Search This Blog

Chodavaramnet Followers

Thursday 24 March 2016

SOUR MEDICINES MORAL TELUGU KIDS STORY


చేదుమాత్రలు

నదిలో స్నానాదికాలు పూర్తి చేసుకొని, ఉదయిస్తున్న సూర్యునికి నమస్కరించి, భవానిభట్టు శిష్యుడు కార్తికేయుడితో పాటు ఇంటి ముఖం పట్టాడు.
వాళ్ళు ఊళ్లోకి ప్రవేశిస్తూ ఉండగానే ఒక మహిళ తన ఆరేళ్ళ కొడుకును ఎత్తుకొని ఎదురువచ్చి "అయ్యా! నా కొడుకును పాము కరిచింది. మీరే కాపాడాలి" అన్నది ప్రాధేయపడుతూ.
భవానిభట్టు పిల్లవాన్ని సమీపంలోని ఒక అరుగు మీద కూర్చోబెట్టి వాడి నాడి పరీక్షించాడు. తన హస్తంతో వాడి వళ్ళంతా నిమిరి, నొసట విభూతి రాసి ... కొన్ని నిముషాల పాటు మౌనంగా ఎదో మంత్రం చదివాడు. తరువాత వాడిని లేచి నిలుచోమని చెప్పి భుజం చరుస్తూ "నేను మంత్రం వేశాను కదా! భయపడ వలసిన పని లేదు. నీకు ఏమీ కాదు" అన్నాడు. తనవంక కృతజ్ఞతా పూర్వకంగా చూస్తున్న తల్లితో "మా ఇంటికి వస్తే మందు ఇచ్చి పథ్యం చెబుతాను" అని బయలుదేరాడు.
కొంతదూరం నడిచాక కార్తికేయుడు "గురువుగారూ! ఆ పిల్లవాడికి పాముకాటుకు విరుగుడు మంత్రం వేశారు కదా! ఇంకా మందుతో పనేముంది? ఆవిడను ఇంటికి ఎందుకు రమ్మన్నారు?" అని అడిగాడు.
"మంత్రం వేస్తె విషం విరుగుడు అయిపోతుందా?" అడిగాడు భవానిభట్టు.
"ఓ!.. మా ఊళ్ళో మరిడయ్య వద్దకు ఎక్కడెక్కడి నుండో బండ్లు కట్టుకొని మరీ తండోపతండాలుగా వస్తారు. వాళ్ళందరికీ అవుతుంది కదా!"
మరిడయ్య ప్రస్తావన రాగానే భవానిభట్టుకు ఆసక్తి కలిగి " ఆ మరిడయ్య వద్దకు అంతమంది జనం వస్తారు కదా! అందరికీ బాగవుతుందా?" అని అడిగాడు.
"అందరికీ బాగవుతుంది గురువుగారూ"
"ఇంతవరకూ ఎవరూ చనిపోలేదా?"
"చాలా తక్కువ నాకు తెలిసి గత సంవత్సర కాలంలో ఓ నలుగురైదుగురు చనిపోయి వుండొచ్చు."
"మరి మంత్రం వేసినా వాళ్ళు చనిపోయారు కదా! దానికి మరిడయ్య ఏం కారణం చెబుతాడు?" అడిగాడు భవానిభట్టు.
"తన దగ్గరికి చాలా ఆలస్యంగా తెచ్చారని, మంత్రం పనిచేయలేదని చెబుతాడు."
భవానిభట్టు కొంతసేపు నిశ్సబ్దంగా నడిచి, "కార్తికేయా! ప్రపంచంలో వున్న పాములన్నీ విష సంహితలు కావు. కొన్ని వేల రకాల జాతుల్లో కేవలం నాలుగైదు రకాల జాతుల పాములకు మాత్రమే విషం వుంటుంది. అవి కరిచిన వారికి తప్పకుండా విషానికి విరుగుడు ఇవ్వాలి. లేకుంటే ఎలాంటి మంత్రం వేసినా వాళ్ళు చనిపోతారు." అన్నాడు.
"మంత్రం వల్ల ఏ ఉపయోగం లేనప్పుడు ఆ పిల్లవాడికి మీరు మంత్రం ఎందుకు వేశారు?"
"ఆ మంత్రం వాడిలో వున్న భయాన్ని పోగొట్టడానికి మాత్రమే! ఏదో ఒక పాము కరవగానే, ఆ భయానికే చాలా మంది చనిపోతూ వుంటారు. అలాంటి వారికి ఈ మంత్రం ఔషధంలా పని చేస్తుంది. తర్వాత ఇంటికి రాగానే మందు ఇస్తాను. కరిచింది నిజంగా విష సర్పమే అయితే విషం విరుగుడు అవుతుంది. మంత్రం అతడిలోని భయం పోగొట్టి, మనో బలాన్ని ఇస్తుంది. మందు శరీరంలోని విషాన్ని హరిస్తుంది. మంత్రం మనసుకు - మందు శరీరానికి."
"ఆర్యా మీరు చెబుతున్న విషయాలు వింటూంటే నాకు చాలా ఆనందం కలుగుతోంది. మరి ఈ విషయాలను సూటిగా ప్రజలలో ప్రచారం చేసి వారిని జాగృతం చేయవచ్చు కదా!"
"అందరూ అక్షరాస్యులైనపుడు మాత్రమే అది సాధ్యమౌతుంది. తార్కికత్వం, శాస్త్రీయత అనేవి చేదుమాత్రల వంటివి. ప్రజలకు వాటి తత్వం అంత చప్పున బోధపడవు. ముందు వాటిని మందులా మింగించడానికి వాళ్ళ దారిలోకి వెళ్లి నాలుగు తీపి మాటలు చెప్పాలి. ప్రజలు వివేకవంతులై, విచక్షణతో వాళ్ళకై వాళ్ళు చేదుమాత్రాలు మింగడానికి ముందుకు రావడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం వచ్చేవరకు మనం సంయమనంతో ఎదురుచూడవలసిందే!" అన్నాడు భవానిభట్టు. -దాసరి వెంకటరమణ
(విద్యార్థి చెకుముకి పాతికేళ్ళ ప్రత్యేక సంచిక నుండి ఈ కథకు బొమ్మను వేసిన వారు ప్రముఖ చందమామ చిత్రకారులు "సునీతావాసు")