Search This Blog

Chodavaramnet Followers

Thursday 23 February 2017

ARTICLE ABOUT LORD SHIVA AVATHAR - SARABHA


 సగం పక్షి, సగం సింహం... ఇది మహాశివుని అవతారం

విష్ణుమూర్తి దశావతారాల గురించి చాలామంది టకటకా చెప్పేస్తారు. కానీ మహాశివుడు ఎత్తిన అవతారాల గురించి మన అవగాహన తక్కువే. అలాంటి శివుని అవతారాలలో ఒక్కటే శరభ. ఎనిమిది పాదాలతో, రెక్కలతో, సింహపు దేహంతో ఉండే రూపమే శరభ! దక్షిణాది ఆలయాలలో ఎక్కువగా కనిపించే ఈ రూపం వెనుక ఓ ఘనమైన కథ ఉంది.

విష్ణుమూర్తి హిరణ్యకశిపుని సంహరించేందుకు నరసింహావతారాన్ని ఎత్తిన విషయం తెలిసిందే! అయితే హిరణ్యకశిపుని సంహారం తరువాత కూడా ఆయన కోపం చల్లారనే లేదట. ఆ ఉగ్రనారసింహుని క్రోధానికి లోకమంతా అల్లకల్లోలమైపోయింది. నరసింహుని నిలువరించకపోతే ఆయన కోపానికి ప్రకృతి సర్వనాశనం కాక తప్పదని భయపడ్డారు దేవతలు. అందుకోసం నరసింహుని నిలువరించమంటూ వారంతా కలిసి శివుని ప్రార్థించారట. అప్పుడు శివుడు తన అవతారాలైన వీరభద్ర, భైరవులని పంపాడట. కానీ నారసింహుని ముందు ఆ రెండు అవతారాలూ నిలువలేకపోవడంతో శరభ అవతారాన్ని ధరించాడు శివుడు.

కొన్ని పురాణాల ప్రకారం శరభ, నరసింహ అవతారాల మధ్య తీవ్రమైన పోరు జరిగింది. ఈ పోరులో నరసింహుడు ఓడిపోయాడు కూడా. మరి కొన్ని పురాణాల ప్రకారం శరభ అవతారాన్ని ఎదుర్కొనేందుకు విష్ణుమూర్తి గండభేరుండ పక్షిగా అవతరించాడు. రెండు తలలతో ఉండే ఈ పక్షి శరభని దీటుగా ఎదుర్కొంటుంది. ఎంతసేపు యుద్ధం జరిగినా గెలుపు ఓటములు తేలకపోవడంతో, రెండు అవతారాలూ యుద్ధాన్ని విరమించుకుంటాయి. ఎవరి మధ్య యుద్ధం జరిగినా, ఆ యుద్ధంలో ఎవరు గెలిచినా శివకేశవులు ఇరువురూ ఒక్కటే కాబట్టి శరభను విష్ణుమాయగా వర్ణించేవారు కూడా లేకపోలేదు. కేవలం శివకేశవుల పురాణాలలోనే కాదు, బుద్ధుని జాతక కథలలో కూడా ఈ శరభ ప్రస్తావన కనిపిస్తుంది. ఈ జాతక కథల ప్రకారం శరభ బుద్ధుని పూర్వ అవతారాలలో ఒకటి!

శరభ రూపం దక్షిణాదిన, అందునా తమిళనాట ఉన్న శివాలయాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా శైవ మతాన్ని ప్రోత్సహించిన చోళులు నిర్మించిన ఆలయాలలో ఈ ప్రతిమ తప్పక ఉంటుంది. ఒకో చోట ఈ శరభ రూపం కేవలం నామమాత్రంగానే ఉంటే, మరికొన్ని చోట్ల సకల ఆయుధాలతోనూ, దుర్గాదేవి సమేతంగా దర్శనమిస్తుంది.

శివుని శరభేశ్వరునిగానో, శరభేశ్వరమూర్తిగానో కొలుచుకునే సంప్రదాయం తమిళనాట ఇంకా ప్రచారంలోనే ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని శైవాలయాలలో కూడా ఈ రూపం కనిపిస్తున్నప్పటికీ, దానిని శరభ అవతారంగా పోల్చుకునే భక్తులు అరుదు. అలాగని శరభ అవతారాన్ని తెలుగువారు గుర్తిచలేదని కాదు. ఈ అవతారం పేరు మీదుగా శరభాపురం వంటి ప్రాంతాలు మన రాష్ట్రాల్లో ఉన్నాయి. వీరశైవులు చేసే నృత్యాలలో శరభ, అశ్శరభ, దశ్శరభ అంటూ ఒళ్లు గగుర్పొడిచే అరుపులు వినిపిస్తాయి. తెలుగునాట శరభ ఉపనిషత్తు కూడా ప్రచారంలో ఉండేదని చెబుతారు.