Search This Blog

Chodavaramnet Followers

Monday 28 January 2013

A PATHAN'S STORY IN TELUGU - CHILDRENS SPECIAL


పఠాన్ గర్వం .. ఆఫ్గన్ జానపద గాథ


‘ఈద్’ పండగ దగ్గర పడుతుండటంతో కట్టెలు కొట్టి జీవించే అలామత్‌లో ఆందోళన పెరిగసాగింది. తనకూ, పిల్లలకూ పండగకు కొత్త బట్టలు కుట్టించుకోవటానికి డబ్బులు తెమ్మని భార్య ప్రాణాలు తోడేస్తున్నది. అతడి దగ్గరేమో చిల్లిగవ్వ లేదు. డబ్బు కోసం ఆలోచనలతో సతమతమవుతుండగా, అతడికి గాడిద మీద బట్టల మూటలు వేసుకుని వస్తున్న ఓ వ్యాపారి కనిపించాడు. తన సమస్యకు పరిష్కారం దొరికిందని ఆనంద పడ్డాడు. వెంటనే మూడు రాళ్ళు ఏరుకుని, ఆ వర్తకుడు తన దగ్గరికి రాగానే ఓ రాయి విసిరాడు. అది అతడి భుజానికి తగలడంతో వెనుకంజ వేసాడు.
‘‘నీకు నేనేం అపకారం చేసాను? ననె్నందుకు కొడుతున్నావు?’’ -అడిగాడు ఆ వర్తకుడు.
‘‘నువ్వేమీ అపకారం చెయ్యలేదు. నేను దోపిడీ దొంగను. నాకు నీ బట్టలమూటలు కావాలి’’ అన్నాడు అలామత్ .
‘‘నినె్నదిరించే ధైర్యం నాకు లేదు, అలాగే తీసుకో’’ అన్నాడు వర్తకుడు.
అయినా, అలామత్ అతడి మీదికి ఇంకో రాయి విసిరాడు. దాంతో అతడు మరింత బెదిరిపోయాడు.
‘‘బట్టలు తీసుకోమన్నాను కదా. మళ్ళీ ఎందుకు రాళ్ళేస్తున్నావు?’’ అని అడిగాడు వర్తకుడు.
‘‘దోపిడీ అనేది ఎప్పుడూ మోసంతో వుండాలి. అలాకాకుంటే అడుక్కునే వాడికీ, నాకూ తేడా ఏముంటుంది? ’’ అన్నాడు అలామత్.
అలా అంటూనే మూడో రాయిని విసిరాడు. అది చూసి అతడు తన గాడిదను, బట్టల మూటలను వదిలిపెట్టి పరుగుతీశాడు.
అలామత్ గాడిద మీద వున్న బట్టల మూటలను తీసుకెళ్ళి తన భార్య కాళ్ళదగ్గర పడవేసి, ‘‘నీకూ, పిల్లలకు, మీ బంధుమిత్రులకు కావాల్సినన్ని బట్టలు కుట్టించుకో’’ అన్నాడు.
అవి ఎక్కడివో, ఎలా తెచ్చాడనేది ఆమె పట్టించుకోలేదు. ఈద్ పండగ రావటమూ, గడిచిపోవటమూ అయింది.
* * *
ఓ రోజు అలామత్ సంతకు వెళ్ళి చిక్కుడుకాయలు కొంటుంటే, అతడి భుజంపై ఎవరిదో చెయ్యి బలంగా పడింది.
‘ఎవరబ్బా?’ అనుకుంటూ వెనుదిరిగి చూసేసరికి ఎదురుగా- ఆమధ్య తాను దోపిడీ చేసిన వర్తకుడే! అతణ్ణి చూస్తూనే బిక్కచచ్చిపోయాడు అలామత్.
‘‘ఏం భాయ్? ఏం కొంటున్నావు?’’ అడిగాడు వర్తకుడు.
‘‘చిక్కుడుకాయలు’’ అన్నాడు అలామత్ నీళ్ళు నములుతూ.
