Search This Blog

Chodavaramnet Followers

Friday 27 January 2017

BRIEF INFORMATION LORD ADHISESHU - THE SEVEN HEADS SNAKE


ఆదిశేషుని యొక్క ఏడుపడగల విశిష్టత !

ఆదిశేషుడు భూభారాన్ని వహిస్తున్నాడని ప్రసిద్ధి. (శ్రీ వేంకటేశ్వరస్వామికి జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలలో మొదటిరోజు రాత్రి, శ్రీవారు పెద్ద శేషవాహనంపై ఊరేగుతారు. ఈ స్వర్ణ శేషవాహనానికి ఏడు పడగలుంటాయి.) అది మనకు కనిపించని దృశ్యం. ఈ సన్నివేశాన్ని మనకు చూపించడానికా అన్నట్లుగా శ్రీమన్నారాయణుని అభీష్టం ప్రకారం ఆదిశేషుడు సువర్ణముఖరీ నదీ సమీపాన శేషాద్రిగా రూపొందాడు. 

శేషాచలాన్ని వరాహపురాణం ఇలా వర్ణించింది."శ్రీమన్నారాయణుని క్రీడాపర్వతమైన నారాయణగిరి మూడు యోజనాల వెడల్పు, ముప్పై యోజనాల పొడవు కలిగి ఉంది. (విష్ణువు యొక్క క్రీడాద్రియైన వేంకట పర్వతానికి సమాంతరం నారాయణగిరి). ఆ నారాయణగిరి ఆదిశేషుని ఆకారాన్ని కలిగి శ్రీహరికి మాత్రమే వశమై ఉంది. సర్వప్రాణులకు సంసేవ్యమైనది. ఆ పర్వతం దివ్యమైన ఆకారాన్ని, కలిగి, మహాపుణ్యప్రదమై ఉంది.

చిత్తూరు జిల్లానుండి కర్నూలు జిల్లా వరకు ఎర్రమల - నల్లమల అడవులలో ఏర్పడిన పర్వతాలు విహంగ వీక్షణమున సర్పాకృతిలో కనిపిస్తాయి. అందువల్లనే ఈ పర్వతశ్రేణికి శేషాచల పర్వతాలనే సార్థక నామధేయం ప్రసిద్ధమైంది. పర్వతానికి భూధారం (నేలతాలువు) అనే సార్థకనామ ధేయం ఉంది. భూమిపైనున్న పర్వతం భూమిని మోస్తోంది. భూభారాన్ని వహిస్తోంది. ఆదిశేషుడు భూమికి కిందా, పైనా ఉండి, భూమిని మోస్తూ, భూమికి ఆధారంగా ఉన్నాడు.

ఆదిశేషుని యొక్క ఏడుపడగల వలె ఉన్న ఏడుకొండలున్నాయి. వీటిపై శిరోభాగాన వేంకటేశ్వరస్వామి, వక్షఃస్థలాన అహోబిల నృసింహస్వామి, పృచ్ఛభాగాన శ్రీశైల మల్లిఖార్జునస్వామి వెలసియున్నారు. ఈ విషయాన్ని బ్రహ్మాండపురాణం వర్ణించింది. "ఆదిశేషుని యొక్క మణులలో ప్రకాశిస్తున్న పడగల ప్రదేశమే వేంకటాద్రి. దాని నామాంతరమే శేషాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి మొదలగునవి.

" శేషుని వక్షఃస్థలమే సర్వసిద్ధులను ఒసగే
నృసింహుని నివాసస్థానమగు అహోబిలక్షేత్రం"

"వేంకటాద్రికి ఉత్తరభాగం ఆదిశేషుని తోకయై ఉన్నది. ఈ పృచ్ఛభాగాన గల ప్రదేశం శ్రీశైలమనే పేరుతో ప్రసిద్ధం. ఈ విషయాన్నే భవిష్యోత్తరపురాణం ఇలా వివరించింది." అది (శేషాద్రి) సాక్షాత్తు శేషుని అవతారమై, సకల థావులచే శోభితమై, సకల పుణ్యక్షేత్రాలకు (తీర్ధాలకు) నిలయమై, పవిత్రములగు అరణ్యాలతో విరాజిల్లుతోంది. దాని ముఖం వెంకటగిరి, నడుము నృసింహపర్వతముగ (ఆహోబిలంగా), తోకభాగము శ్రీశైలంగా వేంకటాచలమనే పేరుతో ప్రసిద్దమై ఉన్నది.