Search This Blog

Chodavaramnet Followers

Thursday 26 February 2015

HOW TO OVER COME BLOOD DEFICIENCY - HEALTH TIPS TO RECOVER FROM LOW BLOOD PROBLEM IN HUMAN BODY


రక్తహీనతను అధిగమించడం ఎలా?

''కాసేపు పని చేస్తే చాలు.. ఒకటే నీరసం'.., 'ఎంతసేపు చదివినా ఏదీ గుర్తుండటం లేదు.. మర్చిపోతున్నాను'.. చీటికీ మాటికీ పిల్లలకు జలుబూ, జ్వరం వస్తున్నాయి.. కారణాలేంటో అంతుబట్టడం లేదు.. ఎన్ని మందులు వాడినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు..'' ఇలాంటి సమస్యలతో బాధపడే వ్యక్తులు మనకు కనిపిస్తూనే ఉంటారు. కాకపోతే మందులు వాడిన తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు రాకుంటే అవి రక్తహీనత వల్ల తలెత్తిన సమస్యలేమో? ఒకసారి పరిశీలించుకోవాలి. మన దేశంలో ఆడపిల్లలూ, మహిళల్లో రక్తహీనత ఒక ప్రధాన సమస్య. సరైన అవగాహనతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే దీనిని అధిగమించగలమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అందుకు ఉపకరించే సమాచారం మీకోసం..
రక్తం తగ్గితే రక్తహీనత కాదు! 

ముఖం పాలిపోయినా, తరచూ నీరసంతో కూలబడుతున్నా 'ఒంట్లో శక్తి లేదు, రక్తం లేదు' అనుకుంటూ ఉంటాం. సాధారణంగా ఒంట్లో తగినంత రక్తం లేకపోవడమే రక్తహీనత అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. రక్తంలో హెమోగ్లోబిన్ శాతం తగ్గడం లేదా ఎర్రరక్తకణాలు తక్కువగా ఉండటాన్ని రక్తహీనతగా పరిగణించవచ్చు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లెక్కల ప్రకారం రక్తంలో హెమోగ్లోబిన్ 12.5గ్రామ్స్/డి.ఎల్ ఉండాలి. అది తగ్గుతోందంటే రక్తహీనత ఏర్పడుతోందని అర్థం. ఇది ఎలా ఏర్పడుతుంది? అనే ప్రశ్న ఇప్పటికే మీకు వచ్చి ఉంటుంది. ప్రశ్న చిన్నగానే ఉన్నా.. అందుకు కారణాలు మాత్రం చాలానే ఉన్నాయి. కొన్నిసార్లు ఇది పుట్టుకతోనే వచ్చే అవకాశముంది. థలసీమియా, సికిల్‌సెల్.. లాంటివి ఈ కోవకు వస్తాయి. అయితే మహిళల్ని ప్రధానంగా వేధించేది మాత్రం ఇనుము లోపం కారణంగా ఏర్పడే ఎనీమియానే. ఆహారంలో ఇనుము, ఇతరత్రా విటమిన్లు లోపించడం వల్ల ఈ రకమైన రక్తహీనత బారిన పడతారు. ఎనీమియా అనేది వ్యాధి కాదు. అదొక ఆరోగ్య పరిస్థితి మాత్రమే. మందులు వాడటం కన్నా చక్కటి ఆహార నియమాలు పాటించడంపైన శ్రద్ధ పెడితే సరిపోతుంది.

• సమస్యకు కారణాలెన్నో!

మన దేశంలో చిన్నారులూ, మహిళల్లో రక్తహీనత సమస్య చాలా ఎక్కువ. 3 నుంచి 6ఏళ్ల వయసున్న పిల్లల్లో 79%, పెళ్త్లె 16 నుంచి 50ఏళ్ల మధ్య వయస్కుల్లో 60% దీనితో బాధపడుతున్నారు. అసలు ఎందుకీ పరిస్థితి వస్తుందంటే; పనుల హడావుడిలో పడి వేళకు భోజనం చేయకపోవడం, తిన్నా శరీరావసరాలకు తగిన పోషకాలు అందేలా జాగ్రత్తలు తీసుకోకపోవడం దీనికి ప్రధాన కారణాలు. నెలసరి సమయంలో జరిగే అధిక రక్తస్రావం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు. ఎక్కువ మంది సంతానం, మాంసాహారం తినకపోవడం, కాఫీ, టీలు ఎక్కువగా తాగడం వంటివి కూడా రక్తహీనతకు దోహదం చేస్తాయి. 'ఆ!! మూడు పూటలా భోం చేస్తున్నాం.. స్నాక్స్ రూపంలో ఏవో ఒకటి తింటూనే ఉంటాం' అనుకుని వూరుకుంటే మాత్రం పొరపాటే. తినాల్సినవి ఎక్కువగా తింటూనే తినకూడని పదార్థాలు మానేయాలి. అప్పుడే దాన్ని ఆమడ దూరంలో ఉంచగలుగుతాం. ఐరన్ పోషకాలు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కాయగూరలూ బాగా తినాలి. ఉప్పు, కారం ఎక్కువగా ఉండే జంక్‌ఫుడ్ తగ్గించాలి. చాలామంది గర్భిణులు కూరలు సహించడం లేదని పచ్చళ్లు తింటూ ఉంటారు. దానివల్ల రక్తహీనత ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే ఆహారంలో ఎప్పటికప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తూ సమతులాహారం తీసుకోవడానికి ప్రయత్నిస్తే దీని బారిన పడకుండా ఉండటానికి అవకాశాలుంటాయి.

