Search This Blog

Chodavaramnet Followers

Wednesday 30 January 2013

GODS MIRACLE - BIRTH OF A CHILD - TIPS FOR PREGNANT WOMEN IN TELUGU



ప్రతి ఇంటా జరిగే ఈ అద్భుతాన్ని చూసి ఆనందించడమే తప్ప ఇందులో ఉండే రహస్యాలు ఎవరికీ అంతుచిక్కవు. జన్మనిచ్చిన తల్లి బిడ్డను చూసుకుని పొందే ఆనందాన్ని వర్ణించడం ఎవరితరం? స్త్రీ, పురుషుల కలయికలో అండం వీర్యకణాలతో సంయోగం చెంది పిండంగా తయారై శిశువుగా రూపొందడం సృష్టిలో ఒక అద్భుతం. తల్లి గర్భంలో ద్రవపదార్థాల్లో తేలుతూ ఏమీ తినకుండా శిశువు ఎదిగి తల్లి శరీరం నుండి బయటికి రావడం మనిషి మేథకు అందని ఒక అతీత ప్రకృతి చర్య. గర్భస్థ శిశువుకు ఎటువంటి దెబ్బలూ తగలకుండా, ఏ విధమైన ఉష్ణోగ్రతా మార్పులకు ఇబ్బంది కలగకుండా, ప్రమాదకరమైన సూక్ష్మజీవుల బారినపడకుండా కాపాడగల పరిరక్షణ తల్లి గర్భంలో సమకూడడం ఎంత చిత్రమైన విశేషం!
ప్రసవం
తల్లి గర్భం నుండి శిశువు బయటికి వచ్చేటప్పుడు దాని చలనాన్ని శిశువు తల అడ్డుకుంటుంది. శిశువు తల తల్లి శరీరం నుండి బయటికి వస్తే మిగిలిన ప్రసవం ఎంతో సులువు అవుతుంది. పుట్టే బిడ్డ కపాలంలో ఎన్నో ఎముకలు ఒకదానితో మరొకటి సంధానం కాబడి ఉంటాయి. ఇవన్నీ సులువుగా ఎటు కావాలంటే అటు కదిలే దారాలవంటి టేపు పదార్థంతో అతకబడి ఉంటాయి. విచిత్రం ఏంటంటే తల్లి గర్భం నుండి బయటికి వచ్చే బిడ్డ తలలోని ఎముకలు, తల కూడా ఇరుకు మార్గంనుండి బయటికి వచ్చేందుకు అనువుగా సర్దుకుంటాయి. ఫలితంగా శిశుజననానికి మార్గం సుగమం అవుతుంది. పుట్టిన బిడ్డ తల సాగదీసినట్లున్నా కొద్దిరోజుల్లో అది మామూలు ఆకృతికి రావడం ప్రకృతిలో కన్పించే ఒక మహాదృశ్యం. ఆ తర్వాత తల దృఢంగా మారుతుంది. తల్లిగర్భం నుండి బిడ్డ బయటికి రాగానే అంతవరకు బొడ్డుకు కలిసి ఉన్న బొడ్డు తాడు ప్లాసెంటా నుండి విడిపోతుంది. ఇక బిడ్డ తన ఆహారం తాను నోటి ద్వారా తీసుకోవడానికి అలవాటుపడుతుంది. తల్లిగర్భంలో ఉన్నప్పుడు తల్లినుండి బిడ్డకు... బిడ్డ నాభి ద్వారా ఆక్సిజన్‌ అందుతుంది. తల్లి రక్తం నుండే బిడ్డకు ఆక్సిజన్‌, పోషక పదార్థాలు ప్లాసెంటా ద్వారా బిడ్డ రక్తంలోకి వెళతాయి. బిడ్డ రక్తంలో తయారైన కార్బన్‌ డై ఆక్సైడ్‌, ఇతర మలిన పదార్థాలు ప్లాసెంటా ద్వారా తల్లి రక్తంలోకి రవాణా అవుతాయి. గర్భస్థ శిశువులో ఆక్సిజన్‌ మోసుకుపోయే ఎర్ర రక్తకణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకే పుట్టిన బిడ్డ ఎర్రగా కన్పిస్తుంది. బిడ్డ జన్మించగానే ఊపిరితిత్తులు తెరుచుకుని పనిచేయనారంభించడం మానవ జీవితంలో కన్పించే తొలి అద్భుతం. ఉపయోగించని ఒక జత సంచుల్లాంటి ఊపిరితిత్తులు తెరుచుకుని పని చెయ్యడం, రక్తాన్ని గుండె ఆపుతూ, విడుదల చేయడం సృష్టిలో కన్పించే ఊహాతీతమైన మరొక అద్భుతం.
శిశువు విశేషాలు
