Search This Blog

Chodavaramnet Followers

Friday 27 March 2015

HOW TO MAKE VADAPPU AND PANAKAM FOR SRIRAMANAVAMI FESTIVAL - SRIRAMANAVAMI FESTIVAL RECIPES IN TELUGU


పానకం-వడపప్పు ప్రాముఖ్యత: తయారీ విధానం!

శ్రీరామనవమి రోజున పానకం-వడపప్పు ప్రాముఖ్యత ఏంటి? నవమి రోజున పానకం-వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు. ఇది వేసవికాలం. కాబట్టి, వీటిని ప్రసాదరూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం. 

మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు - పానకం కూడా అంతే. శరదృతువు, వసంత రుతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ రుతువులో వచ్చే గొంతువ్యాధులకు... పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతారు.

పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైంది. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ'పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ' కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది.

ఇక పానకం ఎలా చేయాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు :
బెల్లం - 3 కప్పులు
మిరియాల పొడి - 3 టీ స్పూన్లు,
ఉప్పు : చిటికెడు,
శొంఠిపొడి : టీ స్పూన్,
నిమ్మరసం : మూడు టీ స్పూన్లు,
యాలకుల పొడి : టీ స్పూన్
నీరు : 9 కప్పులు

తయారీ విధానం :
ముందు బెల్లాన్ని మెత్తగా కొట్టుకుని.. నీళ్ళలో కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగాక.. పలుచని క్లాత్‌లో వడకట్టాలి. ఇందులో మిరియాలపొడి, శొంఠి పొడి, ఉప్పు, యాలకల పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. అంతే పానకం సిద్ధమైనట్లే.

అలాగే వడపప్పు ఎలా చేయాలంటే..?
కావలసిన పదార్థాలు:
పెసరపప్పు - కప్పు,
కీరా - ఒక ముక్క,
పచ్చిమిర్చి - 1 (తరగాలి),
కొత్తిమీర తరుగు- టీ స్పూన్,
కొబ్బరి తురుము -టేబుల్ స్పూన్,
ఉప్పు - తగినంత

తయారీ విధానం: పెసరపప్పును నాలుగు గంటలు నీళ్లలో నానబెట్టాలి. నీటిని వడకట్టేసి, పప్పు ఒక గిన్నెలో వేయాలి. దాంట్లో కీరా తరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరి, ఉప్పు వేసి కలపితే వడపప్పు రెడీ అయినట్లే.