జీవిత వైకుంఠపాళిలో
పాములు బుస కొట్టినప్పుడు
అమ్మ జాగ్రత్తలే రక్షిస్తాయి!
నిచ్చెనలెక్కేప్పుడు..
అమ్మ ఆశలు ఫలించాయనిపిస్తాయి!
జీవిత చదరంగంలో
సైనికబలం తగ్గిపోతున్నప్పుడు
అమ్మ సలహాలే అండవుతాయి!
జీవిత గమనంలో
ప్రత్యర్థులు చొరబడినప్పుడు
అమ్మ ఆశీస్సులు ధైర్యాన్నిస్తాయి!
జీవిత పద్మవ్యూహంలో
చిక్కుకుని బయటపడలేనప్పుడు
అమ్మ నేర్పిన అభ్యాసాలే ఆదుకుంటాయి!
జీవిత పయనంలో
నిందల ప్రవాహమైనప్పుడు
అమ్మ పలుకులే ఆలంబనలవుతాయి!
జీవిత మార్గంలో
దారి తప్పి చీకట్లో చిక్కుకున్నప్పుడు
అమ్మ మాటలే వెలుతురవుతాయి!
జీవిత సాగరంలో
కష్టాల అలల్లో కొట్టుకుపోతున్నప్పుడు
అమ్మ చేతులే సేదదీరుస్తాయి
జీవిత లక్ష్యంలో
గమ్యం చేరుకోలేక విఫలమైనప్పుడు
అమ్మ ధైర్యవచనాలే ప్రోత్సాహాన్నిస్తాయి!
జీవిత గమ్యంలో
క్షణికావేశాలకు లోనవుతున్నప్పుడు
అమ్మ అనుభవాలే పందిరి అవుతాయి!
...
బతుకంతా తోడౌతుంది..
దారిచూపే అమ్మమాట!
జీవితం పొడుగూతా ఉంటుంది
సేదదీర్చే అమ్మనీడ!!