Search This Blog

Chodavaramnet Followers

Tuesday 22 September 2015

KITCHEN ITEMS LIKE GINGER - HONEY ACTS AS ANTI BIOTICS - DETAILS IN TELUGU


వంటింటి యాంటీ బయోటిక్స్‌ 

పసుపు, తేనె, అల్లం, వెల్లుల్లి.. ఇవన్నీ మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాల్లో భాగంగానే మనందరికీ సుపరిచితం. అయితే ఇవన్నీ ప్రకృతి మనకు ప్రసాదించిన యాంటీబయోటిక్స్‌గానూ ఉపయోగపడతాయి. చాలామందికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల తరచూ చర్మ, జీర్ణ సంబంధిత సమస్యలు రావడం మనం గమనిస్తూ ఉంటాం. ఇలా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే బ్యాక్టీరియాను నశింపజేయడంతో పాటు తిరిగి పెరగకుండా కాపాడడంలోనూ ఈ సహజసిద్ధమైన యాంటీబయోటిక్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి.

పసుపు
ఆయుర్వేదిక్ మందుల తయారీలోనూ ఉపయోగించే ఔషధం పసుపు. ఇందులోని యాంటీబయోటిక్ గుణాలు మన శరీరాన్ని బ్యాక్టీరియా నుంచి కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే పసుపులోని 'కుర్కుమిన్' అనే పదార్థం వివిధ రకాల అనారోగ్యాల నుంచి రక్షిస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి పసుపును రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం ముఖ్యం. దీంతో పాటు రోజూ పసుపు, తేనె మిశ్రమాన్ని తీసుకోవడం కూడా మంచిది.

వెల్లుల్లి..
వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో యాంటీఫంగల్, యాంటీవైరల్ గుణాలు అధికంగా ఉన్నాయి. వీటితో పాటు ఖనిజాలు, విటమిన్లు, పోషకాలతో నిండి ఉన్న వెల్లుల్లి బ్యాక్టీరియాను తరిమికొట్టి అనారోగ్యాన్ని దూరం చేస్తుంది. కాబట్టి వెల్లుల్లిని రోజూ తయారుచేసుకొనే వంటకాల్లో భాగంగా చేసుకోవడంతో పాటు ఉదయాన్నే పరగడుపున రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని నమలడం మంచిది.

క్యాబేజీ
క్యాబేజీ సహజసిద్ధమైన యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. ఇందులోని సల్ఫర్ సమ్మేళనాలు క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పోరాడి ఆ వ్యాధి ముప్పును తప్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

తేనె
తేనెలో ఉండే యాంటీమైక్రోబియల్, యాంటీఇన్‌ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ గుణాలు బ్యాక్టీరియాను నశింపజేయడంలో తోడ్పడతాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇందుకోసం దాల్చిన చెక్క, తేనె సమపాళ్లలో తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రోజూ చెంచా చొప్పున తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి మెరుగుపడడంతో పాటు ఎలాంటి అనారోగ్యాలైనా దూరమవుతాయి. అలాగే బరువు తగ్గాలనుకునే వారు చక్కెరకు బదులుగా తేనెను ఉపయోగించుకోవచ్చు.

వేప
అద్భుత ఔషధ గుణాలు కలిగిన మరో పదార్థం వేప. ఇందులోని యాంటీబయోటిక్ గుణాలు చర్మంపై ఏర్పడే ఇన్ఫెక్షన్లు, మొటిమల్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే చాలా రకాల కాస్మెటిక్ ఉత్పత్తుల్లో వేపను ఉపయోగిస్తుంటారు. అలాగే ఇందులోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు చిగుళ్ల సమస్యను కూడా తగ్గిస్తాయి. పళ్లను బలంగా మారుస్తాయి. ఇప్పటికీ పల్లెటూళ్లలో చాలామంది ఉదయాన్నే వేపపుల్లతో పళ్లు తోముకోవడం చూస్తూనే ఉంటాం.

అల్లం..
అల్లంలో ఉండే యాంటీబయోటిక్ గుణాలు బ్యాక్టీరియా వల్ల కలిగే పలు రకాల ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని కాపాడతాయి. అలాగే శ్వాసకోశ సంబంధిత సమస్యలు, చిగుళ్ల ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో అల్లాన్ని భాగం చేసుకోవడం తప్పనిసరి.