Search This Blog

Chodavaramnet Followers

Saturday 9 August 2014

IMPORTANCE OF PUJA ON THE OCCASION OF SRAVANA SUKRUVARAM - GODDESS LAKSHMI PUJA IN SRAVANA MASAM SPECIAL ARTICLE IN TELUGU


శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మీని పూజించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున లేదా ప్రతి శుక్రవారం నాడు మహిళలు నిష్ఠతో మహాలక్ష్మిని పూజిస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం ముఖ్యంగా శ్రావణ రెండో శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం, ఆయుష్యు బాగుంటుందని మహిళల విశ్వాసం. వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు పూర్ణాలు, గారెలతో వాయినాలిచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరణ చేసి పేరంటాలను పిలిచి తాంబూళం, శెనగలు ఇస్తారు. ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగాదలిచి గౌరవిస్తారు.

శ్రావణ మాసంలో గోవులు, తామరపుష్పాలు, పాడిపంటలు, ఏనుగులు, అద్దాలు, శంఖనాదం, ఘంటారావం, హరిహరార్చన, పూజామందిరం, సర్వదేవతలనూ అర్చించే వారి స్వరం, తులసి ఉన్న ప్రదేశం, పువ్వులు, పండ్లతోటలు, మంగళకరమైన వస్తువులు, మంగళవాద్యాలు, దీపకాంతులు, కర్పూర హారతి, చెట్లలోని హరిత వర్ణం, స్నేహం, ఆరోగ్యం, ధర్మబుద్ధి, న్యాయస్థానాలు, శుచి, శుభ్రత, సదాచార పరాయణత, సౌమ్యగుణం, స్త్రీలు ఎటువంటి చీకూచింతా లేకుండా హాయిగా ఉండే ఇళ్లు, బ్రాహ్మణులు, విద్వాంసులు, పెద్దలు, పండితులకు సన్మాన సత్కారాలు జరిగే ప్రదేశాలు, వేదఘోష, సత్వగుణ సంపదలు, క్రమశిక్షణ, కార్యశూరత్వం, సమయపాలనలోనూ మహాలక్ష్మీ దేవి నివసిస్తుందని పురోహితులు చెబుతున్నారు.

అందుచేత శ్రావణ శుక్రవారం పూట తులసీపూజ, ఆలయాల్లో పాలు, తేనెతో అభిషేకాలు చేయించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు సూచిస్తున్నారు. శ్రావణ శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, ఇంటిని, పూజగది శుభ్రం చేసుకోవాలి.

గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. అనంతరం అమ్మవారి ప్రతిమ లేదా పటానికి కర్పూర హారతులు సమర్పించి, చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టాలి. పూజా సమయంలో దుర్గాష్టకం లేదా ఏదేని అమ్మవారి శ్లోకములతో స్తుతించాలి.

ఇంకా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఉపవాసముండి, అమ్మవారిని ప్రార్థించే వారికి దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పురోహితులు అంటున్నారు. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మీ లేదా అమ్మవారిని ఆలయాల్లో దర్శించుకునే వారికి పుణ్యఫలితాలు చేకూరుతాయని విశ్వాసం.

అంతేగాకుండా.. మల్లెపువ్వులు, కస్తూరి, జాజిపువ్వులను అమ్మవారి కోసం సమర్పించి, నేతితో దీపమెలిగించే వారికి ఈతిబాధలు తొలగిపోయి, అనుకున్న కార్యాలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు.