చామదుంపల్లో ..చాలా పోషకపదార్ధాలు
దుంపకూరలకు సీజన్ అంటూ ఉండదు. ఏ సీజన్ లో అయినా అందుబాటులోనే ఉంటాయి.. అలాంటి వాటిల్లో చామదుంపలు ఒకటి.
ఆలుగడ్డల్ని ఇష్టపడినట్లుగా ఎందుకో.. చాలామంది చామదుంపల్ని ఇష్టపడరు. వండటానికి సమయం ఎక్కువపడుతుందనో.. లేక.. తినేటప్పుడు జిగురుగా ఉంటుందనో వంకలు పెడుతుంటారు. కానీ ఇందులో ఉండే పోషకపదార్ధాల గురించి తెలుసుకుంటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు.
చామదుంపల్లో విటమిన్ " సి" , బి కాంప్లెక్స్, మాంగనీస్ ,కాల్షియం ,ఐరన్ ,ఫాస్పరస్ పుష్కలంగా లభిస్తాయి. 100 గ్రాముల చామదుంప సుమారు 120 కేలరీలను ఇస్తుంది... దీనివల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. బరువు తగ్గడంలోనూ చామ ఎంతో సహకరిస్తుంది . మిగతా వేరు దుంపల మాదిరిగానే వీటిలో ప్రోటీన్లు ఉంటాయి.
గుండెజబ్బులకు ..హైపర్ టెన్షన్ కు కారణమయ్యే బ్లడ్ హోమోసిస్టిన్ స్థాయిలను తగ్గించడానికి అవసరమైన ' ఇ ' విటమిన్ , రక్తపోటు క్రమబద్దీకరణకు సహకరించే పొటాషియం దీనిలో పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే డియోస్కోరిన్ అనే ప్రోటీన్ గుండె జబ్బులను , స్ట్రోక్ రిస్కులను తగ్గిస్తుంది .
చామదుంపలు జీర్ణ ఆరోగ్యసహాయకారి . వీటిలో ఉండే డైటరీ ఫైబర్ ..మలబద్దకాన్ని తగ్గించి , విషతుల్యాలు పేరుకోకుండా కాపాడుతుంది. వీటిని ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం ద్వారా కోలన్ కాన్సర్ , ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్ ల నుండి బయటపడొచ్చు.