• పుట్టే బిడ్డపైనా ప్రభావం..

రక్తహీనత అనేది వ్యాధి కాకపోయినా చెప్పులో రాయిలా చికాకు పెడుతూనే ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు గురిచేస్తుంది. రక్తహీనత ఉన్నప్పుడు తరచూ బాగా నీరసంగా అనిపిస్తుంది. ముఖం పాలిపోయినట్లు కనిపించడం, కళ్లు తిరగడం, చేతులు, కాళ్ల వేళ్లు మొద్దుబారడం, పని చేస్తున్నప్పుడు త్వరగా అలసిపోవడం.. ఇవన్నీ రక్తహీనతకు సంబంధించిన లక్షణాలే. ఏకాగ్రత కుదరకపోవడం, చిన్న విషయాలకే ఒత్తిడీ, ఆందోళనకి గురవడం జరుగుతుంది. బి12 లోపం కారణంగా రక్తహీనత ఏర్పడితే మలబద్ధ్దకం, ఆకలి మందగించడం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే గర్భిణులు రక్తహీనత సమస్య బారిన పడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే సాధారణ ప్రసవం కాకుండా శస్త్రచికిత్సకు దారితీసే పరిస్థితులు ఎక్కువ అవుతాయి. పోషకాహార లోపం, ఎనిమిక్‌గా ఉండటం వల్ల కూడా ప్రసవ సమయంలో రక్తస్రావం ఎక్కువ అవడానికి ఆస్కారం ఉంటుంది. పుట్టే పిల్లలు త్వరగా ఇన్‌ఫెక్షన్‌లకు గురవుతారు. దీని వల్ల వాళ్లు ఎదిగే క్రమంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో సతమతం కావచ్చు.

• రక్తహీనతను తగ్గించే ఆహారం..

రక్తంలో హెమోగ్లోబిన్ శాతం పెరిగి, రక్తహీనత రాకుండా ఉండాలంటే తినే ఆహారంలో ఇనుము, బి12, ఫోలేట్ పోషకాలు ఉండేట్టు చూసుకోవాలి. తినే ఆహారం నుంచి ఇనుముని సంపూర్ణంగా పొందాలంటే, ఆ పదార్థాలతో పాటు విటమిన్ 'సి'ని కూడా తీసుకోవాలి. చికెన్ వండుకున్నా, సలాడ్ తినాలనుకున్నా.. వాటిపై నిమ్మరసాన్ని చల్లుకుంటే చాలా మంచిది. విటమిన్ 'సి' అందించే టొమాటో, నిమ్మ, నారింజ రసాలు ఎక్కువగా తాగాలి. తక్కిన వాటితో పోలిస్తే ఉసిరితో చేసిన పదార్థాలను ఎక్కువగా తినాలి. ఆమ్లా మురబ్బా తింటే ఇంకా మంచిది. అంజీర్, మునగాకు, తోటకూర, పుదీనా, కొత్తిమీర, మొలకలు బాగా తినాలి.

కేవలం శాకాహారమే తీసుకునే వారిలో బి12 లోపం వల్ల ఎనీమియాకు గురయ్యే అవకాశాలుంటాయి. ఇటువంటి వారు ముఖ్యంగా గర్భిణులు.. వైద్యుల సలహా మేరకు బి12 సప్లిమెంట్లు తీసుకోవచ్చు. అదేవిధంగా లివర్, చేపలు, గుడ్లు ఇనుముని పుష్కలంగా అందిస్తాయి. భోజనానికి ముందు లేదా తర్వాత కాఫీ, టీలు అస్సలు తాగకూడదు. వాటిలో ఉండే టానిన్స్ ఐరన్ పోషకాలను శరీరానికి చేరకుండా అడ్డుకుంటాయి. కొన్నిసార్లు ట్యాబ్లెట్లు వేసుకున్నా ఫలితం కనిపించదు. అలాంటప్పుడు తినే ఆహారంలో పనీర్, చీజ్, మటన్, చికెన్, ఫిష్, మీల్‌మేకర్ వంటి మాంసకృత్తులు ఎక్కువగా ఉండే పదార్థాలు చేర్చుకోవాలి. అలాగే విటమిన్ బి6 శరీరంలో జరిగే ఎంజైమ్‌ల చర్యలకు మంచిది. ఈ విటమిన్ లోపించినప్పుడు కూడా ఎనీమియా రావడానికి ఆస్కారం ఉంటుంది. గర్భిణుల్లో ఏర్పడే ఎనీమియాకి ఐరన్ ట్యాబ్లెట్లతో పాటు బి6ని ఇవ్వడం వల్ల అధిక ప్రయోజనాలు ఉంటాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. విటమిన్ బి6 పొందాలంటే ఆహారంలో కాబూలీ సెనగలు, బంగాళ దుంపలు, దంపుడు బియ్యం తప్పకుండా చేర్చుకోవాలి. పాలు, పెరుగుతో పాటు పెసలు, అలసందలు బాగా తినాలి. అలాగే ఆహారపదార్థాలను ఇనుప మూకుడులో వండుకోవడం కూడా మంచిది.

ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ.. పోషకాహారం తీసుకుంటే రక్తహీనతను నివారించవచ్చు. ముఖ్యంగా గర్భిణుల విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరని మరిచిపోకండి!!