavaramnet Followers

Wednesday 30 January 2013

A KING AND A KUKOO - CHILD STORY

A KING AND A KUKOO - CHILD COMICS STORY IN TELUGU



పూర్వం మాధవ వర్మ అనే రాజు వుండేవాడు. అతని కోట అడవికి దగ్గర్లోనే ఉండేది. ఓ రోజు మాధవ వర్మ కిటికీ పక్కన కూర్చుని ఓ పుస్తకం చదువుతున్నాడు. అప్పుడాయనకు మధురంగా ఓ కోకిల పాట వినిపించింది.
'ఆహా... ఎంత తియ్యటి పాట! ఎంత అందంగా పాడుతుందీ కోకిల. దాన్ని వెంటనే తీసుకురమ్మని చెప్పాలి' అనుకున్నాడు మాధవ వర్మ.
''మధురంగా పాడుతున్న ఆ కోకిల ఎక్కడున్నా వెంటనే పట్టుకురండి'' అని భటులను ఆజ్ఞాపించాడు.
వెంటనే రాజభటులు వెళ్లి పాడుతున్న కోకిల కోసం అడవంతా గాలించారు. సాయంత్రానికి సెలయేటి ఒడ్డున ఓ మామిడి చెట్టుమీద కూర్చుని పాడుతున్న కోకిల వారికి కనిపించింది.
భటులు వెంటనే కోకిల దగ్గరికి వెళ్లి ''దయచేసి మాతో వస్తావా? నువ్వు రాకుంటే మా రాజుగారికి కోపం వస్తుంది'' అని దాన్ని అడిగారు.
వాళ్లతో వెళ్లడం కోకిలకి ఏ మాత్రం ఇష్టం లేదు. దానికి స్వేచ్ఛగా అడవిలో ఉండడమంటేనే ఇష్టం. అయితే రాజుని సంతోషపరచాలనుకుంది. అందుకే భటులతో పాటు కోటకి వెళ్లింది. మాధవవర్మకు రకరకాల పాటలు పాడి వినిపించింది. ఆ పాటలు విని ఆయన చాలా సంతోషించాడు. కోకిలను తనతోపాటు అక్కడే వుండిపొమ్మన్నాడు.
'సరే' అంది కోకిల.
దాని కోసం ఓ బంగారు పంజరం చేయించాడు మాధవవర్మ. అది పంజరంలోనే ఉంటూ రాజుకి ప్రతిరోజూ మంచి మంచి పాటలు వినిపించేది.
ఒకరోజు పొరుగు రాజు మాధవవర్మకు ఓ కానుక పంపించాడు. అది బొమ్మ కోకిల. దాని నిండా వజ్రవైఢూర్యాలు పొదిగారు. దానికి ఓ మీట ఉంది. దాన్ని తిప్పితే బొమ్మ కోకిల నుండి మధురమైన పాట వినపడుతుంది. ఇది చూసిన మాధవవర్మ చాలా సంతోషించాడు. మాటిమాటికీ దాని మీట తిప్పడం, పాట వినడం చేస్తున్నాడు.
ఈ బొమ్మ కోకిల ధ్యాసలో పడి నిజమైన కోకిలని మర్చిపోయాడు. దాంతో అడవి నుండి వచ్చిన కోకిల బాధపడింది. రాజు తనతో మాట్లాడతాడేమో, పాట పాడమని అడుగుతాడేమో అని ఎదురు చూడసాగింది. కానీ మాధవవర్మ దీని సంగతే పట్టించుకోవట్లేదు.
చూసీచూసీ కోకిలకి విసుగొచ్చేసింది. ఇక పారిపోదామని నిర్ణయించుకుంది. తనని పంజరంలోంచి విడిచి పెట్టమని అక్కడున్న ఒక భటుణ్ణి వేడుకుంది. ఆ భటుడు కోకిల స్థితికి బాధపడి పంజరం తలుపు తీశాడు. కోకిల అతనికి కృతజ్ఞతలు చెప్పి రివ్వున అడవిలోకి ఎగిరిపోయింది.
మాధవవర్మ మాత్రం బొమ్మ కోకిలను తన గదిలోనే పెట్టుకుని ఎప్పుడూ దాని పాటే వినేవాడు. అది కూడా బొమ్మ కదా... అలుపూ సొలుపూ లేకుండా, ఎప్పుడు మీట తిప్పితే అప్పుడు పాడుతూనే ఉండేది. ఓ సంవత్సరం గడిచేటప్పటికి బొమ్మ పాడయిపోయింది. మీట ఎంత తిప్పినా పాటలు పాడడం లేదు.
దాన్ని బాగుచేసే వాళ్లని పిలిపించమని భటులకు ఆజ్ఞాపించాడు. భటులు కూడా ఆఘమేఘాల మీద బాగు చేసేవాళ్లకోసం పరుగులు పెట్టారు. బొమ్మల్ని బాగుచేసే వ్యక్తిని తీసుకొచ్చారు. అతను ఆ బొమ్మ కోకిలని ఎలాగో బాగు చేశాడు. కానీ ఎక్కువ రోజులు పని చేయదని, రోజూ వాడుతుంటే తొందరగా పాడైపోతుందని చెప్పాడు.
ఇది విని మాధవవర్మ చాలా బాధపడ్డాడు. జాగ్రత్తగా వాడుతూ, ఎప్పుడన్నా ఒకసారి దాని పాట వినసాగాడు. అయినప్పటికీ అది ఎక్కువ రోజులు పని చేయలేదు. కొన్ని రోజులు పాడి చివరికి పూర్తిగా పాడైపోయింది. కోకిల పాట వినకుండా మాధవవర్మ ఉండలేకపోయాడు. దిగులు పెట్టుకుని కొద్ది రోజులకే మంచం పట్టాడు.
రాజుగారిని ఆ స్థితిలో చూడలేక భటులు వెళ్లి అడవిలోని కోకిలని తెచ్చారు. అది కూడా మాధవవర్మ స్థితికి జాలిపడింది. వెంటనే మృదుమధురంగా ఆలపించసాగింది.
ఆ పాట విని మాధవవర్మ నెమ్మదిగా కళ్లు తెరిచి చూశాడు. ''మిత్రమా! మళ్లీ వచ్చావా? కొత్తగా వచ్చిన బొమ్మ కోకిలను చూసి మురిసిపోయాను. ప్రాణమున్న నిన్ను పట్టించుకోకుండా తప్పు చేశాను. ఇక ముందు అలా జరగదు. ఇక్కడే ఉండిపో'' అన్నాడు మాధవ వర్మ.
దానికి కోకిల నవ్వి ''రాజా! నేను పంజరంలో మాత్రం ఉండను. కానీ ప్రతి రోజూ వచ్చి పాట వినిపిస్తాను. అందుకు అంగీకారమైతే నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు'' అంది.
రాజు సంతోషంగా ఒప్పుకున్నాడు. మళ్లీ కోకిల పాటలతో పూర్తిగా కోలుకున్నాడు.