కుంభరాణా కీర్తి స్తంభం
రాజస్థాన్‌లోని చిత్తూర్‌గఢ్ కోట 500 అడుగుల ఎత్తున ఒక కొండపై ఉంటుంది. చారిత్రక సంఘటనలకు సాక్షీభూతాలుగా పలు భవనాలు, దేవాలయాలు, గోపురాలు ఇక్కడ ఉన్నాయి. ఎంతో విశిష్టమైన కీర్తిస్తంభం (జయస్తంభం) భారతీయ వాస్తుశాస్త్రానికి అద్వితీయమైన నమూనాగా కనిపిస్తుంది. ఈ గోపురం దాదాపు 120 అడుగుల ఎత్తుకలిగి ఉంటుంది. పునాదుల్లో దాదాపు 30 అడుగుల వ్యాసంతో ఉంటుంది. శిఖరాగ్రంలో గుమ్మటం 17 1/2 అడుగుల ఎత్తు న ఉంటుంది. ఇందులో 157 మెట్ల చుట్టూ ఒక గ్యాలరీని నిర్మించారు. ప్రతి అంతస్తులో ప్రతి ప్రాంగణంలోకి దారిచూపేలా 9 అంతస్తులు వెలుపలి ద్వారాలతో ఉంటాయి. గోపురం పైనుంచి పరిసర ప్రాంతాలను వీక్షించవచ్చు. మాళ్వా, గుజరాత్ రాజులపై తన విజయానికి స్మృతి చిహ్నంగా మేవార్‌కు చెందిన కుంభరాణా ఈ ప్రసిద్ధ గోపురాన్ని నిర్మించాడు.