Search This Blog

Chodavaramnet Followers

Tuesday 7 July 2015

SIMPLE DAILY TIPS TO REDUCE HEAVY WEIGHT IN ONLY SEVEN DAYS - MUST FOLLOW


ఏడు రోజుల్లో బరువు తగ్గండి.

లెక్క కరెక్టేనా? ఇందులో మాయా మర్మం ఏమీ లేదుకదా? లేకపోతే అధిక కొవ్వును ఆపరేషన్‌ ద్వారా తొలగిస్తారా? అసలు నెలలో ఇన్ని కిలోల బరువు తగ్గడం సాధ్యమయ్యే పనేనా? ఇన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదూ! ఒక వారంలో మూడున్నర కిలోల బరువు తగ్గడం అంటే మాటలు కాదు. కానీ, అదేమీ కష్టం కాదు అంటున్నారు నిపుణులు. తాము సూచించే వారం రోజుల డైట్‌ ప్లాన్‌ తూచా తప్పకుండా పాటిస్తే బరువు కచ్చితంగా తగ్గుతారంటున్నారు. శరీరం మీద చిన్నపాటి గాటు కూడా పెట్టించుకోకుండా బరువు తగ్గేందుకు వారు చెబుతున్న వారం రోజుల డైట్‌ ప్లాన్‌ వివరాలు...

భోజనం చేయకూడదా?:
వారం రోజుల పాటు కూరగాయలు లేదా పళ్ళు తిని ఉండాలంటే కొద్దిగా కష్టమే! అలా వుండలేని వారు కొద్దిమొత్తంలో అన్నాన్ని రోజులో ఒకసారి మాత్రమే తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. భోజనంలో కూడా పోషకాలతో పాటు ఫైబర్‌ అధికంగా వుండే విధంగా చూసుకోవాలని వారు సూచిస్తున్నారు. కింద ఇచ్చిన డైట్‌ ప్లాన్‌లో ఆహారాన్ని రోజు మొత్తం మీద కొద్ది కొద్దిగా తీసుకోవాలని వారు చెబుతున్నారు.

సోమవారం
పళ్ళతో విందు: శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపాలంటే పళ్ళతో విందు మంచి మార్గం. ఇంకెందుకు ఆలస్యం? ఈ సోమవారాన్ని పళ్ళ డైట్‌తో ప్రారంభించండి. పళ్ళ డైట్‌ అంటే బోలెడన్ని పళ్ళు తినేసి బ్రేవ్‌ మని తేన్చడం కాదు. రోజు మొత్తం మీద నాలుగు ఆపిల్స్‌. నాలుగు ఆరంజ్‌లు, రెండు దానిమ్మ, ఒక వాటర్‌ మిలన్‌ పండు తినాలి. అలా రోజును పూర్తి చేయండి. పళ్ళు తింటే బోలెడంత సమయం పడుతుంది కదా, ఆ పళ్ళతో జ్యూస్‌లు తయారు చేసుకుని తాగితే బాగుంటుంది కదా అనుకునేరు. ఆ పని అస్సలు చేయకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పళ్ళ జ్యూస్‌లను దగ్గరకు రానీయకండి. సరిపడా పళ్ళు తింటున్నాం కదా, నీరు ఎందుకు దండగ అనుకునేరు... పది గ్లాసుల నీరు తాగడం మర్చిపోకండి. పై పళ్ళు, పది గ్లాసుల నీరు సోమవారం డైట్‌లో తప్పనిసరిగా వుండాల్సిందే! ఈ వారం రోజులూ ఉదయమే గోరువెచ్చని నీటిలో స్పూను తేనె, కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగండి. ఈ నీరు తాగిన తరువాతే మీ డైట్‌ను మొదలుపెట్టండి.
వ్యాయామం: నడకను మించిన వ్యాయామం లేదంటారు కదా? రోజూ అరగంట పాటు నడిచేవారు మరో పది నిమిషాలు పొడిగించుకోండి. అదీ బ్రిస్క్‌ వాక్‌ చేస్తే మరీ మంచిది.

