Search This Blog

Chodavaramnet Followers

Monday 16 December 2013

TELUGU ARTICLE ON SANJEEVINI PARVATHAM


రామాయణము మహాభారతము పుక్కిటి పురాణాలని అమ్మమ్మలు చెప్పుకునే కధలనీ ఆక్షేపించేవారి మాటలు విని మనసు చిన్నబుచ్చుకునే హిందూ బంధువులందరికీ నా సలహా: మన హైందవమతం చాలా అధ్భుతమైనది. అనేక నిగూఢమైన రహస్యాలను కలిగినది. మీకు స్వాంతన కలిగించడానికి కొన్ని ఉదాహరణలు చెబుతాను:

౧) "అసలు భూమిమీదకు ఇంత నీరు ఎలా వచ్చింది?! భూమి పుట్టినపుడు చాలా చాలా వేడిగా ఉండేది. ఆరోజుల్లో భూమికి ఆకర్షణశక్తిగూడా అతి స్వల్పం మరి నీరు ఆవిరి అవకుండా మాయమవకుండా ఎలా ఉంది? మిగిలిన గోళాలమీద లేని నీరు భూమిమీదే ఎందుకు ఉంది?" ఈ ప్రశ్నలు మన శాస్త్రజ్ఞులను ఇవాల్టికిగూడా సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. ఇంతవరకు నిర్ధిష్టమైన సమాధానం దొరకని ప్రశ్న ‘భూమిమీదకు నీరు ఎలా వచ్చింది?‘ అనేది. కానీ హైందవమతంలోని గంగావతరణం కధ మనందరికీ తెలిసినదే! భగీరధుడు భూమిమీదకు ఎక్కడో విష్ణుపాదోధ్బవిగా భువనభాండాలకు అవతల సుదూరంలో వైకుంఠపాదంవద్దనున్న ఆకాశ గంగను భూమిమీదకు తెద్దామనుకున్నాడు. గంగమ్మను ప్రార్ధిస్తే ‘నాయనా భగీరధా! నేను గానీ భూమిమీదకు వస్తే నా ధాటికి భూమి కొట్టుకుపోతుంది. కాబట్టి ఏదో ఉపాయం ఆలోచించుకో‘ అని సలహా చెబుతుంది. దాంతో భగీరధుడు శివుడిని ప్రార్థిస్తాడు. శివుని అనుగ్రహంవల్ల చివరకు మనకు గంగ భూమిమీదకు వచ్చి సముద్రాలు ఏర్పడ్డాయి. ఈ కధ మనకు తెలిసిందే.... మొన్నీమధ్యవరకు ఈ కధ చెబితే పాశ్చాత్య హేతువాదులు నవ్వి ఇదేంకధ 'భూమిమీద నీరు ఉంటుంది గానీ భూమే కొట్టుకుపోయేటంత నీరుంటుందా?!’ అన్నారు. హిందువులను అవహేళన చేసారు.. కానీ ఒక మూడు సంవత్సరాలక్రితం నాసా శాస్త్రవేత్తలు ఒక అద్బుతాన్ని కనుగొన్నారు. సుదూర తీరాలలో మన విశ్వంలోని పాలపుంత దగ్గర కొన్ని లక్షలకోట్ల భూములు మునిగిపోయేటంత నీరు ఉన్నదట! కాబట్టి ఆ ఆకాశగంగ గానీ భూమిమీదకు వస్తే భూమి కొట్టుకుపోతుందన్న మాట నిజమేగదా!?! అది విన్న తర్వాతనుండీ శాస్త్రవేత్తలు హైందవపురాణాలను పూచికపుల్లల్లా తీసిపారేయకుండా మరింత శ్రద్ధగా అధ్యయనం చెయ్యడం మొదలుపెట్టారు.

