Search This Blog

Chodavaramnet Followers

Wednesday 30 January 2013

BLOOD PRESSURE - A DANGEROUS DISEASE - HOW TO CONTROL - TIPS IN TELUGU


హైపర్‌ టెన్షన్‌ లేదా అధిక రక్తపోటు అనేక గుండె జబ్బులకు మూల సూత్రధారి. ఇది గుండెపోటు లేదా మూత్రపిండాల సమస్యలను తట్టి లేపుతుంది. రక్తపోటు ఎందుకు పెరుగుతుంది? దానిని అదుపు చేయడం ఎలా? దీన్ని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు ఏంటి? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి!
మనిషి శరీరంలో గుండె రక్తాన్ని వేరు వేరు అవయవాలకు ధమనులనే శుద్ధ రక్తనాళాల ద్వారా పంపు చేస్తుంది. గుండె పంపు చేయడం అంటే అది ముడుచుకుని, తెరుచుకుని పని చేస్తుంది. ఇలా గుండె పనిచేయడంలో రక్తం రక్తనాళాలలోకి గెంటపడుతుంది. ఈ నిరంతర ప్రక్రియ ఫలితంగా రక్తం రక్తనాళాల్లో ప్రవహిస్తుంది.
ఇలా ప్రవహించే రక్తం రక్తనాళాలపై పీడనాన్ని కలుగజేస్తుంది. ఈ పీడనాన్నే రక్తపోటు అంటారు.