పుట్టిన శిశువుకు ఆహారం అంటే ఏంటో తెలీదు. తల్లి పాల నుండి కూడా మొదటి నాలుగు రోజులు సరైన ఆహారం బిడ్డకు వెళ్లదు.
తల్లికి నెలలు నిండిన తర్వాత గర్భస్థ శిశువు అధికంగా ఆహారాన్ని తన శరీరంలో నిల్వ చేసుకుంటుంది. ఒంట్లో నిల్వ వున్న ఆహారాన్ని మొదటి వారంలో వినియోగించుకుని శిశువు తిండి తినకపోయినా ఉండగల్గుతుంది. అందుకే బిడ్డ బరువు పుట్టిన వారం తర్వాత తగ్గుతుంది. శిశువు వయసు వారం దాటేసరికి ఆహారం తీసుకోవడం అలవాటవుతుంది. అంటే తల్లి పాలు తాగడం అలవాటవుతుంది. ఆనాటి నుండి బిడ్డ బరువు పెరగడం మొదలవుతుంది. బిడ్డ పుట్టినప్పుడు నాడి కొట్టుకునే రేటు నిముషానికి 120 నుండి 160 వరకు ఉంటుంది. ఆవేశ స్థితిలో 180 వరకు కూడా ఉండొచ్చు. పసిబిడ్డలకు సహజ సిద్ధమైన రాడార్‌ వ్యవస్థ వంటి నిర్మాణం ఉంటుంది. ఎంత పసిబిడ్డయినా తిండికోసం వెతకడం, పాల వైపుకు అప్రయత్నంగా తిరగడం జరుగుతుంది. బుగ్గకు ఏం తగిలినా వెంటనే తల అటువైపుకి తిప్పి దాన్ని నోట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. పుట్టిన బిడ్డకు తలమీద అదుపు ఉండదు. బిడ్డ కావలసిన దిశలో తల ఎత్తలేదు. గొప్ప తమాషా ఏంటంటే మంచంమీద బోర్లాపడి ముక్కు మంచానికి హత్తుకుని ఊపిరి ఆడని పరిస్థితి వస్తే బలమంతా పుంజుకుని తల ఒక వైపుకి తిప్పగల్గుతుంది. ఇదొక మహాద్భుతం.
పిల్లలు వికృతంగా ఎందుకు పుడతారు?
తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ట్రాంక్విలైజర్లు, థాలిడోమైడ్‌ వంటి మందులు ఉపయోగించడం వల్ల శిశువులు వికృతంగా పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లోపభూయిష్టమైన జననాల గురించి అధ్యయనం చేసే శాస్త్ర విజ్ఞానాన్ని టెరటాలజీ అంటారు. తల్లికి విటమిన్ల లోపం కలిగితే బిడ్డకు వికృత రూపం వస్తుందని ఒక వైద్యపరిశోధక బృందం అభిప్రాయపడింది. గర్భిణీగా ఉన్న సమయంలో మీథైల్‌ ఫాలికామ్లం వంటి యాంటీ మెటబాలిటీలు ఇవ్వడం వల్ల గర్భస్థ శిశువుకు అందే ఆహారం తగ్గిపోతుంది. అంతేగాక తల్లి గర్భిణీ సమయంలో అయిడో ఎసిటేటు, ఇన్సులిన్‌ వంటి వాటిని తీసుకున్నా పిల్లలు వికృత రూపంలో పుట్టే అవకాశం ఉంటుందంటున్నారు. గర్భవతి ఎక్కువగా పంచదార తినడం వల్ల పుట్టే బిడ్డ మెదడులో లోపం ఏర్పడే ప్రమాదం ఉందని కూడా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
కొన్ని నమ్మకాలు
గ్రహణ సమయంలో స్త్రీ పురుషులు కలిస్తే వారికి వికృత రూపంలో పిల్లలు పుడతారని ఒక మూఢ నమ్మకం. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు సూర్య, చంద్రులను చూస్తే వారికి గ్రహణం, మొర్రితో పిల్లలు పుడతారనేది మరొక నమ్మకం. ఈ నమ్మకాలను సైన్సు సమర్ధించడం లేదు. మనిషి ఎంత పురాతన కాలం నుండి ఈ భూమి మీద నివసిస్తున్నాడో అంత పురాతన కాలం నుండి లోపభూయిష్టమైన జననాలు ఉన్నాయి. ప్రతి వెయ్యిమంది బిడ్డల జననంలో కనీసం పదిమందికి ఏదో ఒక లోపం ఉంటుంది.