నెహ్రూ జీవిత కథ, సూక్తులు
ప్రపంచానికి శాంతిదూతగా, చిన్నారులకు ‘చాచాజీ’గా చెరగని ముద్ర వేసుకున్న భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జీవితం అందరికీ స్ఫూర్తి దాయకం. ఆగర్భ శ్రీమంతుడైనప్పటికీ దేశం కోసం, పేదల కోసం ఆయన కడవరకూ తపన చెందారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో చురుగ్గా పాల్గొని జైలుశిక్షను కూడా అనుభవించారు. స్వతంత్య్ర భారతావనికి తొలి ప్రధానిగా పగ్గాలు చేపట్టాక కర్షకులు, కార్మికులు, యువత కోసం ఎనె్నన్నో పథకాలను ప్రవేశపెట్టారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎంతో ముందు చూపుతో పంచవర్ష ప్రణాళికలకు వ్యూహరచన చేశారు. ఇతర దేశాలతో సత్సంబంధాలు పెంచుకుంటూ ప్రపంచ శాంతికి కృషి చేశారు. పెట్టుబడిదారీ వలస విధానాలకు, నియంతృత్వ పోకడలకు బద్ధవిరోధిగా ఉంటూనే తటస్థ వైఖరిని అవలంబించి ఇతర దేశాల నుంచి ప్రశంసలు పొం దారు. ఆయన జీవితంలోని ప్రధాన ఘట్టాలను, పలు విషయాలను స్పృశిస్తూ రావినూతల శ్రీరాములు రచించిన ‘జవహర్‌లాల్ నెహ్రూ జీవిత కథ, సూక్తులు’ పుస్తకం పిల్లలనే కాదు, పెద్దలను సైతం ఆద్యంతం చదివిస్తుంది.