Search This Blog

Chodavaramnet Followers

Friday, 22 August 2014

TELUGU ARTICLE ON CHATHURDASA LOKAMALU - 14 LOKAS AND ITS BRIEF FACTS


చతుర్ధశలోకములు

ఇతిహాస, పురాణములననుసరించి, బ్రహ్మదేవుని సృష్టిలోన చతుర్ధశ (14) భువనములు లేక లోకములు కలవు. మనమున్న భూలోకమునకు పైన భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము మరియు సత్యలోకములు, భూలోకముతో చేర్చి సప్త (7) లోకములు కలవు. అలాగే భూలోకమునకు క్రింద అతలలోకము, వితలలోకము, సుతలలోకము, రసాతలలోకము, తలాతలలోకము, మహాతలలోకము, పాతాళములని సప్త (7) అధోలోకములు కలవు. 

భూలోకవాసులైన మానవులను తప్పించి ఇతర లోకములలోనున్నవారు అధిక పుణ్యాత్ములు, అచ్చటనున్న జీవుల శరీరములు అతిసూక్ష్మములైనవి. భూలోకము యొక్క దక్షిణదిగ్భాగములో మృత్యు (యమ) లోకము, ప్రేతలోకము, నరకలోకము, పిత్రులోకములనే 4 భాగములు కలవు.

(1) భూలోకము - ఇచ్చట స్వేదము (చెమట నుండి ఉద్భవించు పేళ్ళు (పేనులు), నల్లులు మొ.), ఉద్భిజములు (గ్రుడ్డు నుండి ఉద్భవించు పక్షులు), జరాయుజములు (స్త్రీ, పశువుల గర్భము నుంది ఉద్భవించు మానవులు మరియు పశువులు) అని నాలుగు విధములైన జీవరాసులు.

(2) భువర్లోకము (భూలోకము పైన) - ఇచ్చట సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులు, అశ్విన్యాది నక్షత్ర సద్రుష్యములైన గ్రహరాసులు, సూక్ష్మ శరీరులైన కిన్నెరా, కింపురుష, విద్యాధరులు కలరు.

(3) సువఃలోకము లేక సువర్లోకము లేక స్వర్గలోకము (భువర్లోకము పైన) - ఇక్కడ అధిష్ఠాన దేవతలు అగు ఇంద్రాదులు, దిక్పాలకులు, వర్ష-వాయువులు, ఐశ్వర్యాదులు కలరు. వీరితోపాటు సాధ్యులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసలు కలరు. వీరు కామరూపులై భోగములనుభవింతురు. వీరికి వ్రుద్ధ్యాము, శరీర దుర్గందాధులుండవు. వీరిని క్షుత్పిసలు బాధింపవు. వీరు అయోనిజులు కావున, మాత్రు-గర్భ వాసము లేదు.

(4) మహర్లోకము (సువర్లోకము పైన) = ఇక్కడ దేవతలు తపమొనరించు చుందురు. ఎలా స్వర్గలోకములోని దేవతలు దివ్య సుఖమును అనుభవించుచున్నారో, అవియన్నియూ ఇక్కడ తపస్సు ద్వారా పరుపూర్ణముగా అనుభవించుచున్నారు.

(5) జనోలోకము (మహర్లోకము పైన) - దీనిని కొందరు సత్యలోకమని కూడా అందురు. ఏ స్త్రీ భర్త మరణానంతరము సహగమనము చేయునో, ఆమె యొక్క పవిత్ర శీలప్రభావముచేత ఆమె పతికి అన్య జన్మ ఉన్నప్పిటికినీ, జన్మరాహిత్యము కలిగి, సతిపతులిరువును ఈ జనలోకములో సుఖసాంతులతో వర్ధిల్లుదురు. ఇచ్చట అయోనిజ దేవతలు కూడా తపమాచరించుదురు.

(6) తపోలోకము (జనోలోకము పైన) - ఇక్కడ అయోనిజ దేవతలు నివసించుచుందురు. పంచభూతములు, పంచేంద్రియములు వీరి ఆధీనములో ఉండును. కైలాసము, వైకుంఠము, మణిద్వీపము, స్కంధలోకము ఇచ్చటనే కలవు. ఈ లోకము సర్వదా సుగంధ ద్రవ్యముల సువాసనలతోను, శాంతియుతముగాను, సాంద్రానందముతోను కూడియుండును. భూలోకములో ఎవరెవరు, ఏయే దేవతాముర్తులను ఉపాసించిరో ఆయా మూర్తుల రూపములతో ఇచ్చట తపములాచరించుచున్నారు. ఈ రీతిగా వారు కల్పాంత-కాలము అచ్చటనే ఉంది కర్మానుసారము భూలోకములో మరల జన్మించి, మరల పవిత్ర తపములు ఆచరించి, ఎప్పుడు మహాప్రళయములో సర్వమూ లయమగునో అప్పుడు వీరుకూడ జన్మరాహిత్యము పొందుదురు.

