Search This Blog

Chodavaramnet Followers

Monday 29 August 2016

PURANA TELUGU STORY ABOUT DHUNDHUMARUDU


దుంధుమారుని కథ 

ఆయుర్దాయం ఉన్నంత కాలం మానవులెలాగూ బ్రతుకుతారు. మరణించిన తరువాతకూడా కీర్తి కాయులై జీవించి ఉండటం ఎంతో గొప్ప విషయం. ఇది వారి సత్ప్రవర్తన, సమాజహిత కార్యాచరణ, కావ్య, కళానిర్మాణదక్షత మొదలైన వాటిని అనుసరించి ఉంటుంది. దీనిని గూర్చి ఆంధ్రమహాభారతం, అరణ్యపర్వంలో ఒక ప్రతీకాత్మకమైన కథ ఉంది. దీనిని మార్కండేయమహర్షి ధర్మరాజుకు చెప్పాడు.

పూర్వం హైహయ వంశానికి చెందిన "ధుంధుమారుడు" అనే రాజకుమారుడు వేటకు వెళ్ళి, జింక చర్మం ధరించి పొదలమాటునుంచి కనిపిస్తున్న ఒక బ్రాహ్మణ యువకుణ్ణి జింకగా భావించి బాణంతో కొట్టి చంపాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ యువకుని కళేబరం కనిపించింది. తన పొరపాటువల్ల ఇంత అనర్థం జరిగిందే అని బాధపడి, ఇంటికి వెళ్ళి తన వృద్ధ బంధుజనులకు ఈ విషయం చెప్పి, వారిని ఆ ప్రదేశానికి తీసుకువచ్చి ఆ యువకుని మృతకళేబరాన్ని చూపించాడు.

వారందరూ అక్కడికి సమీపంలో ఉన్న "తార్క్ష్యుడు " అనే మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన వారిని ఆదరంగా ఆశీర్వదించి, వారికి అతిథిసత్కారాలు చేయవలసినదిగా తన శిష్యులను నియోగించాడు. అపుడు హైహయులు మహర్షికి నమస్కరిస్తూ "మహర్షీ ! మా మీది అనుగ్రహంతో మీరు మాకు అతిథిసత్కారాలు చేయిస్తున్నారు. కానీ వాటిని అందుకోదగిన అర్హత మాకు లేదు. ఇడుగో.. మా వంశానికి చెందిన ఈ రాజకుమారుడు మీ ఆశ్రమ ప్రాంతంలో ఒక బ్రాహ్మణయువకుణ్ణి జింకగా భ్రమించి బాణంతో నేలగూల్చాడు. ఈ మహాపాపానికి నిష్కృతి ఏముంటుంది. ఈ విషయాన్ని తమకు నివేదించటానికే వచ్చాం" అన్నారు.

అపుడు తార్క్ష్యుడు చిరునవ్వు నవ్వుతూ "త్రిలోకాలకూ ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి మీకు చెప్పాలి. మా ఆశ్రమంలో ఎవరికీ భయం, వ్యాధి, దుర్గతి, మరణం ఉండనే ఉండవు. అందువల్ల ఈ రాజకుమారుడు ఇక్కడ ఎవరినో చంపాడనటం మీ భ్రమ" అని తపోబల సంపన్నుడు, తేజస్వి అయిన ఒక యువకుణ్ణి పిలిచి వారికి చూపుతూ "చూడండి .. మీ రాజకుమారుడు బాణంతో కొట్టినది ఇతనినేనా?" అన్నాడు.

ఆశ్చర్యం ! రాజకుమారుడు చంపింది ఈ యువకుణ్ణే! పైగా ఇతడు తార్క్ష్య మహర్షికి కుమారుడట. తమ కళ్ళతో తాము ఈ యువకుని మృతదేహాన్ని చూశారుకదా!కానీ ఇతడు జీవించే ఉన్నాడే! ఇది ఎలా సంభవం? హైహయులు ఆశ్చర్యపడి తార్క్ష్యునితో "మహర్షీ!ఈ యువకుడు మరణించి పునర్జీవితుడయ్యాడు. ఈ మహత్తు విస్మయకరం. ఇంతటి మహిమ ఇతనికి ఎలా సిద్ధించింది?" దయచేసి చెప్పండి అని అడిగారు.

"ఆలస్యంబొకయింత లేదు, శుచి యాహారంబు, నిత్యక్రియా
జాలంబేమఱ, మర్చనీయు లతిథుల్, సత్యంబు పల్కంబడున్
మేలై శాంతియు, బ్రహ్మచర్యమును నెమ్మిందాల్తు, మట్లౌట నె
క్కాలంబుం బటురోగ మృత్యుభయ శంకంబొంద మేమెన్నడున్" అన్నాడు.

* ఆ ఆశ్రమవాసుల అమరత్వ లబ్ధికి మహర్షి చెప్పిన కారణాలు ఇవీ -

* చేయవలసిన పనులు చేయటంలో ఒకయింతైనా ఆలస్యం చేయరు
* శుచియైన ఆహారం మాత్రమే భుజిస్తారు
* అనుదిన క్రియా కలాపాలలో ఏమఱుపాటు చెందరు
* అతిథులు వారికెప్పుడూ పూజనీయులే
* కేవలం సత్యాన్ని పలుకుతారు
* ఐచ్ఛికంగా శాంతస్వభావాన్ని, బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు

ఈ ఆరు లక్షణాలను ఆధునిక సమాజం ఎంతవరకూ సమాదరిస్తోంది అనేది ఆలోచించవలసిన అంశం. సంకల్పబలం ఉంటే వీనిలో ఆచరణకు అసాధ్యమైనవి ఉండవు. వీటిని ఆచరణలో చూపిస్తే ఆఫీసుల్లో పెండింగ్ ఫై ల్స్ ఉండవు. కలుషితాహారం తిని అస్వస్థులై ఆసుపత్రుల పాలయ్యేవారుండరు. పనులు చేయటంలో రేపు, మాపు అని బద్ధకంతో వాయిదాలు వెయ్యటం ఉండదు.అతిథులు వస్తారంటే , లేదా మనమే అతిథులుగా ఎవరింటికో వెళ్లవలసి వస్తే భయపడవలసిన అవసరం ఉండదు. అసత్య దోషం ఉండదు. కక్షలూ, అత్యాచారాలూ ఉండవు. నిజానికి ఈ అంశాలన్నింటికీ నేపథ్యంగా ఒక ఆధ్యాత్మిక దృక్పథం ఉంది. ఆచరణలో అది ప్రతిష్ఠితమైతే అమరత్వమే సిద్ధిస్తుంది. ఇలాంటి సత్ప్రవర్తన కలిగిన సజ్జనులు భౌతికంగా మరణించినా మరణాన్ని జయిస్తారని గ్రహించాలి.

" జీవంతం మృతవన్మన్యే దేహినం ధర్మ వర్తనం
మృతో ధర్మేణ సంయుక్తో దీర్ఘజీవీ న సంశయః " అని పెద్దల మాట.

"ధర్మాన్ని త్యజించినవాడు జీవించి ఉన్నా చనిపోయినవానిగానే పరిగణింపబడుతాడు.

" ధర్మైక జీవి మృతుడైనా చిరంజీవి " అనటంలో సంశయం లేదు" అని దీని భావం