సిస్టోలిక్‌ - డయాస్టోలిక్‌
గుండె ముడుచుకున్నప్పుడు అందులోని రక్తం కొంత ఒత్తిడితో రక్తనాళాల్లోకి గెంటబడుతుంది. ఆ సమయంలో శుద్ధ రక్తనాళాలు (ధమనులు) ఎంత రక్తపోటుకి గురి అవుతాయో దాన్ని సిస్టోలిక్‌ రక్తపోటు అంటారు. ముడుచుకున్న గుండె తెరుచుకున్నప్పుడు మరల శుద్ధ రక్తనాళాల్లోకి కొంత ఒత్తిడితో రక్తం ప్రవహిస్తుంది. ఈ సమయంలో శుద్ధ రక్తనాళాలు ఎంత రక్త పోటుకు గురి అవుతాయో దాన్ని డయాస్టోలిక్‌ రక్తపోటు అంటారు. ఉండాల్సిన రక్తపోటు కన్నా అధికంగా రక్తపోటు ఉంటే దాన్ని హైపర్‌ టెన్షన్‌ లేదా అధిక రక్తపోటు అంటారు. ఆరోగ్యవంతుడైన వయోజనుడికి ఉండాల్సిన సాధారణ రక్తపోటు 120-80 మాత్రమే.
రక్తపోటు తీరు!
ఏ మనిషికైనా రక్తపోటు స్థిరంగా ఒకేలా ఉండదు. ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. రక్తపోటును ప్రభావితం చేసే అంశాలు అదృశ్యం కాగానే రక్తపోటు ఆ వ్యక్తిలో ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయికి వస్తుంది. వ్యాయామం, ఒత్తిడి, కోపం, చల్లని వాతావరణం వంటి అంశాలు రక్తపోటులో మార్పు తీసుకొస్తాయి. భయం, ఆందోళనలు కూడా రక్తపోటుపై ప్రభావం చూపుతాయి. మనిషి నిద్రించే సమయంలో మొత్తం శరీరం విశ్రాంతిగా ఉన్నప్పుడు రక్తపోటు తగ్గుతుంది. శరీరం నుండి ద్రవపదార్థాలు అధికంగా నష్టపోయినప్పుడు, వాంతులు ఎక్కువగా అయినప్పుడు కూడా రక్తపోటు తగ్గుతుంది. కొంతమందికి అసలు ఎందుకు రక్తపోటు వస్తుంది? అనే ప్రశ్నకు సరైన సమాధానం ఇంకా వైద్య శాస్త్రానికి అందలేదు. మిగిలిన హెచ్చురక్తపోటు గలవారికి రక్తపోటు పెరగడానికి కారణాలు ఉంటాయి. ధమనుల గోడలు దళసరిగా తయారై రక్తం ప్రసరించే మార్గం సన్నబడుతుంది. అందుకే రక్తపోటు పెరుగుతుంది. కొంతమందిలో ఎడ్రినల్‌ గ్రంథిలో ట్యూమర్లు ఏర్పడడం, మూత్రపిండాల సమస్యలు, కొన్ని ఔషధాలు సేవించడం వల్ల, గర్భిణీ సమయంలో రక్తం విషపూరితం కావడం వల్ల అధిక రక్తపోటు వుస్తుంది.
ఎవరికి వస్తుంది?
హై బి.పి రావడానికి వారసత్వం ఒక కారణం. వయోజనుల్లో ఆడవారికన్నా మగవారికి ఈ అధిక రక్తపోటు సమస్య ఎక్కువగా ఉంటుంది. స్థూలకాయులకు కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ధూమపానులు, ఒత్తిడితో నలిగేవారు అధిక రక్తపోటుతో ఉండే అవకాశాలు ఉంటాయి.
అదుపు చేద్దాం
* అధిక రక్తపోటును అదుపులో ఉంచుకునే పద్ధతుల్లో అత్యంత ప్రతిభావంతమైంది శరీర బరువును తగ్గించుకోవడం.
* శరీర బరువు తగ్గితే మనిషి ప్రకాశవంతంగా కన్పించడమే కాక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
* తరచూ అధికంగా మద్యపానం చేసేవారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశం వుంటుంది. అందువల్ల మద్యపానానికి స్వస్తి చెప్పడం మంచిది.
* వైద్యుని సలహామేర వ్యాయామాలు చేయాలి. వ్యాయామం శరీర కండరాలను, గుండె పనితీరును ఎంతో మెరుగుపరుస్తుంది.
* ఉప్పు అంటే సోడియం క్లోరైడ్‌. దీనికి శరీరంలో నీటిని నిలుపుదల చేయగల శక్తి ఉంటుంది. దీనివల్ల రక్తం ఘనపరిమాణం పెరుగుతుంది. ఘనపరిమాణం పెరిగిన రక్తాన్ని సన్నగా మార్గం తయారైన రక్తనాళాల గుండా గుండె పంపుచేసి పంపించాల్సి వస్తుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది.
* సాధారణంగా రోజుకి 10 గ్రాములు ఉప్పు తీసుకుంటాం. హైపర్‌ టెన్షన్‌ ఉన్నవారు దీన్ని 5గ్రాములకు తగ్గించాలి.
* కెఫీన్‌ రక్తపోటును పెంచుతుంది. కాఫీ, టీ, కోకో, చాక్లెట్‌, శీతలపానీయాలు, కొన్ని ఔషధాలలో కెఫీన్‌ ఉంటుంది. వీటి వాడకం వీలైనంత వరకు తగ్గించాలి.
* కాల్షియం రక్తపోటును అదుపులోకి తెస్తుంది. పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, మాంసం, తృణధాన్యాలు, ఆకుకూరలు, సోయాబీన్స్‌, కొబ్బరికాయ వంటివాటిలో తగినంత కాల్షియం ఉంటుంది. అందుకే ఆహారంతో పాటు వీటిని కూడా తీసుకోవాలి.
* పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారపదార్థలు తినాలి.
ఔషధాలు
* ఆహార నియమాలు పాటించినా కొంతమంది ఔషధాలు ఉపయోగించాల్సి వస్తుంది. వైద్యుడు చెప్పిన విధంగా మందులు వాడాలి. మధ్యమధ్యన మరుపు పేరుతో మందు వేసుకోకపోతే కొత్త సమస్యలు ఎదురవుతాయి. లీ డైయురెటిక్స్‌ ఔషధాలు రక్తంలోని అధిక నీటిని బయటికి పంపిస్తాయి. లీ బీటా బ్లాకర్స్‌ నరాలు కొట్టుకునే రేటును తగ్గించి గుండె పనిచేసే వేగాన్ని తగ్గిస్తాయి. రక్తపోటును కిందికి తీసుకొస్తాయి. లీ ఆల్ఫా బ్లాకర్స్‌ రక్తనాళాలను విశాలం చేస్తాయి. లీ ఎసిఇ (యాంజియోటెన్షన్‌ కన్వర్టింగ్‌ ఎంజైమ్‌) ఔషధం రక్తపోటును పెంచే హార్మోన్‌ చర్యను అరికడుతుంది. లీ కాల్షియం చానల్‌ బ్లాకర్లు రక్తనాళాలు విశాలం అయ్యేటట్లు చేస్తాయి. వీటివల్ల కొన్ని దుష్ఫలితాలు కూడా ఉన్నాయి. అయినా వైద్యుడ్ని సంప్రదిస్తే మరొక ఔషధం ఇస్తాడు. సైడ్‌ ఎఫెక్ట్‌ ఉందని మందులు మానకూడదు.