(7) సత్యలోకము (తపోలోకము పైన) - ఇచ్చటనే సృష్టికర్త అయిన హిరణ్యగర్భుడు, బ్రహ్మయను ఒక అధికారిక పురుషుడు ఆ పదవిని అనేకానేక కల్పానంతరము ఒక్కక్కరు పొంది తమ ఆయువు తీరినంతనే బ్రహ్మములో లయమగుదురు. ప్రస్తుత బ్రహ్మకు మొదటి అర్థభాగము తీరినది. భావిబ్రహ్మ శ్రీ ఆంజనేయస్వామి. ఈ లోకములోకూడ అనేక ఉపాసనలు చేసినవారు, వేదాంత విచారకులు, భూలోకములో ఆత్మజ్ఞానము పొందినవారు, అసంఖ్యాకులగు మహర్షులు వేదాంతవిచారణలు గావించుచుందురు. మహాప్రళయకాలములో బ్రహ్మలోక పర్యంతముగాగల సప్తలోకములు పరబ్రహ్మములో లయమగును. బ్రహ్మయొక్క ప్రతి రాత్రులందు ఒక్కొక్క ప్రళయము సంభవించి, భూలోకము, భువర్లోకము, సువ(స్వర్గ)ర్లోకములు లయమును పొందును. అతని యొక్క పగటి కాలమందు పునః ఈ లోకములు సృష్టింపబడును.

సప్త అధోలోకములు:

(1) భూలోకమునకు క్రింద అతల లోకము కలదు. ఇందులో అసురులు నివసించుచుందురు. వీరు సూక్ష్మ శరీరులు. భౌతిక సుఖలాలసులు కావున అధిక మద సంపన్నులు.

(2) వితల లోకము (అతలలోకము క్రింద) - ఇచ్చట పార్వతీ-పరమేశ్వరుల వీర్యము "ఆఢకము" అనే నది సువర్ణ జల ప్రవాహములతో నిండి యుండును. అనేక భౌతిక సుఖములతోపాటు ఈ నదీ ప్రవాహమాలతో సుర్వర్ణాభరణములు చేసుకొని ధరించెదరు.

(3) సుతల లోకము (వితల లోకము క్రింద) - సప్త చిరంజీవులలో ఒకడైన మహాపురుషుడు బలి చక్రవర్తి ఇచటనే కలడు. అయన సర్వదా విష్ణుధ్యాన పరాయణుడై, శ్రీమహావిష్ణువు ద్వారపాలకుడై కాపలాకాయుచుండగా ఉన్నాడు.

(4) తలాతల లోకము (సుతల లోకము క్రింద) - ఈ లోకములో పరమేశ్వరునిచేత సంహరించబడిన దానవేంద్రులయిన త్రిపురాసురులు, దానవ శిల్పి యగు మయుడు, మాయావిద్యయందు నేర్పరులైన అసురులు, రాక్షసులు నివసించెదరు.

(5) మహాతలము (తలాతలలోకము క్రింద) - ఇచ్చట కద్రుపుత్రులైన కాద్రవేయులు (సర్పములు), సహస్రాది శరుస్సులతో కూడినవారై మహా బలవంతులై కామరూపధారులై తమ పత్నులతో కూడి ఉన్నారు.

(6) రసాతలము (మహాతలము క్రింద) - ఇచ్చట అసుర రాక్షసశ్రేష్ఠులు, నివాత కావచులు, కాలకేయాదులు, సురారులైన అనేక రాక్షసులు కలరు.

(7) పాతాళము (రసాతలము క్రింద) - ఇచ్చటనే నాగలోకాధిపతియైన వాసుకి మొదలు సర్ప సమూహములన్నియు కామరూపధారులై సుఖసంతోషములతో ఉన్నారు.

మహా ప్రళయ కాలములో ఈ చతుర్ధశభువనములు పరబ్రహ్మములో లీనమగును.