౨) పిలిప్పైన్స్ దేశానికి తూర్పుగా ‘నాన్ మదోల్‘ అని ఒక చోటు ఉంది ఆస్ట్రేలియాకి ఆగ్నేయంగా రెండువేలమైళ్లదూరంలో ఒక చిన్న ద్వీపం. ఈ ద్వీపంలోని సముద్రంలో అతి పురాతనమైన పాడుబడ్డ సముద్ర నగరం ఉంది. నేను వెళ్లి చూసి వచ్చాను. ఈ నగరం అద్భుతం ఏంటంటే ఇది పూర్తిగా సముద్రంలో కట్టబడింది. ఒక్కొక్కటి ఎభైటన్నులకు పైగా బరువుండే బాసాల్ట్ రాళ్లు కొన్ని కోట్ల రాళ్లు వాడి ఈ నగరాన్ని పూర్తిగా సముద్రంలో నిర్మించారు. ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుబట్టని ప్రశ్నలు (౧) ఎవరు ఈ నగరాన్ని కట్టారు? (౨) ఎందుకు సముద్రంలో అంత కష్టపడి కట్టారు? (౩) ఈ బాసాల్ట్ రాళ్లు అన్ని కోట్లరాళ్లు ఎక్కడినుండి తెచ్చారు? (౪) అసలు ఈ రాళ్లు ఎక్కడినుండి తెచ్చారు? ఆ రాళ్లు ఆ చుట్టుపక్కల వేలమైళ్లదూరంలోగూడా దొరకవు. మరి ఎక్కడినుండి తెచ్చారు (౫) ఆ రాళ్లు ఎత్తడానికి ఇప్పటి క్రేన్లుగూడా కష్టపడతాయి మరి వాళ్లు ఒకదానిపై ఒకటి పేర్చి ముప్పై అడుగులు ఎత్తు గోడలు ఎలా కట్టారు? అసలు పూర్తి నగరాన్ని ఎలా కట్టారు? (౭) ఆ నగరానికి క్రింద సొరంగాలు ఉన్నాయి. అది ఒక అద్భుత నగరం... ఇప్పటికీ దాని రహస్యం రహస్యంగానే మిగిలిపోయింది.

http://en.wikipedia.org/wiki/Nan_Madol

మనకు తెలుసు మనశ్రీకృష్ణుభగవానుడు సముద్రంలో ద్వారకానగరాన్ని నిర్మించారు అని. ఆ నగరం ఎలా ఉండేదో మనకు తెలియదు. కానీ నాకు అనిపించేదేటంటే బహుశా మన ద్వారక ‘నాన్ మదోల్‘ లాగా ఉండి ఉండచ్చు. బహుశా ద్వారకనిర్మాణంలో పాలుపంచుకున్నవారి వంశీకులెవరో అక్కడకు ప్రయాణం చేసి తమకు తెలిసిన అద్భుతవిజ్ఞానాన్ని వాడి ‘నాన్ మదోల్‘ నిర్మించి ఉండవచ్చు.

౩) ఊర్వశి బ్రహ్మదేవుని తొడనుండి పుట్టిందని చెప్పారు. నిన్నే నేనొక విషయం విన్నాను. క్లోనింగ్ లో మానవుని తొడనుండి కణం క్లోన్ చేస్తే ఊర్వశివంటి అద్భుతమైన అందగత్తె పుట్టే అవకాశం ఉందని! అంటే తననుండి తన ప్రతిరూపాన్ని సృష్టించుకోవడమే క్లోనింగ్ గదా! బ్రహ్మ అలా చేసాడని పురాణాలు రాస్తే నవ్వినవారు ఇప్పుడు ఔరా అని ముక్కున వేలువెసుకుంటున్నారు.

౪) సృష్టి అనేది ప్రతిక్షణం కనబడి మాయమవుతుందనీ ఏది నీకు కనబడుతోందో అది ఇంతకు ముందరలేదనీ నీకు కనబడి మళ్లీ శూన్యంలోకి మాయమవుతుందనీ భగవద్గీత శాక్తేయపురాణాలు తంత్రము చెబుతాయి. దాన్నిగూడా కొట్టిపారేసిన హేతువాదులు క్వాంటమ్ ఫిజిక్స్ లోని ష్రోడింగర్ కాట్ అనే సిద్ధాంతం అలాగే అనేకమైన సిద్ధాంతాలు మనకు కనబడేదంతా నిజంగానే మాయ అని ‘ఆదిశంకర సిద్ధాంతం‘ నిజమని పూర్తిగా నిరూపించారు.

నేననేదేంటంటే మన పూర్వీకుల ఆలోచనల్లో ఊహల్లో నిర్దేశాల్లో ఒక స్పష్టత ఉన్నది. వాళ్లకున్న స్పష్టత మనలో లేదు. అందువల్ల పాత అంతా రోత అని తీసెయ్యకుండా ఒక శ్రధ్ద విశ్వాసంతో వాళ్లు చెప్పినవి చదివితే పురాణాల్లోని అద్భుతాలు మనని ఆనందపరుస్తాయి. ఇవాళ మనకు అసాధ్యం అనిపించేవి రేపు సాధ్యం కావచ్చు! కాబట్టి హైందవ పురాణాలను పుక్కిటిపురాణాలుగా కొట్టెయ్యకండి. ఓం తత్సత్ స్వస్తి