మంగళవారం
కూరగాయలు మాత్రమే: మీ వెయిట్‌ లాస్‌ ప్రోగ్రామ్‌లో రెండవ రోజు వచ్చేసింది. ఈ రోజు కూరగాయలు మాత్రమే తీసుకోండి. వాటిని పచ్చిగా తిన్నా సరే లేదా సలాడ్స్‌, అంతగా కాకపోతే ఉడకబెట్టినవి తినండి. చప్పగా తినడం కష్టంగా వుంటే వాటి మీద చిటికెడు ఉప్పు కొద్దిగా మిరియాల పొడి చల్లుకుని తినండి. ఆకలి అనిపించినప్పుడల్లా ఈ కూరగాయలను తినేయండి. వీటికి వెన్న, క్రీమ్‌, పాలు, నూనె వంటివి అస్సలు కలుపుకోకండి. ఉదయమే గ్లాసు గోరువెచ్చని నీరుతాగిన తరువాత ఉడికించిన బంగాళాదుంప తినండి. అదే మీ బ్రేక్‌ఫాస్ట్‌ అయిపోతుంది. లంచ్‌, డిన్నర్‌కి పచ్చి లేదా ఉడికించిన కూరగాయలు తీసుకోండి.

బుధవారం
అరటిపండు, పాలు: ఈ రోజు మీ ఆహారం పది అరటిపండ్లు, మూడు గ్లాసుల పాలు, గిన్నెడు డైట్‌ సూప్‌. ఈ కొద్దిపాటి ఆహారంతో ఆకలి తీరలేదు అనుకుంటే చాలా తక్కువ మొత్తంలో అన్నం తినండి. అన్నానికి బదులు గోధుమ లేదా జొన్న రొట్టె తీసుకుంటే ఇంకా మంచిది. వీటితో పాటు నీరు తాగే శాతాన్ని కొద్దిగా పెంచండి. పది గ్లాసులు కాకుండా పన్నెండు గ్లాసుల నీరు తాగితే మంచిది.
గురువారం
ఈ రోజు మీకు ఇష్టమైనన్ని పళ్ళు కూరగాయలు తీసుకోండి. కూరగాయలను వెన్న లేదా నూనె వేసి తయారు చేసినవి మాత్రం తినకండి. పచ్చివి తింటే మరీ మంచిది అలా కాకుండా ఉడకబెట్టినవి కూడా తీసుకోవచ్చు. ఈ రోజు కూడా పన్నెండు గ్లాసుల నీరు తాగడం మరిచిపోకండి. వీటితో పాటు పళ్ళు, కూరగాయలు కలిపి తయారు చేసుకున్న సలాడ్‌ను తీసుకోండి. పళ్ళ జ్యూస్‌లకు దూరంగా వుండండి.

శుక్రవారం
ఈ రోజు పళ్ళు కూరగాయలతో పాటు చిన్న గిన్నెడు బ్రౌన్‌రైస్‌, చిన్న కప్పు పప్పుతో పాటు గ్లాసు పలుచని మజ్జిగా తీసుకోండి. ఈ రోజు కనీసం ఆరు టమోటాలు, రెండు ఆపిల్స్‌, రెండు ఆరంజ్‌ పళ్ళు తీసుకోండి. వీటితో పాటు ప్రతిరోజూ లాగే సలాడ్‌ను తీసుకోండి. ఈ రోజు తాగే నీటి కోటాను ఇంకా కొద్దిగా పెంచండి. మరో రెండుగ్లాసుల నీరు అదనంగా అంటే మొత్తం పధ్నాలుగు గ్లాసుల నీరు తాగండి.

శనివారం
పై రోజుల్లో ఏదో ఒక రోజు డైట్‌ని ఈ రోజు ఫాలో అయిపోండి. ఈ రోజు కూడా తాగే నీరు తగ్గకుండా చూసుకోండి. అదనంగా ఓ కప్పు గ్రీన్‌ టీని అదనంగా చేర్చండి. ఈరోజు వీలుంటే కాఫీ, టీలకు గుడ్‌బై చెప్పేయండి. సలాడ్స్‌ షరా మామూలే!

