Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 5 August 2015

DETAILED ARTICLE ABOUT DIFFERENT TYPES OF BATHING STYLES ACCORDING TO INDIAN ANCIENT PURANAS


వివిధ రకాల స్నానములు 

మన శరీరంలోని మురికి కర్మేంద్రియాల ద్వారాను, లెఖ్ఖలేనన్ని చర్మ రంధ్రాల ద్వారాను బయటికి వస్తుంది.ఆ మాలిన్యాన్ని తొలగించకపోతే మన ఆరోగ్యం చెడిపోతుంది. సూక్ష్మదర్శినీ యంత్రముతో చూసినప్పుడు శరీర చర్మములోని ఒక చదరపు అంగుళములో 3000 రంధ్రాలున్నాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. అయితే ఈ రంధ్రాల నుండి నిరంతరము మలినము బయటికి వస్తూనే ఉంటుంది. దానిని శుభ్రము చేసినప్పుడు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.లేకపోతే చర్మరోగాలు వస్తాయి కాబట్టి మనం ప్రతి రోజూ స్నానం చేయవలసిన అవసరం ఏర్పడింది. అందుకే దీన్ని గ్రహించిన మన పెద్దలు స్నానాన్ని ధార్మిక ఆచారముగా చెప్పారు. వైద్యులేమో చికిత్సలో ఒక అంగముగా చెప్పారు.
ధర్మశాస్త్రాలలో స్నానం గురించి ఇలా చెప్పబడింది.
స్నానమూలా:క్రియాస్సర్వా: శ్రుతి స్మృత్యుదితా నృణా:
తస్మాత్ స్నానం నిషేవేత శ్రీ పుష్ట్యారోగ్య వర్ధనం
భావం: వేద శాస్త్రాలలో చెప్పిన కర్మలన్నీ స్నానము చేతనే సిద్ధించును.కావున శుభములను,పుష్టిని ఆరోగ్యమును వృద్ధిచేయు స్నానమును తప్పనిసరిగా చేయవలెను.
ఇవేకాక స్నానం వల్ల కలిగే లాభాలు కూడా చెప్పబడ్డాయి.
స్నానము వలన జఠరాగ్ని దీపనము,ధాతు పుష్టి,ఆయుస్సు,తేజస్సు,బలము కలగటమే కాక దురద,మురికి,అలసట,చెమట,సోమరితనము,దప్పి,పాపములు పోతాయి.
సాధారణంగా మనకి సముద్ర స్నానం,నదీస్నానం,పుష్కరిణి,చెరువు,బావి లతో బాటు మనకు వేడినీళ్ళ స్నానం,చన్నీళ్ళ స్నానం లాటివి సహజంగానే తెలుసినవే కదా!
ఇవేకాక మరి 7 రకాల స్నానాలను శాస్త్రం చెపుతోంది.ఇవి ఎప్పుడు చేయాలో కూడా తెలిపింది.
"శరీరస్య అసామర్థ్యాత్,దేశకాల యో:వైషమ్యాత్ స్నానాని ఏతాని తుల్యాని శ్రేష్ఠం మానసముచ్యతే"... రోగముతో ఉన్నప్పుడు,దేశకాలములు వైపరీత్యముగా ఉన్నప్పుడు,క్రింద చెప్పబడే స్నానములు కూడా పై స్నానములతో సమానమే. వీనిలో మానసిక స్నానము ఉత్తమమైనది.
1.మంత్ర స్నానం: రోగముతో స్నానము చేయలేనప్పుడు తడిబట్టతో శరీరమును తుడుచుకొని ఉతికిన బట్ట కట్టుకొని చిన్న పాత్రలో నీరు తీసుకుని క్రింది మంత్రముతో తనపై చల్లుకోవాలి.
"అపోహిష్ఠామ యోభువ: తాన ఊర్జే దథా తన మహేరణాయచక్షుషే యోవశ్శివ తమోరస:
తస్యభాజాయ తేహనం: ఉశతీరివ మాతర తస్మా అరం గమామవ: యస్యక్షయాయ ఇన్వథ: ఆపోజన యథాచన:" అని చెప్పాలి. గురూపదేశము అయిన వారు గాయత్రీ మంత్రము చెప్పి నీటిని తాగాలి.
2.మృత్తికా స్నానము: పూర్తిగా అసక్తులైన వారు తులసి చెట్లదగ్గర ఉన్న పొడి మట్టిని చేతిలో వేసుకుని "ఉదృతాసి వరాహేణ కృష్ణేన శతబాహునా మృత్తికే హనమేపాపం యన్మయా దుష్కృతం కృతం" అంటూ రెండు అరచేతులతో మట్టిని రుద్దుకుని వంటికి పూసుకోవాలి
3.భస్మ స్నానము: ఆవు పేడ పిడకను కాల్చిన భస్మమును గాని, హోమాగ్ని భస్మమును గాని చేతిలో వేసుకుని "ఓం చత్వారి శృంగా: త్రయో అస్యపాదం: ద్వేశీర్షే సప్త హస్తా సోఅస్య త్రిథాబర్థో వృషభో రోరవీతి మహాదేవో మర్త్యం అవివేశ:" అని ప్రార్థిస్తూ శరీరానికి పూసుకోవాలి.
4.వాయువ్య స్నానము: ఆవుల పాదధూళిని చేతిలో తీసుకుని శ్రీకృష్ణుని ధ్యానించుచు పూసుకోవాలి.
5.కపిల స్నానము: నాభి క్రింది భాగమును నీటితో కడుగుకొని పై భాగమును తడిబట్టతో తుడుచుకోవాలి.
6.దివ్య స్నానము: ఉత్తరాయణమున ఎండతో కూడిన వర్షములో తడియుట
7. మానసిక స్నానము: మనసులో క్రింది శ్లోకములను పఠించుకోవాలి.
"ఖస్థితం పుండరీకాక్షం మంత్రమూర్తిం హరిం స్మరేత్"
" శ్యామలం శాంత హృదయం ప్రసన్న వదనం శుభం"
"ఇదం మానసిక స్నానం ప్రోక్తం హరిహరాదిభి:"
"ఇదం స్నానం వరం మంత్రాత్ సహస్రా దధికం స్మృతం" ఈ స్నానము శ్రేష్ఠమైనది.