‘‘నువ్వు చిక్కుడుకాయలు కొనాల్సిన పనిలేదు. నాకు ఈసారి చిక్కుడు పంట బాగా పండింది. ఎన్ని బస్తాలు కావాలన్నా ఉచితంగా ఇస్తా. నాతో రా’’ అన్నాడు వర్తకుడు.
అతనికి యిరువైపులా యిద్దరు వస్తాదులు వున్నారు. వాళ్ళను చూసి తల వూపక తప్పలేదు అలామత్‌కు.
వర్తకుడి ఇంటికి చేరుకున్నాక అతడు భార్యను పిలిచి ‘‘అతిథులొచ్చారు. తినటానకేమన్నా తీసుకురా’’ అన్నాడు.
అలామత్ తనముందు పెట్టిన తినుబండారాలను కానీ, పానీయాలను కానీ ముట్టుకోలేకపోయాడు. ‘ఇతడు తనకు ఏం శిక్ష విధిస్తాడో?’ అని భయపడ్డాడు. ఈ గండం గడిస్తే ఎప్పుడూ తప్పులు చెయ్యను- అని మనసులోనే గట్టిగానే నిర్ణయించుకున్నాడు.
ఆఖరికి ఎలాగో నోరు పెకలించుకుని, ‘‘అయ్యా.. త్వరగా చిక్కుడు కాయలు ఇప్పిస్తే వాటి ఖరీదు చెల్లించి తీసుకెళ్తా’’ అన్నాడు.
ఆ వర్తకుడు ఒక బస్తానిండా చిక్కుడుకాయలు తెప్పించి అలామత్ వచ్చిన గాడిద మీద పెట్టించి, ‘‘ఇంక నువ్వు వెళ్ళొచ్చు’’ అన్నాడు.
‘‘అయ్యా, నాకు ఇన్ని కాయలు అవసరం లేదు. నా దగ్గర అంత డబ్బులేదు’’అన్నాడు అలామత్.
‘‘నేను ఉచితంగానే ఇస్తానన్నాకదా. తీసుకెళ్ళు’’ అన్నాడు వర్తకుడు.
‘‘ఉచితంగానా? నేనేమన్నా బిచ్చగాణ్ణా? అలా అనటానికి ఎంత ధైర్యం?’’ అన్నాడు అలామత్ బింకంగా.
అలా అంటూ కోపంగా తన గాడిదపై వున్న చిక్కుడుకాయల బస్తాను కింద పడెయ్యబోతుంటే, అతడి వీపుపై తుపాకీ గొట్టం బలంగా గుచ్చుకుంది.
‘‘మర్యాదగా నీ గాడిదపై ఎక్కి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. లేకుంటే నీ తలకాయ ఎగిరిపోతుంది’’-అని గర్జించాడు వర్తకుడు.
ఒక బిచ్చగాడికి దానం చేసినట్టుగా తనకు చిక్కుడుకాయలు ఉచితంగా ఇవ్వటం చాలా అవమానకరంగా భావించాడు అలామత్. కానీ ప్రతిఘటించటం వృథా ప్రయాసే కాక తనను కాల్చినా కాల్చిపారేయవచ్చు- అని అర్ధమయి, అవమాన భారాన్ని బలవంతంగా దిగమింగుకుంటూ గాడిద మీద ఎక్కి ఇంటి ముఖం పట్టాడు.
అప్పటినుంచి అలామత్ ప్రతివారం ఒక కట్టెలమోపు చొప్పున ఆ వర్తకుడి ఇంటిముందు వేయసాగాడు. అట్లా క్రమం తప్పక పది సంవత్సరాలపాటు వేసాక ఒకరోజున ఆ వర్తకుడు, ‘‘ఇక చాలు. నా బట్టలకు, చిక్కుడుకాయలకు తగిన మూల్యం లభించింది’’అన్నాడు.
అలామత్ ఆయనకు నమస్కరించి, సగర్వంగా తలెత్తుకుని గాడిద మీద ఇంటికి బయలుదేరాడు. ఇక తనను బిచ్చగాడని ఎవరూ అనలేరని లోలోపల ఎంతగానో సం తోషపడ్డాడు.