Search This Blog

Chodavaramnet Followers

Wednesday 25 November 2015

IMPORTANCE OF KARTHIKA POURNAMI DEEPARADHANA IN LORD SIVA TEMPLE


కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేస్తే

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి పవిత్రమైనది. మహాశివరాత్రితో సమానమైన ఈ పుణ్యదినాన్ని ''త్రిపురి పూర్ణిమ'', ''దేవ దీపావళి'' అని కూడా అంటారు. ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్ళిన మర్నాడు కార్తీకమాసం ప్రారంభమౌతుంది. 

ఇక ఆరోజు నుండి కార్తీకమాసం ముగిసేవరకూ ప్రతిరోజూ సాయంవేళ దీపాలు వెలిగిస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమిగా పేర్కొనబడింది.

కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈరోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో, కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేస్తే మంచి ఫలితాలుంటాయి.

కార్తీక పౌర్ణమి నాడు రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు. కొందరు దీపాలను అరటిదొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు.

కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది.