షాంపూను కేవలం జుట్టు శుభ్రం చేసుకోవడానికే కాదు ఇతరత్రా శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. దానిని మీ దుస్తుల మీద మొండి మరకలు పోగొట్టడానికీ ఉపయోగించవచ్చు లేదా జిడ్డు గిన్నెలు తోమే సమయంలో సోప్‌వాష్ అందుబాటులో లేకపోయినా ఉపయోగించవచ్చు. ఇందుకు ఖరీదైన షాంపూలనే ఉపయోగించనవసరం లేదు కానీ దీని ఉపయోగాలను గమనిస్తే అవసరమైనప్పుడు దానిని వాడవచ్చు.
హెయిర్ బ్రష్‌లు, దువ్వెనలు శుభ్రం చేసుకోవడానికి... జిడ్డుగా ఉన్న జుట్టును శుభ్రం చేయగల షాంపూ దువ్వెనలను, బ్రష్‌లను చేయలేదా? శుభ్రంగా తలంటి పోసుకొని అపరిశుభ్రమైన దువ్వెన్నలను, బ్రష్‌లను తల్లో పెట్టుకోవడం సరైనది కాదు కదా. కనుక దానిని శుభ్రంగా ఉంచాలనుకుంటే ముందుగా ఒక చిన్న బక్కెట్లో వేడి నీళ్ళు పోసి అందులో మీకిష్టమైన షాంపూను ఒక రెండు టేబుల్ స్పూన్లు వేయాలి. తర్వాత హెయిర్ బ్రష్‌లను అందులో వేసి ఒక గంట ఉంచాలి. తర్వాత బయటకి తీసి మంచినీటితో కడిగేయడమే. అవి కొత్త వాటిలా తళతళలాడుతూ శుభ్రంగా ఉంటాయి.
మరకలు పోగొట్టేందుకు...
షాంపూలు మరకలు పోగొట్టడంలో పెద్ద పాత్ర పోషిస్తాయి. దుస్తులపై మొండి మరకలు ఉన్నప్పుడు డ్రైక్లీనింగ్‌కు ఇచ్చో, ప్రత్యేక రిమూవర్ కొనేందుకు డబ్బు తగలేసే బదులు ఇంట్లో అందుబాటులో ఉన్న షాంపూను ఉపయోగించుకోవడం చౌక. మరకలపై కాస్త షాంపూ రాసి తర్వాత దానిని చల్లనీళ్ళతో ఉతకాలి. అంతే మరకమాయమవడమే కాదు అనవసరమైన ఖర్చు తప్పుతుంది.
డిష్ వాషర్‌కి ప్రత్యామ్నాయంగా...
గిన్నెలు తోమే డిటర్జెంట్ అయిపోయినప్పుడు వెంటనే దొరికే ప్రత్యామ్నాయం షాంపూ. కొద్ది షాంపూ తీసుకొని అందులో కొద్ది నీరు పోసి వాషింగ్ లిక్విడ్ అంత మందంగా చేసుకొని స్క్రబ్‌తో తోముకుంటే గిన్నెలు మిలమిలలాడతాయి. ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్న చిట్కాలు. పాటించి చూస్తే పోయేది ఏమీ ఉండదు.