Search This Blog

Chodavaramnet Followers

Tuesday, 20 October 2015

EIGHTH ALANKARAM IN DASARA FESTIVAL - MAHAGOWRI - DURGA MATHA


దుర్గామాత యొక్క ఎనిమిదవ స్వరూపము ‘మహాగౌరి’ ( దుర్గ ) 
శ్లో|| శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః । మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవప్రమోదదా ॥

దుర్గామాత యొక్క ఎనిమిదవ స్వరూపానికి ‘మహాగౌరి’ అని పేరు. ఈమె పూర్తిగా గౌరవర్ణశోభిత. ఈమె గౌరవర్ణశోభలు మల్లెపూలూ, శంఖం, చంద్రులను తలపింపజేస్తాయి. ఈమె అష్టవర్షప్రాయముగలది (అష్టవర్షభవేద్గౌరీ). ఈమె ధరించే వస్త్రాలూ, ఆభరణాలూ ధవళ కాంతులను వెదజల్లుతుంటాయి. చతుర్భుజ, సింహవాహన. ఒక కుడిచేత అభయముద్రనూ, మరొక కుడి చేతిలో త్రిశూలాన్నీ వహించి ఉంటుంది. ఒక ఏడమచేతిలో డమరుకమూ, మరొక ఎడమ చేతిలో వరదముద్రనూ కలిగి ఉంటుంది. ఈ ముద్రలలో ఈమె దర్శనం ప్రశాంతంగా ఉంటుంది. పార్వతి అవతారంలో ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి కఠోరమైన తపస్సును ఆచరించింది. వ్రియేఽహం వరదం శంభుం నాన్యం దేవం మహేశ్వరాత్ (నారద పాంచరాత్రము) అనేది ఈమె ప్రతిజ్ఞ. భగవంతుడైన శివుణ్ణి పరిణయమాడటానికే దృఢంగా సంకల్పించుకొన్నట్లు తులసీదాస మహాకవి పేర్కొన్నాడు.

జన్మకోటిలగి రగర హమారీ । బర ఉఁసంభు న తరహ ఉఁకుఁమారీ ॥

కఠోర తపస్సు కారణాన ఈమె శరీరం పూర్తిగా నలుపెక్కి పోతుంది. ఈమె తపస్సునకు సంతుష్టుడైన శివుడు ప్రసన్నుడై, ఈమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళన గావిస్తారు. తత్ప్రభావంవల్ల ఈమె శ్వేతవర్ణశోభిత అయి విద్యుత్కాంతులను విరజిమ్ముతుంటుంది. అప్పటినుండి ఈమె ‘మహాగౌరి’ అని వాసి గాంచింది.
దుర్గా నవరాత్రోత్సవాల్లో ఎనిమిదవ రోజున మహాగౌరి ఉపాసన విధ్యుక్తంగా నిర్వహించబడుతుంది. ఈమె శక్తి అమోఘమూ, సధ్యఃఫలదాయకము. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషాలన్నీ ప్రక్షాళన చెందుతాయి. వారి పూర్వసంచిత పాపాలన్నీ పూర్తిగా నశిస్తాయి. భవిష్యత్తులో కూడా పాపతాపాలుగానీ, దైన్యదుఃఖాలు కానీ వారి దరిజేరవు. వారు సర్వ విధాలా పునీతులై, అక్షయంగా పుణ్య ఫలాలను పొందుతారు.
మహాగౌరీమాతను ధ్యానించటం, స్మరించటం, పూజించటం, ఆరాధించటం, మున్నగు రీతుల్లో సేవించటం వల్ల భక్తులకు సర్వ విధాలైనట్టి శుభాలు చేకూరుతాయి. మనము ఎల్లప్పుడు ఈమెను ధ్యానిస్తూ ఉండాలి. దేవి కృపవల్ల ఎల్లరికీ అలౌకిక సిద్ధులు ప్రాప్తిస్తాయి. మనస్సును ఏకాగ్రచిత్తం చేసి, అనన్య నిష్ఠతో సాధకులు ఈ దేవి పాదారవిందాలను సేవించటంవల్ల వారి కష్ఠాలు మటుమాయమవుతాయి. ఈమె ఉపాసన ప్రభావం వల్ల అసంభవాలైన కార్యాలు సైతం సంభవాలవుతాయి. కనుక సర్వదా సర్వదా ఈమె పాదాలను శరణుజొచ్చటమే కర్తవ్యము. పురాణాలలో ఈమె మహిమలు శతథా ప్రస్తుతించబడ్డాయి. ఈమె సాధకుల మనో వ్యాపారాలను అపమార్గాలనుండి సన్మార్గానికి మరలిస్తుంది. మనం అనన్య భక్తి ప్రపత్తులతో ఈమెకు శరణాగతులమవటం ఎంతో శుభదాయకం.
ఎర్రటి ఎరుపు రంగు, నైవేద్యం : చక్కెర పొంగలి (గుఢాన్నం)(బెల్లమన్నం)