ఆదివారం
చిట్టచివరి రోజు. ఏడురోజుల డైట్‌ప్లాన్‌కి బైబై చెప్పేయాలని అనుకునే రోజు. మీకిష్టమై.న కూర గాయలను చిన్ని గిన్నె పప్పు, బ్రౌన్‌రైస్‌తో కలిపి ఉడి కించుకుని తీసుకోండి. వీటితో పాటు గ్లాసు పలుచని పాలు, చిన్న గిన్నె సలాడ్‌ను కూడా తీసుకోండి. ఈ రోజు మాత్రం ఓ గ్లాసు తాజా పళ్ళరసాన్ని చక్కెర లేకుండా తాగండి.
పొట్టను తగ్గించే బాదం పప్పులు
బాదంపప్పులు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది అన్న విషయం అందరికీ తెలిసిందే! అయితే పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవడానికి బాదం పప్పులను స్నాక్స్‌ కింద తీసుకోవాలని పెన్సిల్వేనియా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ప్రతిరోజూ 42గ్రాముల బాదంపప్పును స్నాక్‌ కింద తీసుకుంటే చాలా వరకూ బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చన్న సంగతి వీరి పరిశోధనలో వెల్లడైంది. మధ్య వయస్కులైన 52 మంది ఊబకాయుల మీద వీరు పరిశోధనలు నిర్వహించారు వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు వారికి 42 గ్రాముల బాదంపప్పును ఇవ్వగా, మరో గ్రూపు వారికి వేరే ఆహారాన్ని స్నాక్స్‌ కింద ఇచ్చారు. ఈ విధంగా ఆరు వారాలు ఇచ్చి అనంతరం వారి బెల్లీ ఫ్యాట్‌ను పరిశీలించగా, బాదంపప్పులు తిన్న వారిలో బెల్లీ ఫ్యాట్‌ తగ్గిన విషయాన్ని వీరు గుర్తించారు.

పరగడుపునే మంచిది
వ్యాయామం చేయడం బరువు తగ్గించుకోవడానికి సులభమైన మార్గం. అయితే చాలా మంది ఉదయాన్నే లేవగానే టీ, కాఫీ లేదా తేలికపాటి ఉపాహారం తీసుకుని నడక లేదా జాగింగ్‌ చేయడం మొదలు పెడతారు. ఈ విధంగా ఎన్ని వారాలు లేదా నెలలు చేసినా ఏ మాత్రం ఫలితం వుండదని నిపుణులు అంటున్నారు. ఉదయాన్నే లేవగానే రెండు గ్లాసుల నీరు మాత్రమే తాగి నడక లేదా జాగింగ్‌ చేస్తే కొద్దివారాల్లోనే అనుకున్న విధంగా బరువు తగ్గవచ్చని వారు అంటున్నారు. బెల్జియంలో నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం స్పష్టమైంది. ఉదయాన్నే నడిచేవారిని రెండు గ్రూపులుగా విభజించి, ఒక గ్రూపు వారి చేత పరగడుపున వ్యాయామం చేయించగా, మరో గ్రూపు వారికి తేలికపాటి ఉపాహారం ఇచ్చి వ్యాయామం చేయించారు. ఆరువారాల తరువాత వీరి బరువు పరిశీలించగా పరగడుపున వ్యాయామం చేసిన వారు మూడు పౌండ్ల బరువు తగ్గగా, ఉపాహారం తీసుకున్న వారి బరువులో ఏమాత్రం తేడా కనిపించలేదు.

తక్కువ కాలరీలు కలిగిన సలాడ్‌కి కావలసిన పదార్థాలు
నీరు: 750 ఎంఎల్‌, ఉల్లిపాయ: ఒకటి (గుండ్రంగా కట్‌ చేసుకోవాలి), పచ్చిమిరపకాయలు:రెండు(ఇవి కూడా కట్‌ చేసుకోవాలి), టమోటా: మూడు(వీటిని కూడా గుండ్రంగా కట్‌ చేసుకోవాలి)క్యాబేజీ తురుము: కొద్దిగా, క్యారట్‌:
ఒకటి (చక్రాల్లా కట్‌ చేసుకోవాలి)
తయారీ విధానం: గిన్నెలో అన్నింటిని వేసి కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టి అనంతరం తీసు కోవాలి.
ముగింపు
బరువు తగ్గడం అనేది కేవలం ఆహార నియమాలతోనే పూర్తి కాదు. ఆహార నియమాలను పాటిస్తూ తగినంత వ్యాయామం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. పై విధంగా ఆహారం తీసుకుంటూ రోజుకి కనీసం 30నుంచి 40నిమిషాల నడక తప్పని సరి అని వారు సూచిస్తున్నారు. తీసుకునే ఆహారంలో కార్బొహైడ్రేట్స్‌ 55 శాతం, ఫ్యాట్స్‌ 25 శాతం, ప్రొటీన్లు 20శాతం వుండే విధంగా సమతుల ఆహారం తీసుకోవాలనీ, అప్పుడే అనుకున్న రీతితో అధికబరువును తగ్గించుకోగలరని వారు సూచిస్తున్నారు.